క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల టీటీ జట్టు
పారిస్: ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత్ 3–2తో రొమేనియా జట్టును బోల్తా కొట్టించింది. ఈ గెలుపుతో టీమిండియా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
స్టార్ ప్లేయర్ మనిక బత్రా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. తొలి మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–అర్చనా కామత్ జోడీ 11–9, 12–10, 11–7తో అదీనా దియకోను–ఎలిజబెటా సమారా (రొమేనియా) జంటను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో మనిక 11–5, 11–7, 11–7తో బెర్నాడెట్టె జాక్స్‌పై గెలిచింది.
దాంతో భారత్ ఆధిక్యం 2–0కు పెరిగింది. మూడో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ శ్రీజ 11–8, 4–11, 11–7, 6–11, 8–11తో ఎలిజబెటా సమారా చేతిలో ఓడిపోయింది. నాలుగో మ్యాచ్‌లో అర్చన 5–11, 11–8, 7–11, 9–11తో బెర్నాడెట్టె జాక్స్ చేతిలో ఓటమి పాలైంది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో మనిక 11–5, 11–9, 11–8తో అదీనా దియకోనుపై గెలిచి భారత్‌కు 3–2తో విజయాన్ని అందించింది. నేడు అమెరికా, జర్మనీ జట్ల మధ్య మ్యాచ్ విజేతతో బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు ఆడతుంది.
Comments
Please login to add a commentAdd a comment