ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌ రాయిటర్స్‌కు తొలి మహిళ | Alessandra Galloni becomes first woman as Reuters editor-in-chief | Sakshi
Sakshi News home page

ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌ రాయిటర్స్‌కు తొలి మహిళ

Published Fri, Apr 16 2021 12:19 AM | Last Updated on Fri, Apr 16 2021 3:57 AM

Alessandra Galloni becomes first woman as Reuters editor-in-chief - Sakshi

రాయిటర్స్‌ కొత్త ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌ అలెస్సాండ్రా గలోనీ

వార్తా పత్రికల్లో అనేకమంది ఎడిటర్‌లు ఉంటారు. పత్రికా కార్యాలయంలో ఎన్ని ప్రత్యేకమైన వార్తా విభాగాలు ఉంటే అంతమంది ఎడిటర్‌లు. వాళ్లందరి పైనా మళ్లీ ఒక ఎడిటర్‌ ఉంటారు. వారే ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌. లేదా చీఫ్‌ ఎడిటర్‌. ‘రాయిటర్స్‌’.. ప్రపంచానికి ఎప్పటికప్పుడు వార్తల్ని, వార్తా కథనాల్ని అందిస్తూ వస్తున్న విశ్వసనీయ వార్తా సంస్థ. ఆ సంస్థకు ఇంతవరకు ఒక మహిళా చీఫ్‌ ఎడిటర్‌ లేనే లేరు. ఇప్పుడు తొలిసారి అలెస్సాండ్రా గలోనీ అనే మహిళ ఆ బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు! 170 ఏళ్ల చరిత్ర గల రాయిటర్స్‌ని ఈ నెల 19 నుంచి 47 ఏళ్ల వయసు గల గలోనీ నడిపించబోతున్నారు! మహామహులకు మాత్రమే దక్కే ఇంత పెద్ద అవకాశం చిన్న వయసులోనే ఆమె సాధించగలిగారు!

రాయిటర్స్‌ ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది. అక్కడ తన ‘ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌’ సీట్లో కూర్చొని దేశదేశాల్లోని 2,500 మంది సీనియర్‌ జర్నలిస్టులకు దిశానిర్దేశం చేయబోతున్నారు గలోని! రాయిటర్స్‌ న్యూస్‌ రూమ్‌ దాదాపుగా ఒక వార్‌ రూమ్‌. అక్కడ నిరంతరం తలపండిన పాత్రికేయుల సమాలోచనలు జరుగుతుంటాయి. వార్తని ‘ఛేదించడం’, ‘సాధించడం’ వారి ప్రధాన లక్ష్యాలు. వాళ్లందరికీ ఇక నుంచీ లీడర్‌.. గలోనీ. న్యూస్‌ రూమ్‌లో ప్రణాళికలను రూపొందిస్తూనే, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 ప్రాంతాలలో ఉన్న రిపోర్టర్‌లతో ఆమె ఎప్పుడూ అనుసంధానమై ఉండాలి. చిన్న పని కాదు. అలాగని పురుషులకే పరిమితమైన పని కాదని ఇప్పుడీ కొత్త నియామకంతో రాయిటర్స్‌ తేల్చి చెప్పింది. ఇప్పటికి వరకు ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌గా ఉన్న స్టీఫెన్‌ ఆల్డర్‌ వయసు 66.

రాయిటర్స్‌ గ్లోబల్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ హోదాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అలెస్సాండ్రా గలోనీ.

గత పదేళ్లుగా ఆయన న్యూస్‌ రూమ్‌కి సారథ్యం వహిస్తున్నారు. అనుభవజ్ఞుడు. ఆయన రిటైర్‌ అయితే తర్వాత ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు.. రాయిటర్స్‌లోనే ‘గ్లోబల్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌’గా ఉన్న గలోనీనే సరైన ఎంపికగా నిలిచారు! ఐదేళ్లుగా ఆ పదవిలో ఉన్న గలోనీదే న్యూస్‌ ప్లానింగ్‌ అంతా. 2015లో రాయిటర్స్‌లోకి రాకముందు వరకు మరొక ప్రఖ్యాత వార్తా సంస్థ ‘వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’లో 2013 నుంచీ దక్షిణ ఐరోపా బ్యూరో లో ఉన్నారు. ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌గా గత సోమవారం అనేక ఊహాగానాల మధ్య గలోనీ పేరును బహిర్గతం చేస్తూ.. ‘‘ఈ పదవికి తగిన వ్యక్తి కోసం లోపల, బయట విస్తృత పరిధిలో అనేకమంది అత్యంత యోగ్యులైన వారిని దృష్టిలో ఉంచుకున్న అనంతరం మా వెతుకులాట అలెస్సాడ్రా గలోని దగ్గర ఆగింది’’ అని రాయిటర్స్‌ ప్రెసిడెంట్‌ మైఖేల్‌ ఫ్రైడెన్‌బర్గ్‌ ప్రకటించారు.

గలోనీ రోమన్‌ మహిళ. నాలుగు భాషలు వచ్చు. బిజినెస్, పొలిటికల్‌ వార్తల్లో నిపుణురాలు. ప్రపంచ వాణిజ్య, రాజకీయ రంగాలలో ఏం జరగబోతోందీ, అవి ఎలాంటి మలుపులు తిరగబోతున్నదీ ముందే ఊహించగల అధ్యయనశీలి, అనుభవజ్ఞురాలు. ఆమె కెరీర్‌ ప్రారంభం అయింది కూడా రాయిటర్స్‌లోనే. ఇటాలియన్‌ లాంగ్వేజ్‌ న్యూస్‌ రిపోర్టర్‌గా చేరి, కొద్ది కాలంలోనే ‘ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌’గా ఎదిగారు! జర్నలిజంలో అత్యంత విశేష పురస్కారం అయిన ‘గెరాల్డ్‌ లోయెబ్‌ పౌండేషన్‌’ వారి 2020 మినార్డ్‌ ఎడిటర్‌ అవార్డు విజేత గలోనీనే! ఇంకా ఆమె ‘ఓవర్‌సీస్‌ ప్రెస్‌ క్లబ్‌ అవార్డు’, యు.కె. ‘బిజినెస్‌ జర్నలిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు’ల విజేత కూడా. గలోనీ హార్వర్డ్‌ యూనివర్సిటీలోని ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌’లో చదివారు. తన బాధ్యతల గురించి మాట్లాడుతూ ‘‘ప్రతిభ, అంకితభావం గల జర్నలిస్టులతో నిండి ఉండే ప్రపంచ స్థాయి న్యూస్‌ రూమ్‌ను నడిపించే వకాశం రావడం నాకు లభించిన గౌరవం’’ అని అన్నారు గలోనీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement