14 ఏళ్లకే పైలెట్ అయిన భారత సంతతి బాలుడు
దుబాయి: భారతీయ సంతతికి చెందిన యూఏఈ బాలుడు అరుదైన రికార్డు సృష్టించాడు. 14 ఏళ్లవయస్సులోనే సింగిల్ ఇంజిన్ విమానాన్ని నడిపిన పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. షార్జాలోని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న మన్సూర్ అనిస్(14)కి చిన్నప్పటి నుంచే పైలెట్ కావాలని కోరిక ఉండేది. దాన్ని సాధించేందుకు గాను కెనడాకు చెందిన ఏవియేషన్ అకాడెమీలో చేరాడు. సింగిల్ ఇంజిన్ సెస్నా-152 రకం విమానాన్ని పది నిమిషాల పాటు ఒక్కడే ఒంటరిగా నడిపి, ఏవియేషన్ సంస్థ నుంచి స్టూడెంట్ పైలెట్ ధ్రువీకరణ పత్రాన్ని పొందాడు. ఇందుకు సంబంధించి ఆగస్టు 30వ తేదీన కెనడా ఏవియేషన్ విభాగం నిర్వహించిన వివిధ పరీక్షల్లో 90శాతం స్కోరు సాధించాడు.
అతి తక్కువ శిక్షణ సమయంలోనే పైలెట్‌గా అర్హత సాధించిన పిన్న వయస్కుడిగా కూడా మన్సూర్ రికార్డు నెలకొల్పాడని అతడి తండ్రి అలీ అస్గర్ అనిస్ తెలిపారు. వేసవి సెలవుల్లో తల్లితోపాటు మన్సూర్ కెనడా వెళ్లి విమాన పైలెట్ శిక్షణ పొందాడని అలీ తెలిపారు. తన సోదరుడు క్వాయిద్ ఫైజీ ఇండియాలో జెట్ ఎయిర్‌వేస్‌లో పైలెట్‌గా పనిచేస్తున్నాడని, అతని స్ఫూర్తితోనే మన్సూర్ పైలెట్ శిక్షణ పొందాడని మునీరా తెలిపారు. మన్సూర్ తండ్రి అలీ షార్జాలో అలీ సివిల్ ఇంజినీర్ కాగా, తల్లి మునీరా కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేస్తున్నారు. కాగా, భారత్, దుబాయిలలో పైలెట్ అర్హత వయస్సు 18 ఏళ్లు కాగా, కెనడాలో 14 ఏళ్లకే పైలెట్ శిక్షణ పొందే అవకాశం ఉంది.