ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్ టేబుల్ టెన్సిస్ (టీటీ) సింగిల్స్‌లో ఆచంట శరత్ కమల్ బంగారు పతకం సాధించాడు. అంతకుముందు మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలోనూ ఆకుల శ్రీజతో కలిసి స్వర్ణం నెగ్గాడు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో మొత్తం 13 పతకాలు గెలిచిన శరత్ కమల్‌కు మన రాజమహేంద్రవరంతో ప్రత్యేక అనుబంధం ఉందన్న విషయం చాలామందికి తెలీదు. కమల్ ప్రస్తుతం నివాసముంటున్నది చెన్నైలోనే అయినా టీటీలో అతన్ని తీర్చిదిద్దిన తండ్రి ఆచంట శ్రీనివాసరావు క్రీడా ప్రస్తానానికి బీజం పడింది ఇక్కడే. శ్రీనివాసరావు టేబుల్ టెన్నిస్ నేర్చుకుందీ.. అనంతరం కోచ్‌గా ఎదగడానికి ఇక్కడే నాంది పడింది.
– సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)
అది 1970వ సంవత్సరం. రాజమహేంద్రవరం కందుకూరి వీరేశలింగం పురమందిరం(టౌన్‌హాల్)లో కొంత మంది యువకులు టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆడుతున్నారు. వారి ఆటను 17 ఏళ్ల యువకుడు తదేకంగా చూస్తున్నాడు. రోజూ అక్కడకు వచ్చి, ఆటను చూడటం ఆతడికి అలవాటుగా మారింది. తరువాత తానూ ఆ ఆట ఆడాలని నిర్ణయించుకున్నాడు. అంతే.. కొద్ది రోజుల్లోనే టేబుల్ టెన్నిస్‌లో చిచ్చర పిడుగులా మారాడు. రోజంతా టీటీ ఆడినా అలసట అనేదే తెలిసేది కాదు. ఆయనే ఆచంట శ్రీనివాసరావు.. ఫాదర్ ఆఫ్ ఆచంట శరత్ కమల్.
మచిలీపట్నంలో జననం
తన తల్లి పుట్టిల్లు మచిలీపట్నంలో 1953 నవంబర్ 1న శ్రీనివాసరావు జన్మించారు. తండ్రిది రాజమహేంద్రవరం కావడంతో ఇక్కడే పెరిగారు. తమ్ముడు మురళీధర్‌తో కలిసి రోజూ టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ చేసేవారు. 1973, 74 సంవత్సరాల్లో చైన్నె, ఇండోర్‌లలో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
మెరికల్లాంటి శిష్యులు
శ్రీనివాసరావు వద్ద శిష్యరికం చేస్తే చాలు.. గోల్డ్ మెడల్ సాధించడం ఖాయమనే పేరు వచ్చింది. ఆయన వద్ద శిక్షణ పొందిన చేతన్ పి. బాబున్, ఎస్.రామన్, ఎంఎస్ మైథిలి, ఎన్‌ఆర్ నాయుడు, కె.షామిని, భువనేశ్వరి, ఆచంట రజత్ కమల్, ఆచంట శరత్ కమల్ తదితరులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. శిష్యుల ద్వారా సాధించిన అపూర్వ విజయాలతో కేంద్ర ప్రభుత్వం శ్రీనివాసరావును గుర్తించింది.
2018లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ద్రోణాచార్య అవార్డు ఇచ్చి సత్కరించింది. ప్రస్తుతం కామన్‌వెల్త్ గేమ్స్‌లో రాణిస్తున్న తన కొడుకు శరత్ కమల్‌ను కూడా స్వయంగా శ్రీనివాసరావే తీర్చిదిద్దారు. అతడు సాధించిన విజయాల్లో ఆయన పాత్ర చాలా ఉంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో శ్రీజ – శరత్ కమల్ జోడీ, సింగిల్స్‌లో శరత్ కమల్ ఆట తీరును ఆసాంతం తిలకించిన శ్రీనివాసరావు.. వారు స్వర్ణ పతకాలు సాధించడంతో సగర్వంగా తలెత్తుకున్నారు.
మలుపు తిప్పిన చైన్నె
శ్రీనివాసరావుకు చైన్నె ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. దీంతో భార్య అన్నపూర్ణతో కలిసి చైన్నె చేరుకున్నారు. అక్కడ అర్జున అవార్డు గ్రహీత జి.జగన్నాథ్‌తో కలిగిన పరిచయం శ్రీనివాసరావు జీవితాన్ని మలుపు తిప్పింది. ‘ఇంతటి సామర్థ్యం ఉన్న ఆటగాడివి ఇలా ఉండిపోవడం బాగోలేదు. ఆటగాడిగా కాకపోయినా కోచ్‌గా అయినా మారు’ అని జగన్నాథ్ సలహా ఇచ్చారు. దీంతో పాటియాలాలోని ఎన్‌ఐఎస్‌లో కోచ్‌గా శ్రీనివాసరావు శిక్షణ పొందారు. 1983లోనే కోచింగ్ రంగంలో డిప్లొమా సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment