'వాటితో ముందుకెళ్లడం కష్టం'
న్యూఢిల్లీ: భారత్ లో క్రికెట్ తర్వాత ఎక్కువ ఆదరణ ఉన్న క్రీడ ఫుట్ బాల్. 1950వ దశకంలో భారత ఫుట్ బాల్ ఉచ్ఛస్థితిలో పయనించినా.. అటు తరువాత దాదాపు తిరోగమనంలో పయనించింది. కాగా, ఇటీవల కాలంలో భారత ఫుట్ బాల్ కు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐ లీగ్, ఐఎస్ఎల్ లు ఏర్పాటయ్యాయి.
ఇప్పటికి రెండు సీజన్ లు పూర్తి చేసుకున్న ఐఎస్ఎల్.. త్వరలో మూడో సీజన్ కు కూడా సిద్ధమవుతోంది. కాగా,ఐఎస్ఎల్ ద్వారా ప్రేక్షక్షులకు మంచి వినోదం లభిస్తున్నా.. దేశంలోని ఫుట్ బాల్ కు మంచి రోజులు వచ్చినట్లు కనబడుట లేదు. దీనిపై భారత ఫుట్ బాల్ పై దిగ్గజ ఆటగాడు ఎస్ఎస్ హకీమ్ మాట్లాడుతూ.. ఏదో ఒకటి -రెండు టోర్నీల ద్వారా ఆ క్రీడ దేశంలో అభివృద్ధి చెందుతుందనుకోవడం అత్యాశే అవుతుందని అంటున్నాడు. భారత్ లో ఫుట్ బాల్ అభివృద్ధి చెందాలంటే మరిన్ని టోర్నీలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. ప్రస్తుతం భారత్ లో జరిగే ఐ లీగ్, ఐఎస్ఎల్ ద్వారా అయితే మాత్రం మనం ముందుకెళ్లడం కష్టమన్నాడు. ' కేవలం ఐ లీగ్-ఐఎస్ఎల్ ద్వారా ఏమీ ఒరగదు.ఈ రెండు టోర్నీలు మాత్రమే ఉండి మిగతా టోర్నమెంట్లు ఏమీ జరగకపోతే భారత్ ఫుట్ బాల్ ముందుకు పయనించదు.. మరిన్ని టోర్నీలకు శ్రీకారం చుట్టి భారత ఫుట్ బాల్ కు వన్నెతేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది' 'అని హకీమ్ తెలిపాడు.