శరత్‌–మనిక జంట సంచలనం | Manika Batra and Sharath Kamal qualify for Tokyo Olympics | Sakshi
Sakshi News home page

శరత్‌–మనిక జంట సంచలనం

Published Sun, Mar 21 2021 4:47 AM | Last Updated on Sun, Mar 21 2021 4:47 AM

Manika Batra and Sharath Kamal qualify for Tokyo Olympics  - Sakshi

దోహా: టోక్యో ఒలింపిక్స్‌ వేదికగా టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ)లో తొలిసారి ప్రవేశపెట్టనున్న మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత ప్రాతినిధ్యం ఖరారైంది. శనివారం ముగిసిన ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భారత జంట ఆచంట శరత్‌ కమల్‌–మనిక బత్రా విజేతగా నిలిచి ‘టోక్యో’ బెర్త్‌ను దక్కించుకుంది. ఫైనల్లో శరత్‌ కమల్‌–మనిక జోడీ 8–11, 6–11, 11–5, 11–6, 13–11, 11–8తో టాప్‌ సీడ్, ప్రపంచ ఐదో ర్యాంక్‌ జంట సాంగ్‌ సు లీ–జియోన్‌ జిహీ (దక్షిణ కొరియా)పై సంచలన విజయం సాధించింది. 1988 సియోల్‌ ఒలింపిక్స్‌లో తొలిసారి టీటీ క్రీడకు చోటు కల్పించారు. పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించారు.

2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ నుంచి పురుషుల, మహిళల డబుల్స్‌ ఈవెంట్‌లను తొలగించి వాటి స్థానంలో టీమ్‌ ఈవెంట్‌కు స్థానం కల్పించారు. మూడు ఒలింపిక్స్‌ క్రీడల తర్వాత టీమ్‌ ఈవెంట్స్‌కు జతగా మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఈవెంట్‌ను ప్రవేశపెట్టాలని టోక్యో ఒలింపిక్స్‌ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో భారత్‌ నుంచి సత్యన్‌ జ్ఞానశేఖరన్, శరత్‌ కమల్‌... మహిళల సింగిల్స్‌లో సుతీర్థ ముఖర్జీ, మనిక బత్రా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ‘క్వాలిఫయింగ్‌ టోర్నీలో విజేతగా నిలుస్తామని ఊహించలేదు. ఫైనల్లో మనిక అద్భుతంగా ఆడింది. ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో 16 జోడీలు మాత్రమే ఉన్న నేపథ్యంలో మేము మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే పతకం ఖాయమవుతుంది. సింగిల్స్‌తో పోలిస్తే మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మాకు పతకం గెలిచే అవకాశముంది’ అని శరత్‌ కమల్‌ వ్యాఖ్యానించాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement