ఇలా ఇంకెంతకాలం...!
అత్యధిక జనాభా కలిగిన ప్రపంచ దేశాల్లో రెండో స్థానంలో ఉన్న భారత్... విశ్వవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన ఫుట్‌బాల్ క్రీడలో మాత్రం ఏ మూలనో ఉంది. ఒకప్పుడు 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానాన్ని దక్కించుకొని తమ ఉనికిని చాటుకున్న భారత ఫుట్‌బాల్ పరిస్థితి నేడు దయనీయంగా మారింది. దక్షిణాసియా పరిధిలో మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్ జట్లపై గెలిచేందుకు కూడా భారత జట్టు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. పలు కారణాలవల్ల చాలా జట్లు తప్పుకోవడంతో... 1950లో బ్రెజిల్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో భారత్‌కు పాల్గొనే సువర్ణావకాశం వచ్చింది. అయితే సరైన కారణాలు వివరించకుండానే అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) భారత జట్టును బ్రెజిల్‌కు పంపించేందుకు నిరాకరించింది. ఈ సదవకాశం చేజారిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు భారత్‌కు ప్రపంచకప్‌లో ఆడటం కలగానే మిగిలిపోయింది.
ప్రపంచకప్ కోసం అర్హత పోటీలు మొదలయ్యాక భారత్ ఇప్పటివరకు ఆసియా జోన్ క్వాలిఫయింగ్‌లో రెండో రౌండ్‌ను దాటి ముందుకెళ్లలేకపోయింది. తాజాగా రష్యా ఆతిథ్యమివ్వనున్న 2018 ప్రపంచకప్ కోసం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఆసియా జోన్‌లో గ్రూప్ ‘డి’లో ఇరాన్, ఒమన్, తుర్క్‌మెనిస్తాన్, గ్వామ్ జట్లతో భారత్‌కు చోటు కల్పించారు. ఇప్పటివరకు భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. భారత ఆటతీరు చూశాక... ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుందనే విషయాన్ని పక్కనబెట్టి కనీ సం ఆసియా జోన్ నుంచి మూడో రౌండ్‌కు అర్హత పొందడం గగనంగా మారింది.
తొలి మ్యాచ్‌లో తమకంటే పటిష్ట జట్టయిన ఒమన్ చేతిలో పోరాడి ఓడిన భారత్... రెండో మ్యాచ్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 174వ స్థానంలో ఉన్న గ్వామ్ జట్టు చేతిలో ఓడిపోవడమే అందర్నీ ఆశ్చర్యపరిచింది. కేవ లం లక్షా 65 వేలు జనాభా ఉన్న ఈ చిన్న దీవి జట్టు 2-1తో భారత్‌పై గెలిచి పెను సంచలనం సృష్టించింది.
-సాక్షి క్రీడావిభాగం
రెండు లక్షల జనాభా కూడా లేని గ్వామ్ లాంటి జట్టే తమ ఆటతీరులో పురోగతి సాధిస్తుండగా... భారత ఫుట్‌బాల్ పరిస్థితి మాత్రం తీసికట్టుగా తయారైంది. విదేశీ కోచ్‌లను నియమిస్తున్నా... ‘ఫిఫా’ నుంచి భారీ మొత్తంలో నిధులు వస్తున్నా... క్రమం తప్పకుండా జాతీయ పోటీలు జరుగుతున్నా... కొత్తగా ఇండియన్ సూపర్‌లీగ్ పేరిట లీగ్ జరిగినా... ఇవేమీ భారత ఫుట్‌బాల్‌లో గాలి నింపడంలేదు. కేరళ, బెంగాల్, గోవాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతిభావంతులైన ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు.
ప్రతిభ ఉన్నప్పటికీ... భారత ఫుట్‌బాల్ సమాఖ్యలో చిత్తశుద్ధి లోపం మనపాలిట శాపంలా మారింది. క్షేత్రస్థాయిలో సౌకర్యాలు కల్పించడం... ప్రతిభాశీలురను గుర్తించి వారికి నాణ్యమైన శిక్షణ ఇప్పించడం... అంతర్జాతీయ అనుభవం వచ్చేందుకు మంచి జట్లతో రెగ్యులర్‌గా మ్యాచ్‌లను ఆడించడం... దూరదృష్టితో భవిష్యత్ అవసరాల కోసం పకడ్బందీ ప్రణాళికలు రూపొందించడం... రిటైరైన స్టార్ ఆటగాళ్ల సేవలను వినియోగించుకోవడం లాంటి ఆలోచనలు భారత ఫుట్‌బాల్ సమాఖ్యలో ఇప్పటికైనా మెదలాలి. 2018 ప్రపంచకప్‌ను వదిలేసి... ఇప్పటినుంచే 2022 ప్రపంచకప్ కోసం సన్నాహాలు ప్రారంభించాలి. దృఢ సంకల్పం, చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఆలస్యమైనా మన ఫుట్‌బాల్‌కు మంచి రోజులొస్తాయి.