దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–20 చాంపియన్‌షిప్‌లో భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. నేపాల్ వేదికగా గ్రూప్ ‘బి’ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–0 గోల్ తేడాతో మాల్దీవులు జట్టుపై గెలిచింది. మ్యాచ్ ఆరంభం నుంచి భారత స్ట్రయికర్లు తమ దాడులకు పదును పెట్టారు. కొరౌ సింగ్, కెల్విన్ సింగ్ టోరెమ్ ప్రత్యర్థి గోల్‌పోస్ట్ లక్ష్యంగా కదంతొక్కారు. ఈ క్రమంలో కెల్విన్ కొట్టిన షాట్‌ను ఎబందస్ యేసుదాసన్ గోల్‌గా మలిచేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు.
తర్వాత కాసేపటికి గుర్నాజ్ సింగ్ ఇచ్చిన కార్నర్ పాస్‌ను మోనిరుల్ హెడర్ గోల్ పోస్ట్‌ను చేరలేకపోయింది. అయినా సరే భారత యువ స్ట్రయికర్లు నిరాశచెందక తమ ప్రయత్నాలను కొనసాగించారు. 18వ నిమిషంలో కొరౌ, 47వ నిమిషంలో కెల్విన్ గోల్ కోసం చేసిన ప్రయత్నాలేవీ ఫలితమివ్వలేదు. రెండో అర్ధభాగంలోను గోల్ చేయడం కష్టంగా మారింది. చివరకు ఇంజ్యూరీ టైమ్ (90+5వ నిమిషం)లో మంగ్లెంతంగ్ కిప్‌జెన్ చేసిన గోల్ భారత్‌ను గెలిపించింది.
ఫినిషింగ్ లోపాలతో గోల్స్‌గా మలచలేకపోయినప్పటికీ కొరౌ సింగ్, కెల్విన్, ఎబిందస్‌లు తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. సోమవారం జరిగే సెమీఫైనల్లో గ్రూప్ ‘ఎ’ రన్నరప్, డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment