పిల్ల పైలట్!
విమానం గాల్లో ఎగురుతుంటే చిన్నపిల్లలను దాన్ని సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంటారు. హుషారుగా కేరింతలు కొడతారు. ఆకాశంలో అంతెత్తున దూసుకుపోయే విమానాలను పెద్దలు కూడా ఆసక్తిగా తిలకిస్తుంటారు. గగనతలంలో సైనికులు చేసే విన్యాసాలు సామాన్య జనానికి అమితాశ్చర్యం కలిగిస్తుంటాయి. హెలికాప్టర్లు, యుద్ధవిమానాలను అవలీలగా నడిపేస్తూ ఆకాశంలో చేసే సాహసకృత్యాలు అచ్చెరువొందిస్తాయి.
విమానం నడపడం కష్టంతో కూడుకున్నదే కాకుండా ఖర్చుతో కూడుకున్నది కూడా. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తెగువ మెండుగా ఉన్నవాళ్లే పైలట్లు కాగలగుతారు. అయితే చైనాలో ఓ బుడతుడు ఐదేళ్ల చిరు ప్రాయంలోనే విమానం నడిపి ఔరా అనిపించాడు. 35 నిమిషాల పాటు ఏకధాటిగా విమానాన్ని నడిపి గిన్నీస్ బుక్లో చోటుసంపాదించాడు. యంగెస్ట్ పైలట్గా రికార్డు కెక్కాడు.
అత్యంత పిన్నవయసులో ఫైలట్గా పేరొందిన ఈ చిచ్చరపిడుగు పేరు హి యైడి. ముద్దు పేరు డ్యూడ్యూ. బీజింగ్ వెల్డ్లైఫ్ పార్క్లో ఆగస్టు 31న ఆల్ట్రాలైట్ ఎయిర్క్రాఫ్ట్ను 35 నిమిషాల పాటు నడిపి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 30 కిలోమీటర్ల పరిధిలో విమానంలో డ్యూడ్యూ చక్కర్లు కొట్టాడని అతడికి పైలట్ శిక్షణనిచ్చిన ఏవియేషన్ క్లబ్ ఇన్చార్జి జాంగ్ యంగ్ హు వెల్లడించాడు. తన కొడుకు ఆసక్తిని, ఉత్సుకతను ప్రోత్సహించానని, ధైర్యవంతుడైన పైలట్గా చూడాలనుకున్నానని డ్యూడ్యూ తండ్రి హి లీషెంగ్ గర్వంగా చెప్పాడు.
సాహస కార్యాలు చేయడం డ్యూడ్యూ కొత్తేం కాదు. గతేడాది న్యూయార్క్లో మైనస్ 13 డిగ్రీలు సెల్సియస్ మంచుపై హాఫ్ నిక్కర్తో నడిచాడు. ఇంటెర్నెట్లో ఈ వీడియోను వీక్షించినవారందరూ సంభ్రమాశ్చర్యాలను లోనయ్యారు. ఓ అంతర్జాతీయ పోటీలో భారీ నౌక నడిపాడు. మరోసారి జపాన్లో ఫ్యుజియామా పర్వతం నుంచి కిందికి దూకి తెగువ చూపాడు.
అయితే ఇటువంటి సాహసాలు కొంత మంది పిల్లలకు మాత్రమే సాధ్యమని పుణులు అంటున్నారు. సాహస బాలలు సదా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వారికి ఏదైనా సమస్య ఎదురయితే అది వారిని జీవితాంతం వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు. పిల్లలపై దేన్ని బలవంతంగా రుద్దకూడదని సలహాయిస్తున్నారు. చిన్నారుల ఆసక్తిని గమనించి తగువిధంగా ప్రోత్సహిస్తే వారు తిరుగులేని విజయాలు సాధిస్తారనడానికి డ్యూడ్యూ సాహసకృత్యాలే నిదర్శనం.