అంగవైకల్యం శాపం అన్న భావనను వీడి మనోధైర్యమే బాసటగా విజయశిఖరాలను అధిరోహిస్తున్నారు. భారతదేశ మహిళా పారాలింపియన్లు. ప్రపంచ క్రీడలో మన ఖ్యాతిని చాటుతున్నారు. టెన్నిస్ నుండి షాట్ పుట్ వరకు భారతదేశానికి అనేక పతకాలు తీసుకొచ్చారు. వైకల్యపు మూస పద్ధతులను తొలగించుకుంటూ అనన్య బన్సాల్, అవని లేఖర, భావినా పటేల్, ఏక్తా భ్యాన్, రుబినా ప్రాన్సిస్ లు.. మనందరికీ రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారు.
బంగారు అవని
2021 పారాలింపిక్‌లో భారత స్వర్ణ పతక విజేతగా నిలిచిన అవని లేఖర ఈ యేడాది ప్రతిష్టాత్మక ఖేల్‌రత్న అవార్డును కూడా అందుకుంది. మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఫైనల్ ఈవెంట్‌లో 149.6 స్కోర్‌తో స్వర్ణం సాధించి సరికొత్త పారాలింపిక్ రికార్డ్‌ను నెలకొల్పింది అవని. పదకొండేళ్ల వయసులో కారు ప్రమాదానికి గురైన అవని 2012లో నడుము క్రింది భాగం పక్షవాతానికి లోనైంది. రాజస్థాన్‌లో లా చదువుతున్న విద్యార్థి. ఆమె తండ్రి ఆమెను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాడు.
రజతం అనన్య
మేధోపరమైన లోపం ఉన్న అథ్లెట్ అనన్య బన్సాల్. కిందటివారం బహ్రెయిన్‌లోని మనామాలో ఆసియా యూత్ పారాలింపిక్ గేమ్స్ జరిగాయి. ఈ పారాలింపిక్‌లో 30 దేశాల నుంచి 23 ఏళ్ల వయసు లోపు వారు పాల్గొన్నారు. వీరిందరితో పోటీపడి ఎఫ్–20 విభాగం షాట్‌పుట్‌లో భారత్‌కి తొలి రజత పతకాన్ని సాధించింది అనన్య. భారత్‌లోని మొహాలీకి చెందిన అనన్య బన్సాల్ సాధించిన ఘనతకు పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ దీపామాలిక ‘ఒక అమ్మాయి భారతదేశ ఖ్యాతిని నిలుపుతూ తొలి ఖాతాను తెరిచింది. విజయాన్ని జరుపుకోవడానికి ఇది సరైన రోజు’ అంటూ ప్రశంసించారు.
పతకాల భావినా పటేల్
టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినా పటేల్. 2020 టోక్యోలో పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించింది. జాతీయ, అంతర్జాతీయ పోటీలలో అనేక పతకాలు సాధించి వార్తల్లో నిలిచింది. 12 ఏళ్ల వయసులో పోలియో బారిన పడిన భావినా గుజరాత్‌లోని సుంధియా అనే చిన్న గ్రామం నుండి వచ్చిన మహిళ. టోక్యో విజయగాథలలో ఆమె విజయం ఒక మైలురాయి.
క్లబ్ త్రో ఏక్తాభ్యాన్
కారు ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతిని, చక్రాల కుర్చీకే పరిమితమైన ఏక్తాభ్యాన్ క్లబ్ త్రో అథ్లెట్‌గా టోక్యో 2020 పారాలింపిక్స్‌కు చేరుకునేంతగా తనను తాను మలుచుకుంది. తన కలలను సాకారం చేసుకునేందుకు ఆత్మవిశ్వాసాన్నే పెట్టుబడిగా పెట్టింది. ‘మొదట క్రీడల గురించి ఆలోచించలేదు. ఎప్పుడూ విద్యావేత్తలతో సంభాషించడానికి ఇష్టపడేదాన్ని. నా వైకల్యం రోజువారి పనులకు కూడా సవాల్ మారింది. ఫిట్‌నెస్ మెరుగుపరుచుకోవడానికి క్రీడలను ఎంచుకున్నాను. అందులో భాగంగా క్లబ్ త్రో నా సాధనలో భాగమైంది’ అని అనందంగా చెబుతుంది ఏక్తా.
షూటర్ రుబినా ఫ్రాన్సిస్
భారతీయ పారా పిస్టల్ షూటర్‌గా వార్తల్లో నిలిచింది రుబినా ఫ్రాన్సిస్. ప్రస్తుతం ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నుంచి ఐదవ స్థానంలో ఉంది. 2018లో ఆసియా పారా గేమ్స్‌లో పాల్గొంది. జబల్‌పూర్‌లోని గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీలో ఈ క్రీడను సాధన చేసింది రుబినా. ‘స్కూల్ చదువుతో పాటు మరేదైనా చేయాలనుకున్నాను. షూటింగ్ అకాడమీకి చెందిన వారు తమ ప్రచారంలో భాగంగా ఓ రోజు మా స్కూల్‌కు వచ్చారు.
ఈ విషయం మా నాన్నకు చెప్పి, రిజిస్టర్ చేయించుకున్నాను. ఎంపికయ్యాను. దీంతో ఈ క్రీడలో ఆసక్తి పెరిగింది’ అని చెబుతుంది రుబినా. విధి చిన్నచూపు చూసిందని వీధి వాకిలివైపు కూడా చూడని ఎంతోమందికి ఈ మగువల సాధన ఓ దిక్సూచి. మనోబలమే కొండంత అండగా సాగుతున్న వీరి జీవితం ఎంతో మందికి స్ఫూర్తి.
Comments
Please login to add a commentAdd a comment