Paris Olympics 2024: ఒలింపిక్స్‌కు తెలంగాణ అమ్మాయి | Paris Olympics 2024 Indian TT Team Announced Telangana Akula Sreeja In | Sakshi
Sakshi News home page

Paris Olympics 2024: ఒలింపిక్స్‌కు తెలంగాణ అమ్మాయి.. టీటీ జట్లు ఇవే

Published Fri, May 17 2024 10:08 AM | Last Updated on Fri, May 17 2024 10:15 AM

Paris Olympics 2024 Indian TT Team Announced Telangana Akula Sreeja In

‘పారిస్‌’ విశ్వ క్రీడల్లో పాల్గొనే భారత టీటీ జట్ల ప్రకటన 

Paris Olympics 2024- న్యూఢిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) జట్లను అఖిల భారత టేబుల్‌ టెన్నిస్‌ సంఘం (టీటీఎఫ్‌ఐ) గురువారం ప్రకటించింది. మే 16న అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) ర్యాంకింగ్స్‌ ప్రకారం భారత్‌ నుంచి టాప్‌–3లో ఉన్న క్రీడాకారులను జట్లలోకి ఎంపిక చేశారు. 

తొలిసారి టీమ్‌ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడనుంది. 

పురుషుల, మహిళల టీమ్‌ విభాగంలో ముగ్గురి చొప్పున ఎంపిక చేయగా... ఈ ముగ్గురిలో టాప్‌–2లో ఉన్న ఇద్దరు సింగిల్స్‌ విభాగాల్లోనూ పోటీపడతారు. ఒక్కొక్కరిని రిజర్వ్‌ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. 

తుది జట్టులో ఎవరైనా గాయపడి అందుబాటులో లేకపోతే రిజర్వ్‌ ప్లేయర్‌ను ఆడిస్తారు. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌గా ఉన్న ఆచంట శరత్‌ కమల్‌ ఐదోసారి ఒలింపిక్స్‌లో పాల్గోనుండటం విశేషం. పారిస్‌ ఒలింపిక్స్‌ జూలై 24 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి.  

భారత మహిళల జట్టు: మనిక బత్రా, శ్రీజ, అర్చన కామత్, అహిక ముఖర్జీ (రిజర్వ్‌). 
భారత పురుషుల జట్టు: శరత్‌ కమల్, హర్మీత్‌ దేశాయ్, మానవ్‌ ఠక్కర్, సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ (రిజర్వ్‌). 

మనిక పరాజయం 
కపాడోసియా (టర్కీ): వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) ఫీడర్‌ లెవెల్‌ టోర్నీలో భారత నంబర్‌వన్‌ మనిక బత్రా పోరాటం ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 24వ ర్యాంకర్‌ మనిక 11–5, 4–11, 5–11, 11–13తో హిటోమి సాటో (జపాన్‌) చేతిలో ఓడిపోయింది. 

భారత్‌కే చెందిన కృత్విక రాయ్‌ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్‌ ఫైనల్లో కృత్విక 12–10, 11–4, 11–7తో వెరోనికా (ఉక్రెయిన్‌)పై నెగ్గింది. పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో సానిల్‌ శెట్టి–హరీ్మత్‌ దేశాయ్‌ (భారత్‌) ద్వయం 8–11, 11–6, 6–11, 6–11తో ఎస్టెబన్‌ డోర్‌–ఫ్లోరియన్‌ (ఫ్రాన్స్‌) జంట చేతిలో ఓడిపోయింది. 

మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో పోమంతి బైస్యా–కృత్విక రాయ్‌ (భారత్‌) జంట 11–7, 11–1, 14–12తో ఫ్రాన్‌జిస్కా (జర్మనీ)–యశస్విని (భారత్‌) జోడీపై గెలిచి ఫైనల్‌ చేరింది.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement