గత నాలుగు సీజన్లుగా భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్లకు చక్కని అవకాశాలు కల్పిస్తున్న అల్ట్‌మేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) ఫ్రాంచైజీ లీగ్ టోర్నీకి రంగం సిద్ధమైంది. నేటి నుంచి చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో యూటీటీ ఐదో సీజన్ పోటీలు జరుగనున్నాయి.
డిఫెండింగ్ చాంపియన్ గోవా చాలెంజర్స్‌తో పాటు మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 4 వరకు లీగ్ దశ పోటీలు జరుగుతాయి.
తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్ల మధ్య 5, 6 తేదీల్లో సెమీఫైనల్స్... 7న జరిగే ఫైనల్స్‌తో ఐదో సీజన్ ముగుస్తుంది. ప్రతి రోజూ రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే మ్యాచ్‌లను స్పోర్ట్స్–18 చానెల్‌లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో సత్తాచాటి మహిళల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన తెలంగాణ ప్లేయర్ ఆకుల శ్రీజ ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. అయితే పురుషుల కేటగిరీలో హైదరాబాదీ ఆటగాడు సూరావజ్జుల స్నేహిత్ జైపూర్ పేట్రియాట్స్ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఈ సీజన్‌లో రాణించడం ద్వారా అందరి దృష్టిలో పడేందుకు అతను ఉవ్విళ్లూరుతున్నాడు.
భారత స్టార్ మహిళా ప్లేయర్ మనిక బత్రా బెంగళూరు స్మాషర్స్ తరఫున సత్తా చాటేందుకు సిద్ధమైంది. శ్రీజతో పాటు మనిక కూడా పారిస్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్‌దాకా పోరాడింది. యూటీటీ టోర్నీ సందర్భంగా 29 ఏళ్ల మనిక మాట్లాడుతూ తన ప్రదర్శన మెరుగయ్యేందుకు ఈ ఫ్రాంచైజీ లీగ్ ఎంతగానో దోహదం చేసిందని చెప్పుకొచ్చింది.
‘వ్యక్తిగతంగా నేను రాణించేందుకు ఈ టోర్నీ ఉపయోగపడింది. విదేశీ ప్లేయర్లతో కలిసి ఆడటం ద్వారా మెలకువలు నేర్చుకునేందుకు, దీటుగా పోరాడేందుకు యూటీటీ దోహదం చేసింది. ఈ టోర్నీని ప్లేయర్లంతా ఆస్వాదిస్తున్నారు.
మరి ముఖ్యంగా మహిళల సింగిల్స్‌లో పురోగతికి యూటీటీ కూడా ఒక కారణం. అంతర్జాతీయంగా మన క్రీడాకారిణులు సాధిస్తున్న విజయాలు యూటీటీ చలవే’ అని మనిక తెలిపింది. నిరుటి రన్నరప్ చెన్నై లయన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట శరత్ కమల్ మాట్లాడుతూ భారత ఆటగాళ్లు రాటుదేలేందుకు యూటీటీ చక్కని వేదికని అన్నాడు.
దీనివల్లే మన జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే కాదు... ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చాయని చెప్పాడు. మహిళల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్, టీమ్ ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్ చేరడం గొప్ప మైలురాయని శరత్ తెలిపాడు.
ఈ టోర్నీలో ఆడటాన్ని అమితంగా ఇష్టపడతానని పేర్కొన్నాడు. పారిస్ మెగా ఈవెంట్‌లో శరత్‌కు ఊహించని విధంగా తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. కెరీర్‌లో చివరి ఒలింపిక్స్ ఆడిన 42 ఏళ్ల శరత్ రిటైర్మెంట్ అనంతరం అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్లే యోచనలో ఉన్నాడు. దీనిపై భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్యతో పాటు, తన కుటుంబసభ్యులతో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు.
బరిలో ఉన్న జట్లు
అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్, చెన్నై లయన్స్, దబంగ్ ఢిల్లీ టీటీసీ, గోవా చాలెంజర్స్, జైపూర్ పేట్రియాట్స్, బెంగళూరు స్మాషర్స్, పుణేరి పల్టన్ టీటీ, యూ ముంబా టీటీ.
Comments
Please login to add a commentAdd a comment