గన్తో మైదానంలోకొచ్చిన రెఫరీ
బ్రెజిల్: ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా రెఫరీ మైదానంలోకి గన్ తీసుకు రావడం కలకలం సృష్టించింది. బ్రెజీలియన్ ఫుట్ బాల్ మ్యాచ్ లో చెలరేగిన గొడవ కాస్తా.. రెఫరీ మైదానంలోకి గన్ తీసుకు వచ్చే వరకు వెళ్లింది. ఈ సంఘటన బ్రెజిల్లో బెలో హోరిజెంటో సమీపంలోని బ్రుమాండినోలో చోటుచేసుకుంది. బ్రుమాండినో ఫుట్ బాల్ జట్టు అమాంటెస్ డ బోలా జట్టుతో తలపడుతుండగా ఈ ఘటన జరిగింది. ఫుట్ బాల్ మ్యాచ్లో భాగంగా ప్రత్యర్థి జట్టు ఆటగాడికి రెడ్ కార్డు జారీ చేయాలని ఆటగాళ్లు రెఫరీని డిమాండ్ చేశారు. అందుకు నిరాకరించిన రెఫరీపై ఆటగాళ్లు చేయిచేసుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన రెఫరీ చేంజింగ్ రూంకి వెళ్లి మైదానానికి గన్ను తీసుకు వచ్చాడు. ఇలా ప్రవర్తించినందుకు గాబ్రీ మూర్తా క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోనున్నాడు.
'అమాంటెస్ డ బోలా జట్టు సభ్యులు మూర్తాని కాలితో తన్ని, చెంపపై కొట్టడం వల్లే అలా చేశాడు' అని లీగ్ ప్రెసిడెంట్ వాల్దెనిర్ తెలిపారు. 'తనని తాను కాపాడుకోవడం కోసమే గన్ను తీసుకొచ్చాడు' అని రెఫీరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొజోనో, రెఫరీ మూర్తాను వెనకేసుకోచ్చాడు.