ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–1తో ఆతిథ్య కజకిస్తాన్ జట్టుపై గెలిచింది. 2021, 2023 ఆసియా టీటీ టోర్నీల్లో భారత జట్టు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు సాధించింది.
కజకిస్తాన్‌తో జరిగిన పోరులో తొలి మ్యాచ్‌లో మానవ్ 11–9, 11–7, 11–6తో గెరాసిమెంకోపై నెగ్గాడు. రెండో మ్యాచ్‌లో కుర్మంలియెవ్ 11–6, 11–5, 11–8తో హర్మత్ దేశాయ్‌ను ఓడించాడు. మూడో మ్యాచ్‌లో శరత్ కమల్ 11–4, 11–7, 12–10తో కెంజిగులోవ్‌పై గెలిచాడు.
నాలుగో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 6–11, 11–9, 7–11, 11–8, 11–8తో గెరాసిమెంకోను ఓడించడంతో భారత్ 3–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో చైనీస్ తైపీతో భారత్ ఆడుతుంది. మరోవైపు భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 1–3తో జపాన్ చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment