అదిగో ఆయేషా అజీజ్! | Special Story On Youngest Indian female Pilot Ayesha Aziz | Sakshi
Sakshi News home page

అదిగో ఆయేషా అజీజ్!

Published Sun, Feb 14 2021 1:20 AM | Last Updated on Sun, Feb 14 2021 10:25 AM

Special Story On Youngest Indian female Pilot Ayesha Aziz - Sakshi

ఆయేషా అజీస్‌ : పైలట్‌గా దేశంలో ‘యంగెస్ట్‌’

కొన్నింటిని అతిశయోక్తిగా చెప్పకపోతే, చెప్పడం మానడమే మేలు! అకాశంలో ఎగురుతున్న పక్షుల్ని చూస్తే తమక్కూడా రెక్కలు ఉంటే బాగుండుననుకుంటారు పిల్లలెవరైనా. శ్రీనగర్‌లోని ఆడపిల్లలు మాత్రం ఆయేషా అజీజ్‌ గురించి వినగానే పక్షులైపోయి ఆకాశంలో విహరిస్తారు! ఆయేషా కమర్షియల్‌ పైలట్‌. దేశంలోనే అతి చిన్న వయసులో పైలట్‌ అయిన అమ్మాయి! పదిహేనేళ్ల వయసుకే ఆమెకు పైలట్‌ లైసెన్స్‌ వచ్చింది. ఇప్పుడు ఆమె వయసు ఇరవై ఐదు. భారతదేశ ప్రసిద్ధ వార్తా సంస్థ ఎ.ఎన్‌.ఐ. (ఏషియన్‌ న్యూస్‌ ఇంటర్నేషనల్‌) ఆయేషా పదేళ్ల పైలట్‌ జర్నీ గురించి ఇంటర్వ్యూ చేయడంతో తాజాగా ఆమె వార్తల్లోకి వచ్చారు.

ఆయేషా అజీజ్‌ పేరు మొదటిసారి 2011 లో దేశానికి తెలిసింది. అది ఆమె పైలట్‌ లైసెన్స్‌ సాధించిన సంవత్సరం. శిక్షణ కోసం లైసెన్స్‌ అది. శిక్షణ రష్యాలోని సొకోల్‌ వైమానిక స్థావరంలో! ప్రారంభంలోనే ఎం.ఐ.జి.–29 జెట్‌ను నడపడం నేర్చుకున్నారు ఆయేషా. ఆ తర్వాత ఆమె సాధించవలసింది కమర్షియల్‌ లైసెన్స్‌. బాంబే ఫ్లయింగ్‌ క్లబ్‌లో చేరి విమానయానంలో డిగ్రీ సాధించాక ఆ లైసెన్స్‌ కూడా వచ్చేసింది. అది 2017లో.

2011లో లైసెన్స్‌ పొందాక తన ఈ పదేళ్ల ప్రస్థానం గురించి ఎ.ఎన్‌.ఐ. తో మాట్లాడుతున్నప్పుడు ఆయేషా తన గురించి కాక, కశ్మీర్‌లో ఇప్పుడు చక్కగా చదువుకుని పైకొస్తున్న ఆడపిల్లల గురించే ఎక్కువగా ప్రస్తావించారు. ‘వాళ్లలో పైలట్‌ అవాలనుకున్న అమ్మాయిలకు మీరే ఇన్‌స్పిరేషన్‌ అయుండొచ్చు కదా..’ అన్న మాటకు, ‘కావచ్చేమో!’ అని నవ్వారు ఆయేషా. పైలట్‌ గా ఆమె తన కెరీర్‌ను ఎంజాయ్‌ చేస్తున్నట్లు కూడా చెప్పారు. ‘‘ఎందుకంటే నాకు 9–5 ఉద్యోగం పడదు. నాకే కాదు.. అసలు ఏ అమ్మాయికీ అలాంటి ఉద్యోగం ఇష్టం ఉండదు. అవకాశం ఉండాలే కానీ, ఖండాలన్నీ తిరగాలనుకుంటుంది. అంతుకు తల్లిదండ్రులే లాంచింగ్‌ స్టెప్‌ అవాలి..’’ అంటారు ఆయేషా.
∙∙

ఆయేషాకు ఆకాశంలో ఎగరాలని మరీ చిన్న వయసులోనే మనసులో పడిపోయింది. వందల మంది ప్రయాణీకులను సురక్షితంగా గమ్యం చేర్చే ఉద్యోగం ఎంత థ్రిల్‌గా చెప్పడానికే ఆమె ఏ సమయంలోనైనా ఉత్సాహం చూపుతారు. తల్లిదండ్రులిద్దరూ రెండు చేతులతో భద్రంగా పైకి ఎగరేసిన పైలట్‌ పావురం ఆయేషా. వారు పెద్ద సపోర్ట్‌ ఆమె కెరీర్‌కు. ‘యంగెస్ట్‌ స్టూడెంట్‌ పైలట్‌’ అనే రికార్డు కూడా ఇప్పటికీ ఆమె పేరు మీదే ఉంది. ఆయేషా పుట్టింది కశ్మీర్‌లో. పెరిగింది ముంబైలోని వర్లీలో. తల్లితో కలిసి ముంబై నుంచి అమ్మమ్మ వాళ్లుండే జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాకు తరచు విమానంలో వెళ్లివస్తుండంతో తనూ విమానాన్ని నడపాలని అనుకుంది ఆయేషా! ఆ మాటే అమ్మానాన్నకు చెబితే.. ‘తప్పకుండా.. అయితే అందుకు కష్టపడి చదవాల్సి ఉంటుంది’ అని చెప్పారు.

టెన్త్‌ పూర్తి చేయగానే ఆమె ఆశకు పైలట్‌ కోర్సుతో రెక్కలు కట్టారు. పైలట్‌ అయ్యాక తొలిసారి అమ్మానాన్న ఉన్న విమానాన్ని నడపడం ఆయేషా జీవితంలోని మరపురాని అపురూప ఘటన. ఇక తల్లిదండ్రులు గర్వ పడకుండా ఉంటారా.. కూతురు కూర్చోబెట్టి తమను, ఇంకా మరికొంతమందిని గాల్లో తేలియాడిస్తుంటే! బాంబే ఫ్లయింగ్‌ క్లబ్‌లో లైసెన్స్‌ సాధించాక 2012లో ‘నాసా’లో కూడా రెండు నెలల ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు ఆయేషా! అక్కడ ఆమెకు జాన్‌ మెక్‌బ్రైడ్‌ అనే నాసా రిటైర్డ్‌ వ్యోమగామి పరిచయం అయ్యారు. స్పేస్‌ షటిల్‌ మిషన్, మైక్రో గ్రావిటీ, మాన్‌డ్‌ మానోవరింగ్‌ (విన్యాసాలు), మల్టీ యాక్సిస్‌ ట్రైనింగ్, ఎక్స్‌ట్రా వెహిక్యులర్‌ యాక్టివిటీ.. వీటన్నిటిలో మెక్‌బ్రైడ్‌ ఆమెకు మెళకువలు నేర్పారు.
∙∙
జాన్‌ మెక్‌బ్రైడ్‌ తర్వాత ఆమెలో పూర్తి స్థాయి స్ఫూర్తిని నింపినవారు నాసాలోని భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌. స్వయంగా వెళ్లి సునీతను కలుసుకున్నారు ఆయేషా. నీటిలో స్కూబా డైవింగ్, నింగిలో మూన్‌ వాక్‌లలో తన అనుభవాలను ఆయేషాతో పంచుకుని ఆమె కలలకు ఇంధనాన్ని నింపారు సునీత. 1960లో ప్రైవేట్‌ పైలట్‌ లైసెన్స్‌తో ప్రయాణీకుల విమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళా పైలట్‌ రబియా ఫతే అలీ దగ్గర కూడా ఆయేషా ఆసక్తి కొద్దీ మరికొన్ని నైపుణ్యాలు నేర్చుకున్నారు. పైలట్‌ శిక్షణ లైసెన్స్‌ సంపాదించాక 2012లో శిక్షణలో భాగంగా తొలిసారి ఎం.ఐ.జి జెట్‌ను నడిపినప్పుడు ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేనని అంటారు ఆయేషా.

ఆనాటి చిన్న పిల్ల ఇప్పుడు ‘ఇండియన్‌ ఉమెన్‌ పైలట్స్‌ అసోసియేషన్‌’ లో ప్రతిష్టాత్మక సభ్యురాలు. అయితే స్టూడెంట్‌ పైలట్‌గా, పైలట్‌గా, అసోసియేషన్‌ సభ్యురాలిగా ఘనమైన గుర్తింపు కలిగి ఉన్న ఆయేషాకూ కొన్ని ఒత్తిడిలు తప్పలేదు. సంప్రదాయ శిరోవస్త్రాన్ని (హిజబ్‌) ఎందుకు ధరించరనే ప్రశ్నను ఆమె ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు! అందుకు ఆమె దగ్గర సమాధానం కూడా ఉంది. ‘‘ప్రవక్త భార్య హజ్రత్‌ ఆయేషా యుద్ధంలో ఒంటెను స్వారీ చేయించగా లేనిది, నేను విమానాన్ని నడిపేందుకు సంప్రదాయాలు ఎందుకు అడ్డపడాలి?’’ అంటారు ఆయేషా.

2018 జనవరిలో ఢిల్లీలోని రాజ్‌భవన్‌లో ఆర్మీ చీఫ్, రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ఫస్ట్‌ లేడీస్‌’ టైటిల్‌ను అందుకున్న ఆయేషా.. పైలట్‌లు కావాలన్న ఉత్సాహం ఉండీ, ఆర్థికంగా వెలుసుబాటు లేని అమ్మాయిల్ని పైలట్‌లుగా ప్రోత్సహించేందుకు ఇండియన్‌ ఉమెన్‌ పైలట్స్‌ అసోసియేషన్‌ తరఫున కృషి చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement