youngest pilot
-
వయసు 18.. వృత్తి పైలట్
కర్ణాటకకు చెందిన సమైరా హల్లూర్ 18 ఏళ్లకే కమర్షియల్ పైలట్ అయ్యింది.ఆరు రాతపరీక్షలు 200 గంటల ఫ్లయింగ్ అవర్స్ ఆమెకు ఈ అర్హతను సంపాదించి పెట్టాయి. కొత్త ఎత్తులకు ఎగరాలనుకునే ఈ తరానికి ప్రతినిధి సమైరా.కొన్నేళ్ల క్రితం బీజాపూర్ ఉత్సవాలు జరుగుతున్నాయి. అవి భారీగా జరిగే ఉత్సవాలు. ఆ సందర్భంగా ప్రభుత్వం హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేసింది. టికెట్ కొనుక్కుంటే అలా ఊరి మీద ఒక రౌండ్ వేయొచ్చు. హైస్కూల్ చదువుతున్న సమైరాను సంతోపెట్టడానికి తండ్రి అమిన్ హల్లూర్ భార్యతో కలిసి హెలికాప్టర్ రైడ్‌కు వెళ్లారు. సమైరాకు పైలట్ పక్కన సీటు దొరికింది. హెలికాప్టర్ పైకి ఎగురుతుండగానే ఆ అనుభూతికి థ్రిల్ అయిపోయింది సమైరా. పైలట్ డ్రస్, ఆ దర్పం, హెలికాప్టర్‌ను ఎగరేస్తున్న ఆ నైపుణ్యం... అందరూ పైలట్‌ను చూస్తున్న అబ్బురమైన చూపు అన్నీ సమైరాను ఆకర్షించాయి. ఆ అమ్మాయి హెలికాప్టర్ గాలిలో చక్కర్లు కొడుతున్నంతసేపు కింద చూడకుండా పైలట్‌ను ప్రశ్నలు అడుగుతూనే ఉంది. ఆ పైలట్ సహనశీలి. సమైరా అడుగుతున్న ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చాడు.‘కిందకు దిగాక మాతో సమైరా ఒకటే అంది. నాన్నా... నేను కూడా పైలట్‌ను అవుతాను అని. నేను ఒక మధ్య తరగతి ఇంటీరియర్ డిజైనర్‌ని. నా భార్య టీచర్. మా అమ్మాయి అలాంటి కోరిక కోరడం మాకు ఆశ్చర్యం కలిగించింది. అలాంటి కోరిక కోరే అమ్మాయి ఉండాలి కదా అసలు. అందుకే మేము ఏమైనా సరే అమ్మాయిని పైలట్ చేయాలనుకున్నాం. మాకున్న కొద్దిపాటి ఆదాయాన్ని పొదుపు చేసి ఆమెకోసం ఖర్చు పెట్టాం‘ అంటాడు సమైరా తండ్రి అమిన్ హల్లూర్.సమైరా ముందు నుంచి కూడా బ్రైట్ స్టూడెంట్. బీజాపూర్‌లోని సైనిక్ స్కూల్స్‌లో చదువుకుంది. 17 ఏళ్లకు ఎంపీసీలో ఇంటర్ పూర్తి చేసింది. ‘కమర్షియల్ పైలట్ కావాలంటే సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ పెట్టే పరీక్షలు పాసవ్వాలి. ఆ తర్వాత ఫ్లయింగ్ అవర్స్‌లో అనుభవం ఉండాలి’ అంది సమైరా.ఇంటర్ అయిన వెంటనే సమైరా న్యూఢిల్లీలోని‘వినోద్ యాదవ్ ఏవియేషన్ అకాడెమీ’లో థియరీకి సంబంధించిన అవసరమైన కోర్సును పూర్తిచేసింది. ‘నా 18వ ఏట పూర్తయ్యే సమయానికి అవసరమైన 6 పరీక్షలను రాసి పాస్ అయ్యాను. అయితే రేడియో ట్రాన్స్మిషన్ టెక్నాలజీ పేపర్ రాయాలంటే 18 ఏళ్లు నిండాలని నియమం. అందుకని పద్దెనిమిది నిండాక ఆ పేపర్ రాసి పాసయ్యాను’ అని తెలిపింది సమైరా.బారామతిలో రెక్కలుథియరీ ఢిల్లీలో పూర్తి చేశాక విమానం నడిపే అనుభవం కోసం సమైరా మహారాష్ట్రలోని ‘కార్వార్ ఏవియేషన్ అకాడెమీ’లో చేరింది. ఆరునెలల్లో అక్కడ 200 గంటలపాటు విమానం ఎగరేసే అనుభవాన్ని సాధించింది. ‘నేను రాత్రిపూట విమానం నడపడంలోనూ మల్టీ ఇంజిన్ విమానాలు నడపడంలోనూ అనుభవం సాధించాను’ అని తెలిపింది సమైరా. ‘పైలట్లు నాకు ఎంతో సహకరించారు. వారి స్ఫూర్తితోనే 19వ ఏటలోకి అడుగు పెట్టకముందే కమర్షియల్ పైలట్‌గా అర్హత సాధించాను. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది’ అంది సమైరా.ఉత్తర కర్ణాటకకు స్ఫూర్తి‘ఉత్తర కర్ణాటకలో అమ్మాయిలు చదువులో వెనుకబడి ఉన్నారు. బీజాపూర్ నుంచి సమైరా అందరూ చదివి చదువు లాంటిది కాకుండా పైలట్ చదువు చదవాలనుకోవడం అతి తక్కువ వయసులో ఆ ఘనత సాధించడంతో మేమందరం చాలా సంతోషిస్తున్నాం. ఉత్తర కర్ణాటకలోని అమ్మాయిలను ఈ విషయం ఎంత ఉత్సాహపరుస్తుందో మీరు ఊహించలేరు. అమ్మాయిలు చదవాలనుకుంటే, తల్లిదండ్రులు వారినిప్రాంపోత్సహిస్తే ఫలితాలు ఇంత గొప్పగా ఉంటాయి’ అని ఆప్రాంపాంతానికి చెందిన అక్క మహాదేవి విశ్వవిద్యాలయం జర్నలిజం ఫ్రొఫెసర్ కార్కరే అన్నారు.సమైరా భుజాన రెక్కలతో రివ్వున దూసుకుపోతుంది. ఆ తార ఎందరికో ఇకపై దారి చూపనుంది. గెలుపు గాథలకు ఏ మూల ఏ ఇంట్లో మొదటి అడుగు పడుతుందో కదా. -
ప్రపంచం చుట్టేశాడు.. రెండు గిన్నిస్ రికార్డులు పట్టేశాడు
మాక్ రూథర్‌ఫర్డ్. వయసు 17 ఏళ్లు. బెల్జియం–బ్రిటిష్.. రెండు పౌరసత్వాలు ఉన్నాయి. చిన్న వయసులోనే రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించాడు. చిన్న విమానంలో ఒంటరిగా ప్రపంచమంతా చుట్టేశాడు. ఐదు నెలల క్రితం మొదలైన ఈ ప్రయాణం బుధవారం బల్గేరియా రాజధాని సోఫియాలోని ఎయిర్‌స్ట్రిప్‌లో ముగిసింది. ఎవరూ తోడులేకుండా భూగోళాన్ని చుట్టిన అత్యంత పిన్నవయస్కుడిగా, మైక్రోలైట్ ప్లేన్‌లో ప్రపంచమంతా తిరిగి అత్యంత పిన్నవయస్కుడిగా రెండు రికార్డులు రూథర్‌ఫర్డ్ పరమయ్యాయి. ఇదీ చదవండి: ఇదేం సరదా.. అడిగి మరీ అరెస్టయింది! -
అదిగో ఆయేషా అజీజ్!
కొన్నింటిని అతిశయోక్తిగా చెప్పకపోతే, చెప్పడం మానడమే మేలు! అకాశంలో ఎగురుతున్న పక్షుల్ని చూస్తే తమక్కూడా రెక్కలు ఉంటే బాగుండుననుకుంటారు పిల్లలెవరైనా. శ్రీనగర్‌లోని ఆడపిల్లలు మాత్రం ఆయేషా అజీజ్ గురించి వినగానే పక్షులైపోయి ఆకాశంలో విహరిస్తారు! ఆయేషా కమర్షియల్ పైలట్. దేశంలోనే అతి చిన్న వయసులో పైలట్ అయిన అమ్మాయి! పదిహేనేళ్ల వయసుకే ఆమెకు పైలట్ లైసెన్స్ వచ్చింది. ఇప్పుడు ఆమె వయసు ఇరవై ఐదు. భారతదేశ ప్రసిద్ధ వార్తా సంస్థ ఎ.ఎన్.ఐ. (ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్) ఆయేషా పదేళ్ల పైలట్ జర్నీ గురించి ఇంటర్వ్యూ చేయడంతో తాజాగా ఆమె వార్తల్లోకి వచ్చారు. ఆయేషా అజీజ్ పేరు మొదటిసారి 2011 లో దేశానికి తెలిసింది. అది ఆమె పైలట్ లైసెన్స్ సాధించిన సంవత్సరం. శిక్షణ కోసం లైసెన్స్ అది. శిక్షణ రష్యాలోని సొకోల్ వైమానిక స్థావరంలో! ప్రారంభంలోనే ఎం.ఐ.జి.–29 జెట్‌ను నడపడం నేర్చుకున్నారు ఆయేషా. ఆ తర్వాత ఆమె సాధించవలసింది కమర్షియల్ లైసెన్స్. బాంబే ఫ్లయింగ్ క్లబ్లో చేరి విమానయానంలో డిగ్రీ సాధించాక ఆ లైసెన్స్ కూడా వచ్చేసింది. అది 2017లో. 2011లో లైసెన్స్ పొందాక తన ఈ పదేళ్ల ప్రస్థానం గురించి ఎ.ఎన్.ఐ. తో మాట్లాడుతున్నప్పుడు ఆయేషా తన గురించి కాక, కశ్మీర్లో ఇప్పుడు చక్కగా చదువుకుని పైకొస్తున్న ఆడపిల్లల గురించే ఎక్కువగా ప్రస్తావించారు. ‘వాళ్లలో పైలట్ అవాలనుకున్న అమ్మాయిలకు మీరే ఇన్స్పిరేషన్ అయుండొచ్చు కదా..’ అన్న మాటకు, ‘కావచ్చేమో!’ అని నవ్వారు ఆయేషా. పైలట్ గా ఆమె తన కెరీర్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు కూడా చెప్పారు. ‘‘ఎందుకంటే నాకు 9–5 ఉద్యోగం పడదు. నాకే కాదు.. అసలు ఏ అమ్మాయికీ అలాంటి ఉద్యోగం ఇష్టం ఉండదు. అవకాశం ఉండాలే కానీ, ఖండాలన్నీ తిరగాలనుకుంటుంది. అంతుకు తల్లిదండ్రులే లాంచింగ్ స్టెప్ అవాలి..’’ అంటారు ఆయేషా. ∙∙ ఆయేషాకు ఆకాశంలో ఎగరాలని మరీ చిన్న వయసులోనే మనసులో పడిపోయింది. వందల మంది ప్రయాణీకులను సురక్షితంగా గమ్యం చేర్చే ఉద్యోగం ఎంత థ్రిల్‌గా చెప్పడానికే ఆమె ఏ సమయంలోనైనా ఉత్సాహం చూపుతారు. తల్లిదండ్రులిద్దరూ రెండు చేతులతో భద్రంగా పైకి ఎగరేసిన పైలట్ పావురం ఆయేషా. వారు పెద్ద సపోర్ట్ ఆమె కెరీర్‌కు. ‘యంగెస్ట్ స్టూడెంట్ పైలట్’ అనే రికార్డు కూడా ఇప్పటికీ ఆమె పేరు మీదే ఉంది. ఆయేషా పుట్టింది కశ్మీర్లో. పెరిగింది ముంబైలోని వర్లీలో. తల్లితో కలిసి ముంబై నుంచి అమ్మమ్మ వాళ్లుండే జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాకు తరచు విమానంలో వెళ్లివస్తుండంతో తనూ విమానాన్ని నడపాలని అనుకుంది ఆయేషా! ఆ మాటే అమ్మానాన్నకు చెబితే.. ‘తప్పకుండా.. అయితే అందుకు కష్టపడి చదవాల్సి ఉంటుంది’ అని చెప్పారు. టెన్త్ పూర్తి చేయగానే ఆమె ఆశకు పైలట్ కోర్సుతో రెక్కలు కట్టారు. పైలట్ అయ్యాక తొలిసారి అమ్మానాన్న ఉన్న విమానాన్ని నడపడం ఆయేషా జీవితంలోని మరపురాని అపురూప ఘటన. ఇక తల్లిదండ్రులు గర్వ పడకుండా ఉంటారా.. కూతురు కూర్చోబెట్టి తమను, ఇంకా మరికొంతమందిని గాల్లో తేలియాడిస్తుంటే! బాంబే ఫ్లయింగ్ క్లబ్లో లైసెన్స్ సాధించాక 2012లో ‘నాసా’లో కూడా రెండు నెలల ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు ఆయేషా! అక్కడ ఆమెకు జాన్ మెక్‌బ్రైడ్ అనే నాసా రిటైర్డ్ వ్యోమగామి పరిచయం అయ్యారు. స్పేస్ షటిల్ మిషన్, మైక్రో గ్రావిటీ, మాన్డ్ మానోవరింగ్ (విన్యాసాలు), మల్టీ యాక్సిస్ ట్రైనింగ్, ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ.. వీటన్నిటిలో మెక్‌బ్రైడ్ ఆమెకు మెళకువలు నేర్పారు. ∙∙ జాన్ మెక్‌బ్రైడ్ తర్వాత ఆమెలో పూర్తి స్థాయి స్ఫూర్తిని నింపినవారు నాసాలోని భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్. స్వయంగా వెళ్లి సునీతను కలుసుకున్నారు ఆయేషా. నీటిలో స్కూబా డైవింగ్, నింగిలో మూన్ వాక్‌లలో తన అనుభవాలను ఆయేషాతో పంచుకుని ఆమె కలలకు ఇంధనాన్ని నింపారు సునీత. 1960లో ప్రైవేట్ పైలట్ లైసెన్స్‌తో ప్రయాణీకుల విమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళా పైలట్ రబియా ఫతే అలీ దగ్గర కూడా ఆయేషా ఆసక్తి కొద్దీ మరికొన్ని నైపుణ్యాలు నేర్చుకున్నారు. పైలట్ శిక్షణ లైసెన్స్ సంపాదించాక 2012లో శిక్షణలో భాగంగా తొలిసారి ఎం.ఐ.జి జెట్‌ను నడిపినప్పుడు ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేనని అంటారు ఆయేషా. ఆనాటి చిన్న పిల్ల ఇప్పుడు ‘ఇండియన్ ఉమెన్ పైలట్స్ అసోసియేషన్’ లో ప్రతిష్టాత్మక సభ్యురాలు. అయితే స్టూడెంట్ పైలట్‌గా, పైలట్‌గా, అసోసియేషన్ సభ్యురాలిగా ఘనమైన గుర్తింపు కలిగి ఉన్న ఆయేషాకూ కొన్ని ఒత్తిడిలు తప్పలేదు. సంప్రదాయ శిరోవస్త్రాన్ని (హిజబ్) ఎందుకు ధరించరనే ప్రశ్నను ఆమె ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు! అందుకు ఆమె దగ్గర సమాధానం కూడా ఉంది. ‘‘ప్రవక్త భార్య హజ్రత్ ఆయేషా యుద్ధంలో ఒంటెను స్వారీ చేయించగా లేనిది, నేను విమానాన్ని నడిపేందుకు సంప్రదాయాలు ఎందుకు అడ్డపడాలి?’’ అంటారు ఆయేషా. 2018 జనవరిలో ఢిల్లీలోని రాజ్‌భవన్‌లో ఆర్మీ చీఫ్, రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ఫస్ట్ లేడీస్’ టైటిల్‌ను అందుకున్న ఆయేషా.. పైలట్లు కావాలన్న ఉత్సాహం ఉండీ, ఆర్థికంగా వెలుసుబాటు లేని అమ్మాయిల్ని పైలట్లుగా ప్రోత్సహించేందుకు ఇండియన్ ఉమెన్ పైలట్స్ అసోసియేషన్ తరఫున కృషి చేస్తున్నారు. -
14 ఏళ్లకే పైలెట్ అయిన భారత సంతతి బాలుడు
దుబాయి: భారతీయ సంతతికి చెందిన యూఏఈ బాలుడు అరుదైన రికార్డు సృష్టించాడు. 14 ఏళ్లవయస్సులోనే సింగిల్ ఇంజిన్ విమానాన్ని నడిపిన పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. షార్జాలోని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న మన్సూర్ అనిస్(14)కి చిన్నప్పటి నుంచే పైలెట్ కావాలని కోరిక ఉండేది. దాన్ని సాధించేందుకు గాను కెనడాకు చెందిన ఏవియేషన్ అకాడెమీలో చేరాడు. సింగిల్ ఇంజిన్ సెస్నా-152 రకం విమానాన్ని పది నిమిషాల పాటు ఒక్కడే ఒంటరిగా నడిపి, ఏవియేషన్ సంస్థ నుంచి స్టూడెంట్ పైలెట్ ధ్రువీకరణ పత్రాన్ని పొందాడు. ఇందుకు సంబంధించి ఆగస్టు 30వ తేదీన కెనడా ఏవియేషన్ విభాగం నిర్వహించిన వివిధ పరీక్షల్లో 90శాతం స్కోరు సాధించాడు. అతి తక్కువ శిక్షణ సమయంలోనే పైలెట్‌గా అర్హత సాధించిన పిన్న వయస్కుడిగా కూడా మన్సూర్ రికార్డు నెలకొల్పాడని అతడి తండ్రి అలీ అస్గర్ అనిస్ తెలిపారు. వేసవి సెలవుల్లో తల్లితోపాటు మన్సూర్ కెనడా వెళ్లి విమాన పైలెట్ శిక్షణ పొందాడని అలీ తెలిపారు. తన సోదరుడు క్వాయిద్ ఫైజీ ఇండియాలో జెట్ ఎయిర్వేస్లో పైలెట్‌గా పనిచేస్తున్నాడని, అతని స్ఫూర్తితోనే మన్సూర్ పైలెట్ శిక్షణ పొందాడని మునీరా తెలిపారు. మన్సూర్ తండ్రి అలీ షార్జాలో అలీ సివిల్ ఇంజినీర్ కాగా, తల్లి మునీరా కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేస్తున్నారు. కాగా, భారత్, దుబాయిలలో పైలెట్ అర్హత వయస్సు 18 ఏళ్లు కాగా, కెనడాలో 14 ఏళ్లకే పైలెట్ శిక్షణ పొందే అవకాశం ఉంది. -
పిల్ల పైలట్!
విమానం గాల్లో ఎగురుతుంటే చిన్నపిల్లలను దాన్ని సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంటారు. హుషారుగా కేరింతలు కొడతారు. ఆకాశంలో అంతెత్తున దూసుకుపోయే విమానాలను పెద్దలు కూడా ఆసక్తిగా తిలకిస్తుంటారు. గగనతలంలో సైనికులు చేసే విన్యాసాలు సామాన్య జనానికి అమితాశ్చర్యం కలిగిస్తుంటాయి. హెలికాప్టర్లు, యుద్ధవిమానాలను అవలీలగా నడిపేస్తూ ఆకాశంలో చేసే సాహసకృత్యాలు అచ్చెరువొందిస్తాయి. విమానం నడపడం కష్టంతో కూడుకున్నదే కాకుండా ఖర్చుతో కూడుకున్నది కూడా. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తెగువ మెండుగా ఉన్నవాళ్లే పైలట్లు కాగలగుతారు. అయితే చైనాలో ఓ బుడతుడు ఐదేళ్ల చిరు ప్రాయంలోనే విమానం నడిపి ఔరా అనిపించాడు. 35 నిమిషాల పాటు ఏకధాటిగా విమానాన్ని నడిపి గిన్నీస్ బుక్‌లో చోటుసంపాదించాడు. యంగెస్ట్ పైలట్‌గా రికార్డు కెక్కాడు. అత్యంత పిన్నవయసులో ఫైలట్‌గా పేరొందిన ఈ చిచ్చరపిడుగు పేరు హి యైడి. ముద్దు పేరు డ్యూడ్యూ. బీజింగ్ వెల్డ్‌లైఫ్ పార్క్‌లో ఆగస్టు 31న ఆల్ట్రాలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను 35 నిమిషాల పాటు నడిపి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 30 కిలోమీటర్ల పరిధిలో విమానంలో డ్యూడ్యూ చక్కర్లు కొట్టాడని అతడికి పైలట్ శిక్షణనిచ్చిన ఏవియేషన్ క్లబ్ ఇన్చార్జి జాంగ్ యంగ్ హు వెల్లడించాడు. తన కొడుకు ఆసక్తిని, ఉత్సుకతను ప్రోత్సహించానని, ధైర్యవంతుడైన పైలట్‌గా చూడాలనుకున్నానని డ్యూడ్యూ తండ్రి హి లీషెంగ్ గర్వంగా చెప్పాడు. సాహస కార్యాలు చేయడం డ్యూడ్యూ కొత్తేం కాదు. గతేడాది న్యూయార్క్‌లో మైనస్ 13 డిగ్రీలు సెల్సియస్ మంచుపై హాఫ్ నిక్కర్‌తో నడిచాడు. ఇంటెర్నెట్లో ఈ వీడియోను వీక్షించినవారందరూ సంభ్రమాశ్చర్యాలను లోనయ్యారు. ఓ అంతర్జాతీయ పోటీలో భారీ నౌక నడిపాడు. మరోసారి జపాన్‌లో ఫ్యుజియామా పర్వతం నుంచి కిందికి దూకి తెగువ చూపాడు. అయితే ఇటువంటి సాహసాలు కొంత మంది పిల్లలకు మాత్రమే సాధ్యమని పుణులు అంటున్నారు. సాహస బాలలు సదా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వారికి ఏదైనా సమస్య ఎదురయితే అది వారిని జీవితాంతం వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు. పిల్లలపై దేన్ని బలవంతంగా రుద్దకూడదని సలహాయిస్తున్నారు. చిన్నారుల ఆసక్తిని గమనించి తగువిధంగా ప్రోత్సహిస్తే వారు తిరుగులేని విజయాలు సాధిస్తారనడానికి డ్యూడ్యూ సాహసకృత్యాలే నిదర్శనం.