‘అనంత’లో క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్న ఆనంద్‌రెడ్డి
సామాన్య కుటుంబానికి చెందిన ఓ క్రీడాకారుడు తన అసమాన్యమైన ఆటతీరుతో అందరి మన్ననలనూ పొందుతున్నాడు. అనంత నుంచి ఏకంగా స్పెయిన్‌కు వెళ్లి అక్కడి క్రీడాకారులకు శిక్షణ ఇచ్చాడు. జాతీయ కోచ్ కావడమే లక్ష్యంగా తన ఆటతీరుకు మరింతగా మెరుగులు దిద్దుకుంటున్నాడు. – అనంతపురం సప్తగిరి సర్కిల్
2012లో అకాడమీకి ఎంపిక
వైఎస్సార్ కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన ఆనంద్‌రెడ్డి. 2012లో అనంత క్రీడా మైదానంలో నిర్వహించిన ఫుట్‌బాల్ అకాడమీ సెలెక్షన్స్‌లో స్పోర్ట్స్ అకాడమీకి ఎంపికయ్యాడు. గతంలో అనంత ఫుట్‌బాల్ అకాడమీకి రాయలసీమ స్థాయిలో ఎంపికలను నిర్వహించేవారు. అకాడమీకి ఎంపికైనప్పటి నుంచి తన ఆటతీరుతో ఉన్నత స్థాయికి ఎదిగాడు ఆనంద్‌రెడ్డి. ఆర్‌డీటీ సంస్థ అందించిన ఆర్థిక, క్రీడ ప్రోత్సాహంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికై సత్తాచాటాడు. గత రెండేళ్ల నుంచి అనంత క్రీడా మైదానంలో గత నాలుగేళ్లుగా ఫుట్‌బాల్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. రెండేళ్ల పాటు వలంటీర్‌గా కూడా వ్యవహరించాడు. రెండేళ్ల నుంచి ఆర్డీటీ ఫుట్‌బాల్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
డీ – క్లబ్ ద్వారా గుర్తింపు
ఈ ఏడాది మేలో జరిగిన విస్సెంటీ డీ క్లబ్ సభ్యుల సమ్మర్ కోచింగ్ క్యాంపులో ఆనంద్ కూడా భాగస్వామిగా మారాడు. సెయింట్ విస్సెంటీ ప్రెసిడెంట్ సెర్జియో వర్తగాతో పాటు చిన్నారులకు ఫుట్‌బాల్ క్రీడను నేర్పించాడు. అతని ఆటతీరును గుర్తించిన క్లబ్ సభ్యులు ఈ ఏడాది స్పెయిన్‌లో నిర్వహించనున్న సమ్మర్ కోచింగ్ క్యాంపుకు అనంత నుంచి ఒకరికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఆనంద్‌రెడ్డి ఆటతీరు, క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణను చూసి అతన్ని ఈ అవకాశం వరించింది. దీంతో ఈ ఏడాది జూన్ 30 నుంచి జూలై 24 వరకు స్పెయిన్‌లోని మోంటాల్ట్‌లో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంపులో కోచ్‌గా వ్యవహరించాడు. ఇందులో 2 వారాల పాటు ఫుట్‌బాల్ కోచ్‌గా వ్యవహరించగా, చివరి వారం 3 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు చిన్నారులకు స్పోర్ట్స్ ఇంట్రడ్యూసర్‌గా వ్యవహరించాడు.
స్పెయిన్‌లో శిక్షణనిస్తున్న ఆనంద్‌రెడ్డి
మురళీ మాస్టర్ దగ్గర ఓనమాలు
ఫుట్‌బాల్ ఆటలో యర్రగుంట్ల పీఈటీ మాస్టర్ మురళి ఓనమాలు నేర్పించారు. ఆయన అందించిన స్ఫూర్తితో అండర్–14 రాష్ట్రస్థాయి పోటీల్లో రెండుసార్లు స్కూల్ గేమ్స్ తరుపున ప్రాతినిధ్యం వహించాడు. కర్ణాటకలోని తుంకూరులో జరిగిన అండర్–16 జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత అనంత అకాడమీకి ఎంపికయ్యాడు. అండర్–19 ఎస్‌జీఎఫ్ ద్వారా రెండు సార్లు రాష్ట్రస్థాయిలో రాణించాడు. అనంతరం మూడేళ్ల పాటు ఎస్కే యూనివర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. అనంత నుంచి సీనియర్ ఫుట్‌బాల్ పోటీల్లో రాష్ట్రస్థాయిలో నాలుగేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ఆర్డీటీకి కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఇదీ .. కుటుంబ నేపథ్యం
ఆనంద్‌రెడ్డి అనంత అకాడమీలో చేరిన ఏడాదిలోనే ఆయన తండ్రి కొండారెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. తల్లి ఇందిర యర్రగుంట్లలో చిన్నపాటి హోటల్‌ను నడుపుతోంది. తమ్ముడు సతీష్‌రెడ్డి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారుపడే కష్టం తెలుసుకున్న ఆనంద్‌రెడ్డి తనకంటూ ప్రత్యేకత ఉండాలని అనుకున్నాడు.
ఆదుకున్న ఆర్డీటీ
ఏడేళ్ల క్రితం ఆర్డీటీ అకాడమీకి ఎంపికవడం ఆనంద్‌రెడ్డి దశ, దిశను మార్చేసింది. ఆర్డీటీ ప్రోత్సాహంతో స్థానిక ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీని పూర్తి చేశాడు. చదువు పూర్తయిన తర్వాత ఆర్డీటీ సంస్థ ఆనంద్‌రెడ్డి ఆటతీరును చూసి అనంత క్రీడా మైదానంలో కోచ్‌గా అవకాశాన్ని కల్పించింది. దీంతో వలంటీర్‌గానే ఉంటూ అనంత క్రీడాకారులకు కోచింగ్‌ను అందించాడు. అకాడమీలో వసతి, భోజనానికి ఆర్డీటీ సహకరించడంతో ఇక్కడే ఉంటూ తన ఆటతీరును ఉత్తమంగా మార్చుకున్నాడు. అలాగే సీనియర్ ఫుట్‌బాల్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాడు. జాతీయ కోచ్‌గా రాణించడమే లక్ష్యం
ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అకాడమీలో చోటు సాధించడం ఒక ఎత్తు అనుకుంటే ఇక్కడి నుంచి స్పెయిన్‌కు కోచ్‌గా వ్యవహరించడం అనేది ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను. ఫుట్‌బాల్‌లో రాణించాలనేది నా లక్ష్యం. ఆ లక్ష్యానికి మించి ఈ స్థాయికి చేరానంటే అది ఆర్డీటీ సంస్థ అందించిన ప్రోత్సాహంతోనే సాధ్యమైంది. నా ఆటతీరే నన్ను విమానం ఎక్కేలా చేసింది. అనంత, స్పెయిన్‌లకు క్రీడా నైపుణ్యాలకు పెద్ద తేడా ఏమీ లేదు. ప్రస్తుతం జాతీయస్థాయిలో ప్రొఫెషనల్ కోచ్‌గా రాణించడమే లక్ష్యంగా పెట్టుకుని సాధన చేస్తున్నాను.
– ఆనంద్‌రెడ్డి , ఫుట్‌బాల్ క్రీడాకారుడు, కోచ్
Comments
Please login to add a commentAdd a comment