
లాక్‌డౌన్ కాలంలో శిక్షణను పునరుద్ధరించేందుకు భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ) చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తాజాగా జూన్ చివర్లో శిక్షణా శిబిరం నిర్వహించేందుకు సమాఖ్య సిద్ధం కాగా, మరోసారి ఆటగాళ్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది. సురక్షితం కాని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణించేందుకు తాము సిద్ధంగా లేమని భారత స్టార్ ప్లేయర్లు శరత్ కమల్, జి.సత్యన్ పునరుద్ఘాటించారు. లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో భారత 16 మంది మేటి క్రీడాకారులను జూన్ మొదటి వారంలో శిక్షణ కోసం ఢిల్లీ, సోనేపట్, పాటియాలా కేంద్రాల్లో ఏదైనా ఒక వేదిక వద్దకు రావాల్సిందిగా సమాఖ్య గతంలోనే ఆటగాళ్లను కోరింది.
అయితే ఆంక్షల నేపథ్యంలో ప్రయాణం చేసేందుకు ఆటగాళ్లు నిరాకరించారు. ప్రస్తుతం శిబిరాన్ని జూన్ చివరికి పొడిగించినా ప్లేయర్లు ముందుకు రావడం లేదు. ‘కరోనా కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. పరిస్థితి చక్కబడే వరకు ఇంటి నుంచే ప్రాక్టీస్ చేయడం మంచిది. శిబిరాల నిర్వహణ జూలైలో ప్రారంభిస్తే బాగుంటుంది’ అని శరత్ కమల్ అన్నాడు. సత్యన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రభుత్వ సూచనల ప్రకారమే ఆటగాళ్లను ఒక్క చోట చేర్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్న టీటీఎఫ్‌ఐ కార్యదర్శి ఎంపీ సింగ్... ప్యాడ్లర్ల నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment