
ముంబై : త్వరలోనే ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు పాల్గొంటుందనీ కేంద్ర క్రీడాశాఖమంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ అభిప్రాయపడ్డారు. ఆ సత్తా భారత ఆటగాళ్లకు ఉందని పేర్కొన్నాడు. ఓ ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ‘భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది. చాలా మంది ఐపీఎల్ టోర్నీలానే ఫిఫా వరల్డ్‌కప్‌ను చూసేందుకు సిద్దంగా ఉన్నారు. ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత్ పాల్గొనకపోయినప్పటికీ ఆ టోర్నీలో పాల్గొనే సత్తా మనకు ఉంది. ఆటగాళ్లకు వచ్చే అవకాశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. త్వరలోనే ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత్ ఆడనుంది. ఫుట్‌బాల్ లేక ఏ క్రీడలోనైనా పోటీ ఇచ్చే సత్తా భారత్‌కు ఉంది’ అని పేర్కొన్నారు.
ఆటగాళ్ల శిక్షణ పొందే అవకాశాలు, వారికి లభించే మద్దతు గతంలో కన్నా ఇప్పుడు చాలా బాగుందన్నారు. పాఠశాలలు కేవలం చదువులపై కాకుండా ఆటల్లో ప్రోత్సాహం కలిగించేలా దృష్టి సారించాలని కోరారు. ఖేలో ఇండియాలో భాగంగా అండర్-17నే కాకుండా ఈ సారి అండర్-21 కాలేజీ గేమ్స్ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆటగాళ్ల నిబద్దత పరంగా కొన్నిసార్లు బ్రెజీల్, మరి కొన్ని సార్లు అర్జెంటీనా జట్లు ఇష్టమని, కానీ భారత్‌కే తాను అతిపెద్ద అభిమానినని రాథోడ్ చెప్పుకొచ్చారు. త్వరలోనే ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో భారత్‌ను చూస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరో మూడు రోజుల్లో (జూన్ 14న) ఫిఫా సంగ్రామం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇక భారత్ ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రీ ఆవేదనతో ఇచ్చిన పిలుపుకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఇంటర్ కాంటినెంటల్ టోర్నీలో భాగంగా భారత్ ఆడిన అన్ని ఫుట్ బాల్ మ్యాచ్‌లకు అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఆదివారం కెన్యాతో జరిగిన ఫైనల్లో భారత్ 2-0తో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment