తెలంగాణ టీటీ క్రీడాకారిణి ఘనత
న్యూఢిల్లీ: రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల సింగిల్స్ నంబర్‌వన్ ర్యాంకర్‌గా అవతరించింది. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో శ్రీజ ఒక స్థానం మెరుగుపర్చుకొని 38వ ర్యాంక్‌లో నిలిచింది. ఇప్పటి వరకు భారత నంబర్‌వన్‌గా ఉన్న మనిక బత్రా రెండు స్థానాలు పడిపోయి 39వ ర్యాంక్‌కు చేరుకుంది.
భారత్ నుంచి యశస్విని 99వ ర్యాంక్‌లో, అర్చన కామత్ 100వ ర్యాంక్‌లో ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్‌బీఐ)లో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న 25 ఏళ్ల శ్రీజ ఈ ఏడాది నిలకడగా రాణిస్తూ ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సర్క్యూట్‌లో రెండు టైటిల్స్ సాధించింది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో ఆచంట శరత్ కమల్‌తో కలిసి శ్రీజ మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో శరత్ కమల్ 37వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. సత్యన్ జ్ఞానశేఖరన్ 60వ స్థానంలో, మానవ్ ఠక్కర్ 61వ స్థానంలో, హర్మీత్ దేశాయ్ 64వ ర్యాంక్‌లో ఉన్నారు. హైదరాబాద్ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ 147వ ర్యాంక్‌లో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment