‘శాఫ్’లో సప్తపది
ఏడోసారి టైటిల్ గెలిచిన భారత్
* ఫైనల్లో అఫ్ఘానిస్తాన్‌పై 2-1తో గెలుపు
* నిర్ణాయక గోల్ చేసిన కెప్టెన్ సునీల్ చెత్రి
తిరువనంతపురం: కొత్త ఏడాది భారత ఫుట్‌బాల్‌కు కొత్త కళ తెచ్చింది. దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య కప్ (శాఫ్)లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ టీమిండియా ఏడోసారి చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ అఫ్ఘానిస్తాన్‌ను బోల్తా కొట్టించింది. భారత్ తరఫున జెజె లాల్‌పెఖులా (72వ నిమిషంలో), కెప్టెన్ సునీల్ చెత్రి (101వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... అఫ్ఘానిస్తాన్ జట్టుకు జుబేర్ అమీరీ (69వ నిమిషంలో) ఏకైక గోల్‌ను అందించాడు.
రెండేళ్ల క్రితం జరిగిన ‘శాఫ్’ కప్ ఫైనల్లో 0-2తో అఫ్ఘానిస్తాన్ చేతిలో ఎదురైన పరాజయానికి తాజా విజయంతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సునీల్ చెత్రి నాయకత్వంలోని టీమిండియా దూకుడైన ఆటతీరు ప్రదర్శించడంతో... చివరిసారిగా ‘శాఫ్’ కప్‌లో పాల్గొన్న అఫ్ఘానిస్తాన్‌కు నిరాశ తప్పలేదు. ఇక మీదట అఫ్ఘానిస్తాన్ కొత్తగా ఏర్పాటు చేసిన మధ్య ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (సీఏఎఫ్)లో పోటీపడుతుంది.
ఇప్పటివరకు జరిగిన 11 ‘శాఫ్ కప్’ టోర్నీల్లో భారత్ పదిసార్లు ఫైనల్‌కు చేరుకొని ఏడుసార్లు (1993, 1997, 1999, 2005, 2009, 2011, 2016) విజేతగా నిలిచి, మూడుసార్లు రన్నరప్ (1995, 2008, 2013)తో సంతృప్తి పడింది. అఫ్ఘానిస్తాన్ జట్టులో ఉన్న మొత్తం 20 మంది సభ్యుల్లో 15 మంది విదేశీ లీగ్‌లలో ఆడుతుండటంతో ఫైనల్లో ఆ జట్టునే ఫేవరెట్‌గా పరిగణించారు. అయితే ఫైనల్లో భారత్ తీవ్ర పోరాటపటిమ కనబరిచింది.
పక్కా ప్రణాళికతో ఆడి అఫ్ఘానిస్తాన్ దూకుడుకు పగ్గాలు వేసింది. అయినప్పటికీ ఆట 69వ నిమిషంలో జుబేర్ అమీరీ చేసిన గోల్‌తో అఫ్ఘానిస్తాన్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వారి ఆనందం మూడు నిమిషాల్లోనే ఆవిరైంది. 72వ నిమిషంలో జెజె గోల్‌తో స్కోరు సమమైంది. నిర్ణీత 90 నిమిషాల వరకు రెండు జట్లు 1-1తో సమఉజ్జీగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు అదనంగా 30 నిమిషాలు ఆడించారు. ఈ అదనపు సమయంలో సునీల్ చెత్రి భారత్‌కు గోల్ అందించి జట్టును 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత మరో 19 నిమిషాలు అఫ్ఘానిస్తాన్ జోరుకు పగ్గాలు వేసిన భారత్ విజయాన్ని ఖాయం చేసుకుంది.