శరత్‌ కమల్‌ ఓటమి | Singapore: TT Player Sharath Kamal Dream Run Ends In Quarter Finals | Sakshi
Sakshi News home page

శరత్‌ కమల్‌ ఓటమి; సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి షాక్‌.. క్వార్టర్‌ ఫైనల్లో తరుణ్‌

Published Sat, Mar 16 2024 10:33 AM | Last Updated on Sat, Mar 16 2024 10:35 AM

Singapore: TT Player Sharath Kamal Dream Run Ends In Quarter Finals - Sakshi

సింగపూర్‌: సంచలన విజయాలతో సింగపూర్‌ స్మాష్‌ వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టోర్నీలో అదరగొట్టిన భారత స్టార్‌ ఆచంట శరత్‌ కమల్‌ జోరుకు బ్రేక్‌ పడింది. క్వాలిఫయింగ్‌ ద్వారా మెయిన్‌ ‘డ్రా’లో అడుగుపెట్టిన ప్రపంచ 88వ ర్యాంకర్‌ శరత్‌ కమల్‌ క్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగాడు.

శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో శరత్‌ కమల్‌ 9–11, 2–11, 7–11, 11–9, 8–11తో ప్రపంచ 6వ ర్యాంకర్‌ ఫెలిక్స్‌ లెబ్రున్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయాడు. 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శరత్‌ మొత్తం 37 పాయింట్లు సాధించాడు. ఇందులో 24 పాయింట్లు తన సర్వీస్‌లో నెగ్గగా... తన సరీ్వస్‌లో మరో 22 పాయింట్లు ప్రత్యర్థికి కోల్పోయాడు. క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన శరత్‌ కమల్‌కు 14,000 డాలర్ల (రూ. 11 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 350 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.   

సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి షాక్‌ 
బర్మింగ్‌హామ్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీకి చుక్కెదురైంది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 16–21, 15–21తో 2022 డబుల్స్‌ చాంపియన్‌ షోహిబుల్‌ ఫిక్రీ–మౌలానా బగస్‌ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడింది. గతంలో ఫిక్రీ–మౌలానా ద్వయంపై నాలుగుసార్లు గెలిచిన సాతి్వక్‌–చిరాగ్‌ ఈసారి ఒత్తిడికి లోనై అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నారు.   

క్వార్టర్‌ ఫైనల్లో తరుణ్‌ 
వాటరింజెన్‌ (నెదర్లాండ్స్‌): డచ్‌ ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్‌ తరుణ్‌ మన్నెపల్లి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వాలిఫయర్‌గా అడుగుపెట్టిన తరుణ్‌ సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 21–16, 23–21తో భారత్‌కే చెందిన శుభాంకర్‌ డేపై గెలుపొందాడు. తొలి రౌండ్‌లో తరుణ్‌ 18–21, 21–10, 23–21తో ఆరో సీడ్‌ మథియాస్‌ కిక్లిట్జ్‌ (జర్మనీ)పై సంచలన విజయం సాధించాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement