ఒలింపియన్ సలామ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: పాతతరం ఫుట్‌బాల్ స్టార్ క్రీడాకారుడు ఎస్.ఎ.సలామ్ శనివారం కన్నుమూశారు. ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న 77 ఏళ్ల సలామ్ హైదరాబాద్ టోలీచౌకీలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టులో ఆయన సభ్యుడిగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్‌ట్స అథారిటీ (శాప్)లో డిప్యూటీ డెరైక్టర్‌గా విధులు నిర్వహించి రిటైరైన సలామ్‌కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
హైదరాబాద్ స్పోర్టింగ్ క్లబ్‌తో కెరీర్‌ను ప్రారంభించిన ఆయన మెల్‌బోర్న్ ఒలింపిక్స్ తర్వాత కోల్‌కతాకు మకాం మార్చారు. కొన్నేళ్లపాటు ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్, మొహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ లాంటి ప్రముఖ క్లబ్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. సలామ్ సారథ్యంలో మొహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టు కోల్‌కతా ఫుట్‌బాల్ లీగ్‌లో, ఐఎఫ్‌ఏ షీల్డ్ టోర్నీలో విజేతగా నిలిచింది. క్రీడాకారుడిగా కెరీర్ ముగిశాక సలామ్ కోచ్‌గా మారారు. సలామ్ శిక్షణలో భారత అండర్-19 జట్టు 1974లో ఆసియా చాంపియన్‌షిప్‌లో సంయుక్త విజేతగా నిలిచింది.