Indian Football
-
స్టిమాక్ కాంట్రాక్ట్ పునరుద్ధరణపై ఏఐఎఫ్ఎఫ్ విచారణ
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ కోచ్‌గా పని చేసిన ఐగర్ స్టిమాక్ కాంట్రాక్ట్ పునరుద్ధరణ, అతనికి చెల్లించాల్సి వచ్చిన నష్టపరిహారంపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన తప్పులు, స్టిమాక్‌కు అనుకూలంగా ఉన్న నిబంధనపై సమాఖ్య సర్వసభ్య సమావేశంలో చర్చ జరిగింది. దీనికి సంబంధించి స్వతంత్ర విచారణ జరపాలని ఏఐఎఫ్ఎఫ్ నిర్ణయం తీసుకుంది. ఎవరి కారణంగా స్టిమాక్‌కు భారీ మొత్తం చెల్లించాల్సి వచ్చిందనే అంశం విచారణలో తేలుతుందని ఏజీఎంలో సభ్యులు అభిప్రాయపడ్డారు.భారత జట్టు కోచ్‌గా ఐగర్ స్టిమాక్ పదవీకాలం 2023లో ముగిసింది. ఆ తర్వాత మళ్లీ దానిని జూన్ 2025 వరకు పునరుద్ధరించారు. అయితే స్టిమాక్ రెండోసారి కాంట్రాక్ట్‌పై సంతకం చేసినప్పుడు నిబంధనలు, షరతులు అతనికి అనుకూలంగా తయారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఏఐఎఫ్ఎఫ్ కీలక పదవుల్లో పని చేసిన కొందరి పాత్ర ఉందని ఏజీఎంలో సభ్యులు ఆరోపించారు. ఈ ఏడాది జూన్‌లో ‘ఫిఫా’ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో సులువైన ‘డ్రా’ ఉన్నా భారత జట్టు చెత్త ప్రదర్శనతో రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. దాంతో వెంటనే స్టిమాక్‌ను కోచ్ పదవి నుంచి తొలగించారు.ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న స్టిమాక్ 9 లక్షల 20 వేల డాలర్లు (రూ. 7 కోట్ల 72 లక్షలు) నష్టపరిహారం కోరుతూ ఫిఫా ఫుట్‌బాల్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశాడు. మరో ఏడాది తన పదవీకాలం మిగిలి ఉన్నా తనను తీసేయడం నిబంధనలకు విరుద్ధమంటూ సవాల్ చేశాడు. చివరకు మధ్యవర్తిత్వం ద్వారా ఏఐఎఫ్ఎఫ్ సమస్యను పరిష్కరించుకుంది. స్టిమాక్‌కు 4 లక్షల డాలర్లు (సుమారు రూ. 3.20 కోట్లు) నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించి గొడవను ముగించింది. ఈ అంశంపై ప్రస్తుతం ఏజీఎంలో చర్చ జరుగుతుంది.చదవండి: భారత ఫుట్‌బాలర్ అన్వర్ అలీపై నిషేధం -
భారత్‌ను గెలిపించిన మునీరుల్
లలిత్పూర్ (నేపాల్): దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–20 చాంపియన్‌ప్‌లో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా సోమవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–0 గోల్ తేడాతో భూటాన్‌ను ఓడించింది. భారత్ తరఫున మునీరుల్ మౌలా (37వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి అర్ధభాగంలోనే గోల్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత్ చివరి వరకు దాన్ని కాపాడుకుంది. అయితే ఒత్తిడికి గురైన భూటాన్ ఆటగాళ్లు పదే పదే భారత ప్లేయర్లతో వాగ్వాదానికి దిగగా... మనవాళ్లు కూడా దీటుగా బదులిచ్చారు. దీంతో ఇద్దరు భారత ఆటగాళ్లు, ఓ భూటాన్ ప్లేయర్‌కి రిఫరీ ‘రెడ్ కార్డు’ చూపి మైదానం నుంచి బయటకు పంపాడు. ఫలితంగా ఆట 67వ నిమిషం తర్వాత భారత్ కేవలం తొమ్మిది మంది ప్లేయర్లతోనే ఆధిక్యాన్ని కాపాడుకోవం విశేషం. శుక్రవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో మాల్దీవులుతో భారత్ ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లో బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక జట్లున్నాయి. -
సునీల్ ఛెత్రి వీడ్కోలు
కోల్‌కతా: రెండు దశాబ్దాలుగా భారత ఫుట్‌బాల్ ముఖచిత్రంగా ఉన్న సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఫుట్‌బాల్ ప్రపంచకప్–2026 ఆసియా జోన్ క్వాలిఫయర్స్‌లో భాగంగా గురువారం కువైట్‌తో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌ను సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు 0–0తో ‘డ్రా’ చేసుకుంది.నిర్ణీత సమయంలోపు రెండు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. నాలుగో నిమిషంలో కువైట్ ప్లేయర్ ఈద్ అల్ రషీది కొట్టిన షాట్‌ను భారత గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ నిలువరించాడు. అనంతరం 11వ నిమిషంలో అన్వర్ అలీ కొట్టిన హెడర్ షాట్ లక్ష్యాన్ని చేరలేకపోయింది. 48వ నిమిషంలో భారత ప్లేయర్ రహీమ్ అలీ ‘డి’ ఏరియాలోకి వెళ్లినా అతను కొట్టిన షాట్లో బలం లేకపోవడంతో బంతి నేరుగా కువైట్ గోల్‌కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఆ తర్వాత రెండు జట్లకు గోల్ చేసేందుకు ఒకట్రెండు అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాయి. భారత్ తన చివరి మ్యాచ్‌ను జూన్ 11న ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో ఆడనుంది. 2005లో జాతీయ సీనియర్ జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వహించిన సునీల్ ఛెత్రి ఓవరాల్‌గా భారత్ తరఫున 151 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 94 గోల్స్ సాధించాడు. ఇందులో నాలుగు ‘హ్యాట్రిక్’లున్నాయి. జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాలర్స్ జాబితాలో ఛెత్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్; 206 మ్యాచ్‌ల్లో 128 గోల్స్), అలీ దాయ్ (ఇరాన్; 149 మ్యాచ్‌ల్లో 109 గోల్స్); లయనెల్ మెస్సీ (అర్జెంటీనా; 180 మ్యాచ్‌ల్లో 106 గోల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. రికార్డుస్థాయిలో ఏడుసార్లు జాతీయ ఉత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్ అవార్డు గెల్చుకున్న సునీల్ ఛెత్రికి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌రత్న’ (2021లో)... అర్జున అవార్డు (2011లో), పద్మశ్రీ (2019లో) లభించాయి. -
‘డ్రా’తో గట్టెక్కిన శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ
షిల్లాంగ్: ఐ–లీగ్ జాతీయ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు ఐదో ‘డ్రా’ నమోదు చేసింది. నెరోకా ఎఫ్‌సీతో గురువారం జరిగిన మ్యాచ్‌ను శ్రీనిధి జట్టు 1–1తో ‘డ్రా’ చేసుకుంది. నెరోకా తరఫున రోహిత్ (70వ ని.లో), శ్రీనిధి తరఫున డేవిడ్ కాస్టనెడా మునోజ్ (82వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రస్తుతం శ్రీనిధి జట్టు 44 పాయింట్లతో రెండో స్థానంలో, మొహమ్మదాన్ స్పోర్టింగ్ 49 పాయింట్లో తొలి స్థానంలో ఉన్నాయి. శ్రీనిధి జట్టుకు టైటిల్ దక్కాలంటే చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాలి. మరోవైపు మొహమ్మదాన్ స్పోర్టింగ్ జట్టు తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా ఓడిపోవాలి. -
భారత ఫుట్‌బాలర్‌కు జాక్‌పాట్
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాలర్ బిజయ్ ఛెత్రి జాక్‌పాట్ కొట్టాడు. లాటిన్ అమెరికా క్లబ్‌కు ఆడే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. తద్వారా ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి భారతీయ ఫుట్‌బాలర్‌గా గుర్తింపు పొందనున్నాడు. మణిపూర్‌కు చెందిన 22 ఏళ్ల బిజయ్‌తో ఉరుగ్వేకు చెందిన కొలోన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఒప్పందం చేసుకుంది. ఇంకా భారత సీనియర్ జట్టుకు ఆడని బిజయ్ 2016లో షిల్లాంగ్ లాజోంగ్ క్లబ్ తరఫున అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్‌లో చెన్నైయన్ ఎఫ్‌సీ తరఫున ఆడుతున్న బిజయ్ గతంలో ఇండియన్ యారోస్, చెన్నై సిటీ, రియల్ కశ్మీర్, శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ తరఫున బరిలోకి దిగాడు. -
చరిత్ర సృష్టించనున్న భారత కెప్టెన్.. తొలి ఇండియన్‌గా రికార్డు
గువాహటి: భారత ఫుట్‌బాల్ జట్టు ఇప్పుడు సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌తో పోరుకు సిద్ధమైంది. 2026 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయిర్స్లో భాగంగా సౌదీ అరేబియాలో జరిగిన అఫ్గానిస్తాన్ హోం మ్యాచ్ ఒక్క గోల్ నమోదు కాకుండానే ‘డ్రా’గా ముగిసింది. ఇప్పుడు సొంత ప్రేక్షకుల మధ్య మంగళవారం జరిగే పోరులో భారత్ గోల్సే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్ 18 చానెల్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. మరోవైపు భారత దిగ్గజం, కెప్టెన్ సునీల్ ఛెత్రికిది 150వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. 2005లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన సునీల్ ఛెత్రి... 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 93 గోల్స్ చేశాడు. భారత్ తరఫున 150 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడు ఛెత్రినే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా కేవలం 40 మంది మాత్రమే 150 మ్యాచ్‌ల మైలురాయిని తాకారు. -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ మ్యాచ్ ‘డ్రా’
సాక్షి, హైదరాబాద్: ఐ–లీగ్ జాతీయ ఫుట్‌బాల్ టోర్నీలో శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు మూడో ‘డ్రా’ నమోదు చేసుకుంది. లీగ్ ‘టాపర్’ మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌ను శ్రీనిధి డెక్కన్ జట్టు 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఆట మూడో నిమిషంలో డేవిడ్ కాస్టనెడా గోల్‌తో శ్రీనిధి జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 84వ నిమిషంలో మొహమ్మద్ జాసిమ్ గోల్‌తో మొహమ్మదాన్ స్పోర్లింగ్ క్లబ్ స్కోరును సమం చేసింది. రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. ప్రస్తుతం మొహమ్మదాన్ స్పోర్లింగ్ క్లబ్ 35 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... శ్రీనిధి డెక్కన్ జట్టు 33 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. -
ఒక్క గోల్, ఒక్క పాయింట్ లేకుండానే ఓటమితో ముగించిన టీమిండియా
దోహా: ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. గ్రూప్ ‘బి’లో భాగంగా సిరియాతో జరిగి న చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో సునీల్ ఛెత్రి నాయకత్వంలోని టీమిండియా 0–1 గోల్ తేడాతో ఓడిపోయింది. సిరియా తరఫున ఆట 76వ నిమిషంలో ఒమర్ ఖిరిబిన్ ఏకైక గోల్ చేసి తమ జట్టును గెలిపించాడు. ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క గోల్ కూడా చేయకుండానే, ఒక్క విజయం కూడా లేకుండా ని్రష్కమించింది. తొలి మ్యాచ్‌లో భారత్ 0–2తో ఆస్ట్రేలియా చేతిలో, రెండో మ్యాచ్‌లో 0–3తో ఉజ్బెకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. ఏడు పాయింట్లతో ఆస్ట్రేలియా, ఐదు పాయింట్లతో ఉజ్బెకిస్తాన్ ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించాయి. -
మళ్లీ ఓడిన భారత్.. వరుసగా రెండో పరాజయం
ఆసియా కప్ పురుషుల ఫుట్‌బాల్ టోర్నీలో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా దోహాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 0–3 గోల్స్ తేడాతో ఉజ్బెకిస్తాన్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత జట్టుకు నాకౌట్ దశకు అర్హత సాధించే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. ఈనెల 23న జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో సిరియాతో భారత్ ఆడుతుంది. -
నేటి నుంచి ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీ
దోహా: ప్రతిష్టాత్మక ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీ శుక్రవారం ఖతర్ రాజధాని దోహాలో మొదలవుతుంది. 24 జట్లు పోటీపడుతున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 10 వరకు జరుగుతుంది. మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘బి’లో భారత్, సిరియా, ఉజ్బెకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లున్నాయి. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఖతర్‌తో లెబనాన్ తలపడుతుంది. వాస్తవానికి ఈ టోర్నీ గత ఏడాది చైనాలో జరగాల్సింది. అయితే కోవిడ్ కారణంగా చైనా ఆతిథ్యం నుంచి తప్పుకోగా ఖతర్‌కు ఈ టోర్నీని కేటాయించారు. -
ఆసియా క్రీడలకు భారత ఫుట్‌బాల్ జట్లు
ఆసియాలో టాప్–8లో లేకపోయినా భారత పురుషుల, మహిళల ఫుట్‌బాల్ జట్లను ఆసియా క్రీడలకు పంపించాలని కేంద్ర క్రీడా శాఖ నిర్ణయం తీసుకుంది. ఆసియా క్రీడల్లో ఆయా జట్లలో ముగ్గురు మినహా మిగతా సభ్యులు అండర్–23 ఆటగాళ్లే ఉండాలి. సీనియర్ ఆటగాళ్ల హోదాలో కెప్టెన్ సునీల్ ఛెత్రి, గోల్‌కీపర్ గుర్ప్రీత్, డిఫెండర్ సందీప్ జింగాన్ ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. మరోవైపు భారత మహిళల సాఫ్ట్‌బాల్, పురుషుల వాటర్‌పోలో, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్ 5్ఠ5 జట్లను ఆసియా క్రీడలకు పంపించకూడదని భారత ఒలింపిక్ సంఘం నిర్ణయం తీసుకుంది. -
రణరంగాన్ని తలపించిన భారత్-కువైట్ ఫుట్‌బాల్ మ్యాచ్
శాఫ్ ఛాంపియన్షిప్ 2023 ఫుట్‌బాల్ టోర్నీలో మరో మ్యాచ్ రణరంగాన్ని తలపించింది. కొద్ది రోజుల కిందట ఇదే టోర్నీలో భారత్, పాక్ మధ్య మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు బాహాబాహీకి దిగగా.. తాజాగా భారత్-కువైట్ మధ్య మ్యాచ్‌లో సేమ్ సీన్ రిపీటైంది. ఇరు జట్లకు చెందిన ముగ్గురికి రిఫరీ రెడ్ కార్డ్ జారీ చేశాడు. భారత కోచ్ ఇగోర్ స్టిమాక్, ఫార్వర్డ్ రహీమ్ అలీ, కువైట్‌కు చెందిన అల్ ఖలాఫ్ మార్చింగ్ ఆర్డర్లు పొందారు. 64వ నిమిషంలో భారత కోచ్‌కు ఎల్లో కార్డ్ (బంతిని పట్టుకుని ఆటకు ఆటంకం కలిగించాడు) ఇష్యూ చేయడంతో మొదలైన గొడవ చినికిచినికి గాలివానలా మారి ఇరు జట్ల ఆటగాళ్లు కొట్టుకునేంతవరకు తీసుకెళ్లింది. ఆట 10 నిమిషాల్లో ముగుస్తుందనగా.. భారత ఆధిక్యాన్ని (1-0) కాపాడే ప్రయత్నంలో భాగంగా భారత కోచ్ మైదానం వెలువల అత్యుత్సాహం కనబర్చాడు. దీంతో రిఫరి అతనికి రెడ్ కార్డ్ ఇష్యూ చేశాడు. How hot is it in Bengaluru? WTH is happening 🙈😂 pic.twitter.com/CMsBFesyNd — Akshata Shukla (@shukla_akshata) June 27, 2023 ఈ క్రమంలో భారత ఫార్వర్డ్ రహీమ్ అలీ తన టెంపర్‌ను కోల్పోయి కువైట్ ఆటగాడు అల్ ఖలాఫ్‌ను కిందకు తోసేశాడు. దీంతో అతనికి కూడా రెడ్‌కార్డ్ ఇష్యూ అయ్యింది. ఇది మనసలో పెట్టుకున్న అల్ ఖలాఫ్.. భారత ఆటగాడు సహల్ అబ్దుల్ సమద్‌ను నేలపైకి నెట్టడంతో గొడవ తీవ్రరూపం దాల్చింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. గొడవకు కారణమైన కువైట్ ఆటగాడికి కూడా రిఫరీ రెడ్‌కార్డ్ చూపించాడు. More chaos after Sahal is left in a heap as Kuwait try to get the ball back after a foul call. The coaching staff is involved in it as well before the ref breaks it up, but Rahim Ali is sent off! pic.twitter.com/owoXhieEfl — Anantaajith Raghuraman (@anantaajith) June 27, 2023 భారత్ సెల్ఫ్ గోల్.. మొదటి అర్ధభాగంలో సునీల్ ఛెత్రి గోల్ చేసి అందించిన ఆధిక్యాన్ని టీమిండియా కాపాడుకోలేకపోయింది. అదనపు సమయంలో భారత ఆటగాడు అన్వర్ అలీ సెల్ఫ్ గోల్ చేయడంతో మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది. ఈ మ్యాచ్ డ్రా కావడంతో గోల్స్ డిఫరెన్స్ కారణంగా కువైట్ గ్రూప్ టాపర్‌గా నిలిచింది. భారత్ రెండో స్థానంలో సరిపెట్టుకుంది. కువైట్ ఆటగాళ్లు అత్యుత్సాహం.. భారత డగౌట్‌పై దాడి భారత్ సెల్ఫ్ గోల్‌తో మ్యాచ్ సమం అయ్యాక కువైట్ ఆటగాళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. భారత డగౌట్‌పై దాడి చేశారు. దీంతో రిఫరీ వారికి రెండు పసుపు కార్డులు జారీ చేశాడు. -
ప్రపంచకప్ నుంచి వట్టి చేతులతో నిష్క్రమించిన టీమిండియా
అండర్-17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్-2022లో భారత చాప్టర్ క్లోజ్ అయ్యింది. టోర్నీ మొత్తంలో భారత అమ్మాయిలు ఒక్క గోల్ కూడా కొట్టకుండా నిష్క్రమించారు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కనీస పోరాటం కూడా చేయకుండా ప్రత్యర్ధులకు దాసోహమయ్యారు. తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో 0-8 తేడాతో ఓటమిపాలైన భారత అమ్మాయిలు, ఆతర్వాత మొరాకో చేతిలో 0-3 తేడాతో.. చివరి మ్యాచ్‌లో బ్రెజిల్ చేతిలో 0-5 తేడాతో చిత్తయ్యారు. ఆతిధ్య జట్టు హోదాలో మెగా టోర్నీకి అర్హత సాధించిన భారత కనీస పోటీ కూడా ఇవ్వకుండా, పేలవ ప్రదర్శనతో నిష్క్రమించడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. టోర్నీలో ప్రస్తుత పరిస్ధితి విషయానికొస్తే.. గ్రూప్-ఏలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓడిన భారత్ ఆఖరి స్థానంలో నిలువగా.. అమెరికా అగ్రస్థానంలో, బ్రెజిల్, మొరాకో జట్లు 2,3 స్థానాల్లో నిలిచాయి. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొనగా.. చెరి నాలుగు జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించబడ్డాయి. గ్రూప్-బి నుంచి జర్మనీ, నైజీరియా.. గ్రూప్-సి నుంచి కొలొంబియా, స్పెయిన్.. గ్రూప్-డి నుంచి జపాన్, టాంజానియా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అన్ని గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. -
Durnad Cup: సెమీస్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ
కోల్‌కతా: డ్యూరాండ్ కప్ టోర్నీలో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఐఎస్ఎల్ ఛాంపియన్ అయిన హెచ్ఎఫ్సీ సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రాజస్తాన్ యునైటెడ్ ఎఫ్‌సీని 3–1 తేడాతో ఓడించింది. హైదరాబాద్ తరఫున ఒగ్బెచె (6వ ని.లో), ఆకాశ్ మిశ్రా (45వ ని.లో), సివెరియో (69వ ని.లో) తలో గోల్ సాధించగా.. రాజస్తాన్ తరఫున మార్టిన్ చావెజ్(29ని.లో) ఏకైక గోల్ చేశాడు. గురువారం జరిగే సెమీస్‌లో హైదరాబాద్.. బెంగళూరు ఎఫ్‌సీతో తలపడనుంది. -
భారత ఫుట్‌బాల్ సమాఖ్యకు భారీ షాక్.. సస్పెన్షన్ వేటు వేసిన ఫిఫా
FIFA Suspends All India Football Federation: ఊహించినట్టే జరిగింది. భారత ఫుట్‌బాల్‌కు కష్టకాలం వచ్చింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)పై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) నిషేధం విధించింది. ఏఐఎఫ్ఎఫ్లో తృతీయ పక్షం జోక్యం సహించబోమని కొంతకాలంగా పలుమార్లు ‘ఫిఫా’ హెచ్చరించింది. కానీ ఏఐఎఫ్ఎఫ్ పట్టించుకోలేదు. దాంతో చివరకు ‘ఫిఫా’ భారత ఫుట్‌బాల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ నిషేధం విధించిది. ఏఐఎఫ్ఎఫ్ పూర్తిస్థాయి కార్యవర్గంతో పనిచేయాలి. అలాకాకుండా అడ్‌హక్ కమిటీ, కోర్టులు నియమించిన పరిపాలక కమిటీ (ఇవన్నీ థర్డ్ పార్టీలు–తృతీయ పక్షం)లతో నడిచే జాతీయ ఫుట్‌బాల్ సంఘాన్ని ‘ఫిఫా’ గుర్తించదు. ఈ కారణంతోనే ఏఐఎఫ్ఎఫ్ను సస్పెండ్ చేసింది. ‘ఫిఫా నియమావళికి విరుద్ధంగా నడుస్తున్న ఏఐఎఫ్ఎఫ్పై నిషేధం విధిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని ‘ఫిఫా’ బ్యూరో కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. తక్షణం పరిపాలక కమిటీ తప్పుకోవాలి. ఏఐఎఫ్ఎఫ్ కొత్త కార్యవర్గం ఎన్నికై, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు కావాలి. రోజువారీ కార్యకలాపాల్ని కొత్త కార్యవర్గం నిర్వహించినపుడే నిషేధాన్ని ఎత్తేసే చర్యలు చేపడతాం’ అని ‘ఫిఫా’ ఒక ప్రకటనలో తెలిపింది. నిషేధం నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 11 నుంచి 30 వరకు భారత్‌లో జరగాల్సిన మహిళల అండర్–17 ప్రపంచకప్ కూడా షెడ్యూల్ ప్రకారం జరగదని ‘ఫిఫా’ కౌన్సిల్ స్పష్టం చేసింది. 85 ఏళ్ల ఏఐఎఫ్ఎఫ్ చరిత్రలో ఇలా సస్పెన్షన్‌కు గురవడం ఇదే తొలిసారి. అసలేం జరిగింది... దీనికంతటికీ కారణం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అగ్రనేత ప్రఫుల్ పటేల్ పదవీ వ్యామోహమే! ఆయన ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. డిసెంబర్–2020తో ఆయన పదవీకాలం ముగిసినా కోర్టు కేసులు వేస్తూ కుర్చీని మాత్రం వీడలేదు. జాతీయ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం గరిష్టంగా 12 ఏళ్లకు మించి అధ్యక్ష పదవిలో ఎవరూ కొనసాగేందుకు వీలులేదు. దీంతో మోహన్ బగాన్ క్లబ్ జట్టు మాజీ గోల్‌కీపర్ కళ్యాణ్ చౌబే సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ప్రఫుల్ పటేల్‌ను తప్పించి పరిపాలక కమిటీ (సీఓఏ)ని నియమించింది. ‘ఫిఫా’ నిధులు బంద్ ‘ఫిఫా’ తన సభ్య దేశాల్లో ఫుట్‌బాల్ క్రీడ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏటా రూ. కోట్లలో నిధులు ఇస్తుంది. సస్పెన్షన్‌తో ఇప్పుడు అవన్నీ కూడా ఆగిపోతాయి. దీని వల్ల ఏఐఎఫ్ఎఫ్ ఈ ఏడాది సుమారు రూ. 4 కోట్లు (5 లక్షల డాలర్లు) నష్టపోతుంది. మైదానాల నిర్మాణ, నాణ్యమైన ఫుట్‌బాల్ బంతులు, జెర్సీలు, సామాగ్రిల కోసం ‘ఫిఫా’ ఆ నిధుల్ని విడుదల చేస్తుంది. కేంద్రం జోక్యం ఏఐఎఫ్ఎఫ్పై విధించిన నిషేధాన్ని ఎత్తేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. సుప్రీం కోర్టు పరిధిలోని కేసును సత్వరం విచారించాలని జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎస్ బోపన్నల బెంచ్‌ను కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. బుధవారం తొలి కేసుగా ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికల అంశాన్నే విచారిస్తామని ద్విసభ్య ధర్మాసనం మెహతాకు తెలిపింది. పాత నియమావళి ప్రకారమే ఎన్నికలు ఏఐఎఫ్ఎఫ్కు పాత నియమావళి ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని పరిపాలక కమిటీ స్పష్టం చేసింది. సస్పెన్షన్‌కు గురైన వెంటనే ఎన్నికల ప్రక్రియలో చలనం వచ్చింది. ‘ఫిఫా’ నిర్దేశించినట్లుగానే అనుబంధ రాష్ట్రాల సంఘాల ప్రతినిధులే ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికల్లో పాల్గొంటారని, మాజీ ఆటగాళ్లతో కూడిన ఓటర్లతో నిర్వహించబోమని తేల్చిచెప్పింది. ఏఐఎఫ్ఎఫ్ నియమావళిని కాదని సీఓఏ 36 సంఘాలను విస్మరించి ఈ స్థానంలో 36 మంది మాజీ ఫుట్బాలర్లతో ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. దీన్ని ‘ఫిఫా’ తోసిపుచ్చడంతో పాతపద్ధతిలోనే ప్రక్రియ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆటకు ఎదురుదెబ్బ నిషేధం ప్రభావం జాతీయ జట్టుకు, భారత క్లబ్ జట్లపై తీవ్రంగా ఉంటుంది. అంతర్జాతీయ, ఫ్రెండ్లీ మ్యాచ్‌లకు అవకాశమే ఉండదు. దీంతో వచ్చే నెల 24న వియత్నాంతో, 27న సింగపూర్‌తో సునీల్ ఛెత్రీ కెప్టెన్సీలో భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు అటకెక్కినట్లే! ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) ఇంటర్–జోనల్ సెమీఫైనల్స్‌లో భాగంగా సెప్టెంబర్ 7న జరగాల్సిన మోహన్ బగాన్ మ్యాచ్ కూడా కష్టమే! ఉజ్బెకిస్తాన్‌లో ఉన్న ఇండియన్ మహిళల లీగ్ చాంపియన్ ‘గోకులం కేరళ’ జట్టు మ్యాచ్‌లకు కూడా దెబ్బపడింది. అక్కడ ఏఎఫ్సీ మహిళల క్లబ్ చాంపియన్‌షిప్‌లో సొగ్దియానా క్లబ్‌తో ఈ నెల 23న, 26న ఇరాన్లో బామ్ ఖటూన్ ఎఫ్‌సీతో జరగాల్సిన మ్యాచ్‌లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇరాక్‌లో వచ్చేనెల 14 నుంచి జరగాల్సిన ఏఎఫ్సీ అండర్–20 క్వాలిఫయర్స్‌లో కూడా భారత జట్టుకు అవకాశం ఉండదు. ఆ టోర్నీలో భారత్ 14న ఇరాక్‌తో, 16న ఆస్ట్రేలియాతో, 18న కువైట్‌తో ఆడాల్సి ఉంది. చదవండి: భారత్‌పై ఫిఫా నిషేధం.. విషయం చేయి దాటిపోయిందన్న స్టార్ ఫుట్‌బాలర్ -
భారత్‌పై ఫిఫా నిషేధం.. విషయం చేయి దాటిపోయిందన్న స్టార్ ఫుట్‌బాలర్
FIFA Ban Threat To AIFF: భారత ఫుట్‌బాలర్లంతా ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టాలని స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రి సూచించాడు. ఈ విషయంపై ఆటగాళ్లు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని, ఇది మన చేతులు దాటిపోయిందని ఛెత్రి అన్నాడు. అఖిల భారత ఫుట్‌బాల్ సంఘం (ఏఐఎఫ్ఎఫ్) చాన్నాళ్లుగా అడ్‌హక్ కమిటీతో నడుస్తోంది. పూర్తిస్థాయి కార్యవర్గం లేకపోవడంతో, సంబంధం లేని (థర్డ్ పార్టీ) వ్యక్తుల జోక్యంతో భారత ఫుట్‌బాల్ కార్యకలాపాలు జరగడం ఇష్టపడని ‘ఫిఫా’ ఇటీవల నిషేధం విధిస్తామని హెచ్చరించింది. -
నేటి నుంచి ఆసియా కప్ టోర్నీ.. 43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత..
43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ మహిళల ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. 12 జట్లు పాల్గొంటున్న ఈ మెగా ఈవెంట్ నేడు ముంబైలో మొదలుకానుంది. గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత్ నేడు ఇరాన్‌తో తలపడుతుంది. ఇరాన్‌తో గతంలో మూడుసార్లు ఆడిన భారత్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్ రెండుసార్లు రన్నరప్‌గా (1979, 1983) నిలిచింది. -
సూపర్ ఫుట్‌బాల్
కళ్లు చెదిరే ఫ్రీ కిక్‌లు... కళాత్మకమైన పాస్‌లు... మతి పోగొట్టే హెడర్స్... ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే డిఫెండర్ల విన్యాసాలు... వెరసి ప్రేక్షకుల్ని అలరించడానికి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో కట్టు బాట్ల నడుమ బుడగలో కాలికి, బంతికి జరిగే ఈ పోరాటంలో గెలిచేందుకు 11 జట్లు రె‘ఢీ’ అయ్యాయి... మనల్ని ఉత్సాహపరిచేందుకు ఫుట్‌బాల్ పండుగను తీసుకొచ్చాయి. పనాజీ: నాలుగు నెలల పాటు భారత ఫుట్‌బాల్ అభిమానులను అలరించడానికి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) వచ్చేసింది. నేడు కేరళ బ్లాస్టర్స్, ఏటీకే మోహన్ బగాన్ మ్యాచ్‌తో ఏడో సీజన్‌కు తెర లేవనుంది. కరోనా విరామం అనంతరం దేశంలో జరగనున్న తొలి క్రీడా ఈవెంట్ ఇదే కావడం విశేషం. దాంతో టోర్నీని ఒకే చోట నిర్వహించడానికి సిద్ధమైన లీగ్ నిర్వాహకులు... అందుకోసం గోవాను ఎంచుకున్నారు. అక్కడే ‘బయో సెక్యూర్ బబుల్’ను ఏర్పాటు చేశారు. మొత్తం మూడు స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. క్వారంటైన్ నిబంధనలు ఉండటంతో టోర్నీలో పాల్గొనే ప్లేయర్లు నెల రోజులు ముందుగానే గోవాకు చేరుకున్నారు. ఇక టైటిల్ కోసం పోటీ పడే జట్ల సంఖ్య ఈ సారి పెరిగింది. లీగ్‌లోకి కొత్తగా స్పోర్టింగ్ క్లబ్ ఈస్ట్ బెంగాల్ వచ్చి చేరడంతో... జట్ల సంఖ్య 11కు చేరింది. టైటిల్ ఫేవరెట్లుగా డిఫెండింగ్ చాంపియన్ ఏటీకే మోహన్ బగాన్, మాజీ చాంపియన్ బెంగళూరు ఎఫ్‌సీ కనిపిస్తున్నాయి. తమ తొలి సీజన్ (2019–20)లో అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన కనబరచని హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ)... ఈ సారి మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. ఇందుకోసం స్పెయిన్‌కు చెందిన మాన్యుయెల్ మార్కజ్‌ను తమ హెడ్ కోచ్‌గా కూడా నియమించింది. గత సీజన్లో హైదరాబాద్ ఎఫ్‌సీ... రెండు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిన జరిగే ఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం సెమీ ఫైనల్స్ జరుగుతాయి. కరోనా ఉండటంతో ఈ సారి ఇంటా, బయట పద్ధతిలో కాకుండా ఒకే చోట సెమీస్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక్కడ విజేతలుగా నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇప్పటి వరకు లీగ్ తొలి అంచె మ్యాచ్ తేదీలను మాత్రమే నిర్వాహకులు ప్రకటించారు. డిసెంబర్లో రెండో అంచె పోటీలతో పాటు సెమీస్, ఫైనల్ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. సబ్స్టిట్యూట్ల సంఖ్య పెరిగింది కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మే నెలలో అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ప్రతిపాదించిన ‘ఐదుగురు సబ్‌స్టిట్యూట్’ నిబంధన ఐఎస్ఎల్లో కొనసాగనుంది. దాంతో మ్యాచ్ మధ్యలో ఒక జట్టు గరిష్టంగా ఐదుగురు సబ్స్టిట్యూట్లను ఆడించవచ్చు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మూడు సందర్భాల్లో మాత్రమే వీరిని బరిలోకి దించాలి. అంతేకాకుండా సబ్‌స్టిట్యూట్ బెంచ్‌ను ఏడుగురి నుంచి తొమ్మిదికి పెంచారు. హైదరాబాద్ ఎఫ్‌సీ జట్టు: గోల్ కీపర్లు: లాల్బియాక్లువా జోంగ్టే, లక్ష్మీకాంత్, మానస్ దూబే, సుబ్రతా పాల్. డిఫెండర్లు: ఆకాశ్ మిశ్రా, ఆశిష్ రాయ్, చింగ్లెన్సనా సింగ్, డింపిల్ భగత్, కిన్‌సైలాంగ్ ఖోంగ్సిట్, నిఖిల్ ప్రభు, ఒడి ఒనైందియా, సాహిల్ పన్వార్. మిడ్ ఫీల్డర్లు: అభిషేక్ హల్దార్, ఆదిల్ ఖాన్, సాహిల్ తవోరా, హలిచరన్ నర్జారీ, హితేశ్ శర్మ, జావో విక్టోర్, లల్దాన్‌మవియా రాల్టే, లూయిస్ సస్ట్రే, మార్క్ జొతాన్‌పుయా, మొహమ్మద్ యాసిర్, నిఖిల్ పూజారి, సౌవిక్ చక్రవర్తి, స్వీడెన్ ఫెర్నాండెస్. ఫార్వర్డ్స్: సాంటాన, సాండ్రెజ్, ఇషాన్ డే, జోల్ చియానీస్, లాలాంపుయా, లిస్టన్ కొలాకో, రోహిత్ దను, హెడ్ కోచ్: మాన్యుయెల్ మార్కజ్. -
ప్రపంచకప్ బెర్త్ గల్లంతు
కౌలాలంపూర్: ‘ఫిఫా’ అండర్–17 ప్రపంచ కప్ బెర్త్ సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్సీ) అండర్–16 చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 0–1తో కొరియా చేతిలో పరాజయం పాలైంది. ఈ ఓటమితో యువ భారత్ ప్రపంచకప్‌లో పాల్గొనే గొప్ప అవకాశాన్ని చేజార్చుకుంది. ఇందులో సెమీస్ చేరిన జట్లకు పెరూ వేదికగా 2019లో జరుగనున్న అండర్–17 ప్రపంచకప్ టోర్నీకి అర్హత లభిస్తుంది. 2017లో భారత్ వేదికగా జరిగిన ఫిఫా అండర్–17 ప్రపంచకప్‌లో టీమిండియాకు ఆతిథ్య హోదాలో ఈ మెగా టోర్నీలో తొలిసారి పాల్గొనే అవకాశం దక్కింది. ఈ సారి క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా అర్హత సాధించాల్సిన స్థితిలో భారత్ విఫలమైంది. ఆకట్టుకున్న నీరజ్... 16 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో క్వార్టర్స్ ఆడుతున్న యువభారత్... టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన కొరియాపై తుదికంటా పోరాడింది. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను ఆట 67వ నిమిషంలో జియాంగ్ సాంగ్బిన్ (కొరియా) సాధించాడు. ఈ మ్యాచ్‌లో గోల్‌కీపర్ నీరజ్ అడ్డుగోడలా నిలిచి కొరియన్ల సహనాన్ని పరీక్షించాడు. ఆట 14వ నిమిషంలోనే ప్రత్యర్థి గోల్‌ను అడ్డుకున్న నీరజ్... ఆట 34వ నిమిషంలో, 36వ నిమిషంలో కొరియన్లు చేసిన మెరుపు దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొని వారిని నిలువరించాడు. కొద్ది క్షణాల్లో తొలి అర్ధభాగం ముగుస్తుందనగా రవిరాణా షాట్‌ను కొరియన్లు అడ్డుకోవడంతో గోల్ లేకుండానే భారత్ విరామానికెళ్లింది. రెండో అర్ధభాగంలోనూ దూకుడు పెంచిన భారత్ 52వ నిమిషంలో గోల్ చేసినంత పని చేసింది. భారత ఆటగాడు రిడ్గే డి మెలోస్ వ్యాలీని ప్రత్యర్థి రక్షణశ్రేణి అడ్డుకుంది. 2002లోనూ భారత్ 1–3తో కొరియా చేతిలోనే ఓటమి పాలైంది. -
త్వరలోనే ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత్
ముంబై : త్వరలోనే ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు పాల్గొంటుందనీ కేంద్ర క్రీడాశాఖమంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ అభిప్రాయపడ్డారు. ఆ సత్తా భారత ఆటగాళ్లకు ఉందని పేర్కొన్నాడు. ఓ ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ‘భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది. చాలా మంది ఐపీఎల్ టోర్నీలానే ఫిఫా వరల్డ్‌కప్‌ను చూసేందుకు సిద్దంగా ఉన్నారు. ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత్ పాల్గొనకపోయినప్పటికీ ఆ టోర్నీలో పాల్గొనే సత్తా మనకు ఉంది. ఆటగాళ్లకు వచ్చే అవకాశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. త్వరలోనే ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత్ ఆడనుంది. ఫుట్‌బాల్ లేక ఏ క్రీడలోనైనా పోటీ ఇచ్చే సత్తా భారత్‌కు ఉంది’ అని పేర్కొన్నారు. ఆటగాళ్ల శిక్షణ పొందే అవకాశాలు, వారికి లభించే మద్దతు గతంలో కన్నా ఇప్పుడు చాలా బాగుందన్నారు. పాఠశాలలు కేవలం చదువులపై కాకుండా ఆటల్లో ప్రోత్సాహం కలిగించేలా దృష్టి సారించాలని కోరారు. ఖేలో ఇండియాలో భాగంగా అండర్-17నే కాకుండా ఈ సారి అండర్-21 కాలేజీ గేమ్స్ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆటగాళ్ల నిబద్దత పరంగా కొన్నిసార్లు బ్రెజీల్, మరి కొన్ని సార్లు అర్జెంటీనా జట్లు ఇష్టమని, కానీ భారత్‌కే తాను అతిపెద్ద అభిమానినని రాథోడ్ చెప్పుకొచ్చారు. త్వరలోనే ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో భారత్‌ను చూస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరో మూడు రోజుల్లో (జూన్ 14న) ఫిఫా సంగ్రామం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇక భారత్ ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రీ ఆవేదనతో ఇచ్చిన పిలుపుకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఇంటర్ కాంటినెంటల్ టోర్నీలో భాగంగా భారత్ ఆడిన అన్ని ఫుట్ బాల్ మ్యాచ్‌లకు అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఆదివారం కెన్యాతో జరిగిన ఫైనల్లో భారత్ 2-0తో విజయం సాధించింది. -
భారత్ జోరుకు బ్రేక్
ముంబై: ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ టోర్నీలో భారత్ జోరుకు అడ్డుకట్ట పడింది. గురువారం ఇక్కడి ఎరీనా ఫుట్‌బాల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 2–1 గోల్స్‌తో సునీల్ చెత్రి సేనను ఓడించింది. భారత్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను 47వ నిమిషంలో కెప్టెన్ సునీల్ చెత్రి సాధించాడు. మరో రెండు నిమిషాల్లోనే న్యూజిలాండ్ స్ట్రయికర్ డి జాంగ్ గోల్ కొట్టి స్కోరు సమం చేశాడు. నాలుగు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా మెసెస్ డైర్ (86వ నిమిషంలో) రెండో గోల్‌తో న్యూజిలాండ్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అదనపు ఐదు నిమిషాల్లో కూడా భారత్ మరో గోల్ చేయలేకపోయింది. దీంతో చెత్రి సేన ఫైనల్ చేరేందుకు ఇతర మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ ఆరేసి పాయింట్లతో పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. శుక్రవారం చివరి లీగ్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ, కెన్యా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కెన్యా ఓడితే భారత్ నేరుగా ఫైనల్ చేరుతుంది. -
ఆ మ్యాచ్‌లకు రండి: సచిన్
హైదరాబాద్ : ‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ స్టేడియానికి వచ్చి మేం ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూడండి’ అని భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి ఆవేదనతో పిలుపుచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లు ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు వెళ్లాలని తమ ఫాలోవర్లకు పిలుపునిచ్చారు. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం స్పందించారు. తన ట్విటర్ అకౌంట్ ద్వారా..‘కమాన్ ఇండియా.. ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఎక్కడ ఎప్పుడు జరిగిన వెళ్లి మన జట్లకు మద్దతిస్తూ.. మైదానాలను నింపేద్దాం’ అని పిలుపునిచ్చాడు. C'mon India... Let's fill in the stadiums and support our teams wherever and whenever they are playing. @chetrisunil11 @IndianFootball pic.twitter.com/xoHsTXEkYp — Sachin Tendulkar (@sachin_rt) June 3, 2018 ‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ భారత ఫుట్‌బాల్ జట్టు ఆడే మ్యాచ్‌లను స్టేడియానికి వచ్చి చూడండి. యూరోపియన్ ఫుట్‌బాల్ క్లబ్‌లకు సపోర్ట్ తెలిపే మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఆటలో వారి స్థాయిని మేం అందుకోలేకపోవచ్చు. మా మ్యాచ్‌కు వచ్చి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలని అనిపించొచ్చు. మేం కాదనట్లేదు, ఆ స్థాయిలో మా ఆట లేదనే విషయాన్ని కూడా ఒప్పుకుంటాం. కానీ ఆట పట్ల మా నిబద్ధత, ప్రేమతో మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాం’ అని చెత్రీ అభిమానులను అభ్యర్థించాడు. -
‘శాఫ్’లో సప్తపది
ఏడోసారి టైటిల్ గెలిచిన భారత్ * ఫైనల్లో అఫ్ఘానిస్తాన్‌పై 2-1తో గెలుపు * నిర్ణాయక గోల్ చేసిన కెప్టెన్ సునీల్ చెత్రి తిరువనంతపురం: కొత్త ఏడాది భారత ఫుట్‌బాల్‌కు కొత్త కళ తెచ్చింది. దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య కప్ (శాఫ్)లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ టీమిండియా ఏడోసారి చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ అఫ్ఘానిస్తాన్‌ను బోల్తా కొట్టించింది. భారత్ తరఫున జెజె లాల్పెఖులా (72వ నిమిషంలో), కెప్టెన్ సునీల్ చెత్రి (101వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... అఫ్ఘానిస్తాన్ జట్టుకు జుబేర్ అమీరీ (69వ నిమిషంలో) ఏకైక గోల్‌ను అందించాడు. రెండేళ్ల క్రితం జరిగిన ‘శాఫ్’ కప్ ఫైనల్లో 0-2తో అఫ్ఘానిస్తాన్ చేతిలో ఎదురైన పరాజయానికి తాజా విజయంతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సునీల్ చెత్రి నాయకత్వంలోని టీమిండియా దూకుడైన ఆటతీరు ప్రదర్శించడంతో... చివరిసారిగా ‘శాఫ్’ కప్‌లో పాల్గొన్న అఫ్ఘానిస్తాన్‌కు నిరాశ తప్పలేదు. ఇక మీదట అఫ్ఘానిస్తాన్ కొత్తగా ఏర్పాటు చేసిన మధ్య ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (సీఏఎఫ్)లో పోటీపడుతుంది. ఇప్పటివరకు జరిగిన 11 ‘శాఫ్ కప్’ టోర్నీల్లో భారత్ పదిసార్లు ఫైనల్‌కు చేరుకొని ఏడుసార్లు (1993, 1997, 1999, 2005, 2009, 2011, 2016) విజేతగా నిలిచి, మూడుసార్లు రన్నరప్ (1995, 2008, 2013)తో సంతృప్తి పడింది. అఫ్ఘానిస్తాన్ జట్టులో ఉన్న మొత్తం 20 మంది సభ్యుల్లో 15 మంది విదేశీ లీగ్‌లలో ఆడుతుండటంతో ఫైనల్లో ఆ జట్టునే ఫేవరెట్‌గా పరిగణించారు. అయితే ఫైనల్లో భారత్ తీవ్ర పోరాటపటిమ కనబరిచింది. పక్కా ప్రణాళికతో ఆడి అఫ్ఘానిస్తాన్ దూకుడుకు పగ్గాలు వేసింది. అయినప్పటికీ ఆట 69వ నిమిషంలో జుబేర్ అమీరీ చేసిన గోల్‌తో అఫ్ఘానిస్తాన్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వారి ఆనందం మూడు నిమిషాల్లోనే ఆవిరైంది. 72వ నిమిషంలో జెజె గోల్‌తో స్కోరు సమమైంది. నిర్ణీత 90 నిమిషాల వరకు రెండు జట్లు 1-1తో సమఉజ్జీగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు అదనంగా 30 నిమిషాలు ఆడించారు. ఈ అదనపు సమయంలో సునీల్ చెత్రి భారత్‌కు గోల్ అందించి జట్టును 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత మరో 19 నిమిషాలు అఫ్ఘానిస్తాన్ జోరుకు పగ్గాలు వేసిన భారత్ విజయాన్ని ఖాయం చేసుకుంది. -
'వాటితో ముందుకెళ్లడం కష్టం'
న్యూఢిల్లీ: భారత్ లో క్రికెట్ తర్వాత ఎక్కువ ఆదరణ ఉన్న క్రీడ ఫుట్ బాల్. 1950వ దశకంలో భారత ఫుట్ బాల్ ఉచ్ఛస్థితిలో పయనించినా.. అటు తరువాత దాదాపు తిరోగమనంలో పయనించింది. కాగా, ఇటీవల కాలంలో భారత ఫుట్ బాల్ కు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐ లీగ్, ఐఎస్ఎల్ లు ఏర్పాటయ్యాయి. ఇప్పటికి రెండు సీజన్ లు పూర్తి చేసుకున్న ఐఎస్ఎల్.. త్వరలో మూడో సీజన్ కు కూడా సిద్ధమవుతోంది. కాగా,ఐఎస్ఎల్ ద్వారా ప్రేక్షక్షులకు మంచి వినోదం లభిస్తున్నా.. దేశంలోని ఫుట్ బాల్ కు మంచి రోజులు వచ్చినట్లు కనబడుట లేదు. దీనిపై భారత ఫుట్ బాల్ పై దిగ్గజ ఆటగాడు ఎస్ఎస్ హకీమ్ మాట్లాడుతూ.. ఏదో ఒకటి -రెండు టోర్నీల ద్వారా ఆ క్రీడ దేశంలో అభివృద్ధి చెందుతుందనుకోవడం అత్యాశే అవుతుందని అంటున్నాడు. భారత్ లో ఫుట్ బాల్ అభివృద్ధి చెందాలంటే మరిన్ని టోర్నీలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. ప్రస్తుతం భారత్ లో జరిగే ఐ లీగ్, ఐఎస్ఎల్ ద్వారా అయితే మాత్రం మనం ముందుకెళ్లడం కష్టమన్నాడు. ' కేవలం ఐ లీగ్-ఐఎస్ఎల్ ద్వారా ఏమీ ఒరగదు.ఈ రెండు టోర్నీలు మాత్రమే ఉండి మిగతా టోర్నమెంట్లు ఏమీ జరగకపోతే భారత్ ఫుట్ బాల్ ముందుకు పయనించదు.. మరిన్ని టోర్నీలకు శ్రీకారం చుట్టి భారత ఫుట్ బాల్ కు వన్నెతేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది' 'అని హకీమ్ తెలిపాడు. -
ఇలా ఇంకెంతకాలం...!
అత్యధిక జనాభా కలిగిన ప్రపంచ దేశాల్లో రెండో స్థానంలో ఉన్న భారత్... విశ్వవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన ఫుట్‌బాల్ క్రీడలో మాత్రం ఏ మూలనో ఉంది. ఒకప్పుడు 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానాన్ని దక్కించుకొని తమ ఉనికిని చాటుకున్న భారత ఫుట్‌బాల్ పరిస్థితి నేడు దయనీయంగా మారింది. దక్షిణాసియా పరిధిలో మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్ జట్లపై గెలిచేందుకు కూడా భారత జట్టు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. పలు కారణాలవల్ల చాలా జట్లు తప్పుకోవడంతో... 1950లో బ్రెజిల్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో భారత్‌కు పాల్గొనే సువర్ణావకాశం వచ్చింది. అయితే సరైన కారణాలు వివరించకుండానే అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) భారత జట్టును బ్రెజిల్‌కు పంపించేందుకు నిరాకరించింది. ఈ సదవకాశం చేజారిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు భారత్‌కు ప్రపంచకప్‌లో ఆడటం కలగానే మిగిలిపోయింది. ప్రపంచకప్ కోసం అర్హత పోటీలు మొదలయ్యాక భారత్ ఇప్పటివరకు ఆసియా జోన్ క్వాలిఫయింగ్‌లో రెండో రౌండ్‌ను దాటి ముందుకెళ్లలేకపోయింది. తాజాగా రష్యా ఆతిథ్యమివ్వనున్న 2018 ప్రపంచకప్ కోసం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఆసియా జోన్లో గ్రూప్ ‘డి’లో ఇరాన్, ఒమన్, తుర్క్మెనిస్తాన్, గ్వామ్ జట్లతో భారత్‌కు చోటు కల్పించారు. ఇప్పటివరకు భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. భారత ఆటతీరు చూశాక... ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుందనే విషయాన్ని పక్కనబెట్టి కనీ సం ఆసియా జోన్ నుంచి మూడో రౌండ్‌కు అర్హత పొందడం గగనంగా మారింది. తొలి మ్యాచ్‌లో తమకంటే పటిష్ట జట్టయిన ఒమన్ చేతిలో పోరాడి ఓడిన భారత్... రెండో మ్యాచ్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 174వ స్థానంలో ఉన్న గ్వామ్ జట్టు చేతిలో ఓడిపోవడమే అందర్నీ ఆశ్చర్యపరిచింది. కేవ లం లక్షా 65 వేలు జనాభా ఉన్న ఈ చిన్న దీవి జట్టు 2-1తో భారత్‌పై గెలిచి పెను సంచలనం సృష్టించింది. -సాక్షి క్రీడావిభాగం రెండు లక్షల జనాభా కూడా లేని గ్వామ్ లాంటి జట్టే తమ ఆటతీరులో పురోగతి సాధిస్తుండగా... భారత ఫుట్‌బాల్ పరిస్థితి మాత్రం తీసికట్టుగా తయారైంది. విదేశీ కోచ్‌లను నియమిస్తున్నా... ‘ఫిఫా’ నుంచి భారీ మొత్తంలో నిధులు వస్తున్నా... క్రమం తప్పకుండా జాతీయ పోటీలు జరుగుతున్నా... కొత్తగా ఇండియన్ సూపర్‌లీగ్ పేరిట లీగ్ జరిగినా... ఇవేమీ భారత ఫుట్‌బాల్‌లో గాలి నింపడంలేదు. కేరళ, బెంగాల్, గోవాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతిభావంతులైన ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ... భారత ఫుట్‌బాల్ సమాఖ్యలో చిత్తశుద్ధి లోపం మనపాలిట శాపంలా మారింది. క్షేత్రస్థాయిలో సౌకర్యాలు కల్పించడం... ప్రతిభాశీలురను గుర్తించి వారికి నాణ్యమైన శిక్షణ ఇప్పించడం... అంతర్జాతీయ అనుభవం వచ్చేందుకు మంచి జట్లతో రెగ్యులర్‌గా మ్యాచ్‌లను ఆడించడం... దూరదృష్టితో భవిష్యత్ అవసరాల కోసం పకడ్బందీ ప్రణాళికలు రూపొందించడం... రిటైరైన స్టార్ ఆటగాళ్ల సేవలను వినియోగించుకోవడం లాంటి ఆలోచనలు భారత ఫుట్‌బాల్ సమాఖ్యలో ఇప్పటికైనా మెదలాలి. 2018 ప్రపంచకప్‌ను వదిలేసి... ఇప్పటినుంచే 2022 ప్రపంచకప్ కోసం సన్నాహాలు ప్రారంభించాలి. దృఢ సంకల్పం, చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఆలస్యమైనా మన ఫుట్‌బాల్‌కు మంచి రోజులొస్తాయి.