రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్‌ | Sunil Chhetri Comes Out Of Retirement | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్‌

Published Fri, Mar 7 2025 6:56 PM | Last Updated on Fri, Mar 7 2025 7:34 PM

Sunil Chhetri Comes Out Of Retirement

భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ మళ్లీ నీలం రంగు జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. 40 ఏళ్ల ఛెత్రీ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ ప్రకటించింది. ఛెత్రీ త్వరలో జరుగనున్న ఫిఫా ఇంటర్నేషనల్‌ విండోలో​ భారత్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఫిఫా ఇంటర్నేషనల్‌ విండో కోసం ప్రకటించిన 26 మంది సభ్యుల భారత జట్టులో ఛెత్రీకి చోటు దక్కింది. ఏడాది గడుస్తున్నా భారత జట్టులో తన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోవడంతో రిటైర్మెంట్‌ విషయంలో ఛెత్రీ మనసు మార్చుకున్నాడు.  

పదేళ్లకు పైగా భారత జట్టుకు నాయకత్వం వహించిన ఛెత్రీ.. గతేడాది జూన్‌ 6న రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కోల్‌కతాలో కువైట్‌తో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ ఛెత్రీకి చివరిది.

2005లో భారత్‌ తరఫున అరంగ్రేటం చేసిన ఛెత్రీ.. భారత ఆల్‌టైమ్‌ లీడింగ్‌ గోల్‌ స్కోరర్‌గా కెరీర్‌ ముగించాడు. ఛెత్రీ భారత్‌ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగానూ రికార్డు కలిగి ఉన్నాడు. 

ఛెత్రీ తన కెరీర్‌లో 94 అంతర్జాతీయ గోల్స్‌ సాధించాడు. పురుషుల అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో నాలుగో​ అత్యధిక గోల్‌ స్కోరర్‌గా ఛెత్రీ కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్‌ మెస్సీ, అలీ డై మాత్రమే ఛెత్రీ కంటే ఎక్కువ గోల్స్‌ చేశారు.

ఛెత్రీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో బెంగళూరు ఎఫ్‌సీకి ప్రాతినిథ్యం వహిస్తూనే ఉన్నాడు. ఈ సీజన్‌లో ఛెత్రీ 12 మ్యాచ్‌ల్లో 23 గోల్స్‌ చేసి ఐఎస్‌ఎల్‌లో భారత్‌ తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడిగా నిలిచాడు.

కాగా, భారత ఫుట్‌బాల్‌ జట్టు ఏఎఫ్‌సీ ఆసియా కప్‌ సౌదీ అరేబియా 2027 క్వాలిఫయర్స్‌ ఫైనల్‌ రౌండ్‌ సన్నాహకాల్లో భాగంగా మార్చి 19న మాల్దీవ్స్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడనుంది. అనంతరం భారత్‌ ఏఎఫ్‌సీ ఆసియా కప్‌-2027 క్వాలిఫయర్స్‌లో (మార్చి 25) బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో భారత్‌.. బంగ్లాదేశ్‌, హాంగ్‌కాంగ్‌, సింగపూర్‌ జట్లతో పోటీపడనుంది. ఈ టోర్నీలో భారత్‌ మ్యాచ్‌లు షిల్లాంగ్‌లోని జవహర్‌ లాల్‌ స్టేడియంలో జరుగనున్నాయి.

ఫిఫా ఇంటర్నేషనల్‌ విండో కోసం​ భారత జట్టు..

గోల్‌ కీపర్స్‌- అమరిందర్‌ సింగ్‌, గుర్మీత్‌ సింగ్‌, విశాల్‌ కైత్‌

డిఫెండర్స్‌- ఆషికి కురునియన్‌, ఆయుశ్‌ దేవ్‌ ఛెత్రీ, బ్రాండన్‌ ఫెర్నాండెస్‌, బ్రైసన్‌ ఫెర్నాండెస్‌, జీక్సన్‌ సింగ్‌ థౌనౌజమ్‌, లాలెంగ్మావియా, లిస్టన్‌ కొలాకో, మహేశ్‌ సింగ్‌ నోరెమ్‌, సురేశ్‌ సింగ్‌ వాంగ్జమ్‌

ఫార్వర్డ్స్‌- సునీల్‌ ఛెత్రీ, ఫరూక్‌ ఛౌదరీ, ఇర్ఫాన్‌ యద్వాద్‌, లల్లియన్జువాలా ఛంగ్టే, మన్వీర్‌ సింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement