
కౌలాలంపూర్: ‘ఫిఫా’ అండర్–17 ప్రపంచ కప్ బెర్త్ సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్‌సీ) అండర్–16 చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 0–1తో కొరియా చేతిలో పరాజయం పాలైంది. ఈ ఓటమితో యువ భారత్ ప్రపంచకప్‌లో పాల్గొనే గొప్ప అవకాశాన్ని చేజార్చుకుంది. ఇందులో సెమీస్ చేరిన జట్లకు పెరూ వేదికగా 2019లో జరుగనున్న అండర్–17 ప్రపంచకప్ టోర్నీకి అర్హత లభిస్తుంది. 2017లో భారత్ వేదికగా జరిగిన ఫిఫా అండర్–17 ప్రపంచకప్‌లో టీమిండియాకు ఆతిథ్య హోదాలో ఈ మెగా టోర్నీలో తొలిసారి పాల్గొనే అవకాశం దక్కింది. ఈ సారి క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా అర్హత సాధించాల్సిన స్థితిలో భారత్ విఫలమైంది.
ఆకట్టుకున్న నీరజ్...
16 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో క్వార్టర్స్ ఆడుతున్న యువభారత్... టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన కొరియాపై తుదికంటా పోరాడింది. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను ఆట 67వ నిమిషంలో జియాంగ్ సాంగ్‌బిన్ (కొరియా) సాధించాడు. ఈ మ్యాచ్‌లో గోల్‌కీపర్ నీరజ్ అడ్డుగోడలా నిలిచి కొరియన్ల సహనాన్ని పరీక్షించాడు. ఆట 14వ నిమిషంలోనే ప్రత్యర్థి గోల్‌ను అడ్డుకున్న నీరజ్... ఆట 34వ నిమిషంలో, 36వ నిమిషంలో కొరియన్లు చేసిన మెరుపు దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొని వారిని నిలువరించాడు. కొద్ది క్షణాల్లో తొలి అర్ధభాగం ముగుస్తుందనగా రవిరాణా షాట్‌ను కొరియన్లు అడ్డుకోవడంతో గోల్ లేకుండానే భారత్ విరామానికెళ్లింది. రెండో అర్ధభాగంలోనూ దూకుడు పెంచిన భారత్ 52వ నిమిషంలో గోల్ చేసినంత పని చేసింది. భారత ఆటగాడు రిడ్గే డి మెలోస్ వ్యాలీని ప్రత్యర్థి రక్షణశ్రేణి అడ్డుకుంది. 2002లోనూ భారత్ 1–3తో కొరియా చేతిలోనే ఓటమి పాలైంది.