
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు మరో ఏడాది ఉన్న తరుణంలో భారత టేబుల్ టెన్నిస్ శిబిరాన్ని కోచ్ లేమి కలవరపెడుతోంది. గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్, జకార్తా ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాలను అందించిన కోచ్ మసిమో కోస్టాంటిని వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో డేజన్ పాపిక్‌ను మార్చిలో చీఫ్ కోచ్‌గా నియమించారు. అయితే ఇప్పటివరకు పాపిక్ భారత జట్టుతో చేరకపోవడంతో క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు. కటక్‌లో సోమవారం ముగిసిన కామన్వెల్త్ టోర్నీకే పాపిక్ అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ అలా జరగకపోవడంతో ఆటగాళ్లంతా సొంత ప్రాక్టీస్‌తోనే ఈ టోర్నీ బరిలో దిగారు. మరోవైపు భారత టీటీ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ) కూడా పాపిక్ స్పందన కోసం వేచిచూస్తున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. ‘సాయ్ అతని నియామకాన్ని ధ్రువీకరించింది. ఈ మేరకు సంబంధిత పత్రాలను ఐదు రోజుల క్రితమే అతనిని పంపించాం. అతని సమాధానం కోసం వేచి చూస్తున్నాం’ అని ఆయన తెలిపారు.