బుసాన్: పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు ఖరారు కావడానికి అవసరమైన విజయాన్ని భారత మహిళల, పురుషుల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లు సాధించలేకపోయాయి. పటిష్ట జట్లతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత జట్లు ఓడిపోయి ప్రపంచ టీటీ టీమ్ చాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించాయి.
బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు 1–3తో చైనీస్ తైపీ జట్టు చేతిలో... భారత పురుషుల జట్టు 0–3తో దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయాయి. అంతకుముందు జరిగిన నాకౌట్ దశ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 3–0తో ఇటలీపై... భారత పురుషుల జట్టు 3–2తో కజకిస్తాన్‌పై విజయం సాధించాయి.
ఈ మెగా ఈవెంట్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో క్వార్టర్ ఫైనల్ చేరిన 8 జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాయి. మార్చి 5న విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–16లో చోటు సంపాదిస్తే భారత జట్లకు పారిస్ ఒలింపిక్ బెర్త్‌లు లభిస్తాయి. ప్రస్తుతం భారత మహిళల జట్టు 17వ ర్యాంక్‌లో, భారత పురుషుల జట్టు 15వ ర్యాంక్‌లో ఉన్నాయి.
చైనీస్ తైపీతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ మనిక బత్రా 11–8, 8–11, 4–11, 11–9, 11–9తో ప్రపంచ 10వ ర్యాంకర్ చెన్ జు యుపై సంచలన విజయం సాధించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది.
రెండో మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 6–11, 9–11, 5–11తో చెంగ్ ఐ చింగ్ చేతిలో... మూడో మ్యాచ్‌లో ఐహిక ముఖర్జీ 10–12, 13–15, 11–9, 2–11తో లి యు జున్ చేతిలో... నాలుగో మ్యాచ్‌లో మనిక బత్రా 10–12, 11–5, 9–11, 5–11తో చెంగ్ ఐ చింగ్ చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖరారైంది.
కొరియాతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 10–12, 11–13, 7–11తో జాంగ్ వూజిన్ చేతిలో... రెండో మ్యాచ్‌లో ఆచంట శరత్ కమల్ 9–11, 5–11, 11–8, 4–11తో లిమ్ జాంగ్‌హూన్ చేతిలో... మూడో మ్యాచ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 5–11, 8–11, 2–11తో లీ సాంగ్ హు చేతిలో ఓటమి పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment