సునీల్‌ ఛెత్రి వీడ్కోలు | Sunil Chhetri played the last match for the national team | Sakshi
Sakshi News home page

సునీల్‌ ఛెత్రి వీడ్కోలు

Published Fri, Jun 7 2024 4:14 AM | Last Updated on Fri, Jun 7 2024 4:14 AM

Sunil Chhetri played the last match for the national team

జాతీయ జట్టు తరఫున చివరి మ్యాచ్‌ ఆడిన కెప్టెన్‌

భారత్, కువైట్‌ మ్యాచ్‌ 0–0తో ‘డ్రా’

కోల్‌కతా: రెండు దశాబ్దాలుగా భారత ఫుట్‌బాల్‌ ముఖచిత్రంగా ఉన్న సునీల్‌ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌–2026 ఆసియా జోన్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా గురువారం కువైట్‌తో జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌ను సునీల్‌ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు 0–0తో ‘డ్రా’ చేసుకుంది.

నిర్ణీత సమయంలోపు రెండు జట్లు ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయాయి. నాలుగో నిమిషంలో కువైట్‌ ప్లేయర్‌ ఈద్‌ అల్‌ రషీది కొట్టిన షాట్‌ను భారత గోల్‌కీపర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ సంధూ నిలువరించాడు. అనంతరం 11వ నిమిషంలో అన్వర్‌ అలీ కొట్టిన హెడర్‌ షాట్‌ లక్ష్యాన్ని చేరలేకపోయింది. 

48వ నిమిషంలో భారత ప్లేయర్‌ రహీమ్‌ అలీ ‘డి’ ఏరియాలోకి వెళ్లినా అతను కొట్టిన షాట్‌లో బలం లేకపోవడంతో బంతి నేరుగా కువైట్‌ గోల్‌కీపర్‌ చేతుల్లోకి వెళ్లింది. ఆ తర్వాత రెండు జట్లకు గోల్‌ చేసేందుకు ఒకట్రెండు అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాయి. భారత్‌ తన చివరి మ్యాచ్‌ను జూన్‌ 11న ఆసియా చాంపియన్‌ ఖతర్‌ జట్టుతో ఆడనుంది.  

2005లో జాతీయ సీనియర్‌ జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వహించిన సునీల్‌ ఛెత్రి ఓవరాల్‌గా భారత్‌ తరఫున 151 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 94 గోల్స్‌ సాధించాడు. ఇందులో నాలుగు ‘హ్యాట్రిక్‌’లున్నాయి. జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన ఫుట్‌బాలర్స్‌ జాబితాలో ఛెత్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. 

క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్‌; 206 మ్యాచ్‌ల్లో 128 గోల్స్‌), అలీ దాయ్‌ (ఇరాన్‌; 149 మ్యాచ్‌ల్లో 109 గోల్స్‌); లయనెల్‌ మెస్సీ (అర్జెంటీనా; 180 మ్యాచ్‌ల్లో 106 గోల్స్‌) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. రికార్డుస్థాయిలో ఏడుసార్లు జాతీయ ఉత్తమ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ అవార్డు గెల్చుకున్న సునీల్‌ ఛెత్రికి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌రత్న’ (2021లో)... అర్జున అవార్డు (2011లో), పద్మశ్రీ (2019లో) లభించాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement