Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా! | Lok sabha elections 2024: Industrialist Pallavi Dempo becomes first woman to contest on BJP ticket in Goa | Sakshi
Sakshi News home page

Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!

Published Thu, May 2 2024 12:30 AM | Last Updated on Thu, May 2 2024 12:30 AM

Lok sabha elections 2024: Industrialist Pallavi Dempo becomes first woman to contest on BJP ticket in Goa

పల్లవి శ్రీనివాస్‌ డెంపో. దక్షిణ గోవా నుంచి బీజేపీ టికెట్‌పై లోక్‌సభ బరిలో ఉన్నారు. గోవాలో బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన తొలి మహిళగా నిలిచారు. అఫిడవిట్లో పల్లవి ప్రకటించిన ఆస్తులు చూసి అంతా నోరెళ్లబెట్టారు. 

భర్తతో కలిపి ఏకంగా రూ.1,361 కోట్ల ఆస్తులు వెల్లడించారు. మూడో దశలో రేసులో మొత్తం 1352 మంది అభ్యర్థుల్లో అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. గోవా ఎన్నికల చరిత్రలో అత్యంత సంపన్న వ్యక్తి పల్లవే. ఏ రాజకీయానుభవం లేని కుటుంబానికి చెందిన ఆమెను ఎంపిక చేసుకోవడానికి ఆమె దాతృత్వ నేపథ్యమే కారణం కావచ్చంటున్నారు...

దాతృత్వం నుంచి  రాజకీయాలకు 
49 ఏళ్ల పల్లవి స్వస్థలం గోవాలోని మార్గావ్‌. టింబ్లో కుటుంబంలో జని్మంచారు. రసాయన శాస్త్రంలో డిగ్రీ, పుణెలోని ఎంఐటీ నుంచి ఎంబీఏలో పీజీ చేశారు. 1997లో డెంపో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ డెంపోను పెళ్లాడారు. వారి కుటుంబం ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు. డెంపో గ్రూప్‌ మైనింగ్‌ వ్యాపారంతో మొదలుపెట్టి ఫుడ్‌ ప్రాసెసింగ్, షిప్‌ బిల్డింగ్, న్యూస్‌ పేపర్‌ పబ్లిíÙంగ్, పెట్రోలియం, కోక్, రియల్‌ ఎస్టేట్‌ తదితరాలకు విస్తరించింది.

 పల్లవి ప్రస్తుతం డెంపో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా మీడియా, రియల్‌ ఎస్టేట్‌ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. డెంపో చారిటీస్‌ ట్రస్టీగా దశాబ్దాలుగా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. ప్రత్యేకించి గోవాలో బాలికల విద్యను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. కొత్త ప్రదేశాలను చూడటం, కొత్త వంటకాలను ప్రయతి్నంచడం తన అభిరుచి అంటారామె. ఇప్పుడు రాజకీయాల్లోకి దిగి మరో ప్రయోగం చేయబోతున్నారు. 

ఎన్నికల బాండ్ల రగడ... 
2022 జనవరిలో గోవాలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నెల ముందు పల్లవి భర్త శ్రీనివాస్‌ వ్యక్తిగతంగా రూ.1.25 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసినట్లు వెల్లడవడం కలకలం రేపింది. ఇక గోవా కార్బన్‌ లిమిటెడ్, దేవశ్రీ నిర్మాణ్‌ ఎల్‌ఎల్‌పి, నవ్‌హింద్‌ పేపర్స్‌ అండ్‌ పబ్లికేషన్స్‌తో సహా డెంపో, గ్రూప్‌ అనుబంధ సంస్థలు 2019 నుంచి 2024 మధ్య రూ.1.1 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేశాయి. ఇవన్నీ బీజేపీ ఖాతాలోకే వెళ్లాయి.

బీజేపీ సిద్ధాంతాలు నమ్మి... 
దక్షిణ గోవా కాంగ్రెస్‌ కంచుకోట. 2019లో ఈ స్థానాన్ని బీజేపీ కేవలం 9 వేల పై చిలుకు ఓట్ల తేడాతో చేజార్చుకుంది. ఈ సారి ఎలాగైనా ఇక్కడ నెగ్గి తీరాలని పట్టుదలగా ఉంది. క్యాథలిక్‌ క్రిస్టియన్ల ఓట్లపై పల్లవి ప్రధానంగా దృష్టి పెట్టారు. కాంగ్రెస్‌ కూడా నాలుగు సార్లు గెలిచిన సిట్టింగ్‌ ఎంపీ ఫ్రాన్సిస్కో సార్డినాను అనూహ్యంగా పక్కనబెట్టి మాజీ నేవీ అధికారి కెపె్టన్‌ విరియాటో ఫెర్నాండెజ్‌ను బరిలోకి దించింది. అయితే ఏకంగా 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్‌ చేయడం వంటివన్నీ ఆ పారీ్టకి కలిసొచ్చేలా ఉన్నాయి.

 ఆప్, గోవా ఫార్వర్డ్‌ పార్టీ (జీఎఫ్‌పీ) వంటి ఇండియా కూటమి భాగస్వాముల దన్నుతో బీజేపీని కాంగ్రెస్‌ ఢీకొంటోంది. స్థానిక రివల్యూషనరీ గోవన్స్‌ (ఆర్‌జీ) పార్టీ అభ్యర్థి రూబర్ట్‌ పెరీరియా ఆ రెండింటికీ సవాలు విసురుతున్నారు. అయినా పల్లవి మాత్రం విజయంపై ధీమాగా ఉన్నారు. ‘‘రాజకీయాలు నా మనసులో ఎప్పుడూ లేవు. మూడు దశాబ్దాలుగా కుటుంబ వ్యాపారాలు, సేవా కార్యకలాపాల్లో బిజీగా ఉన్నాను. అయితే దేనికైనా ఒక ఆరంభమంటూ ఉంటుంది. రాజకీయాల్లో ఇది నా తొలి అడుగు. బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మి ముందడుగు వేస్తున్నాను’’ అంటున్న ఆమె కాంగ్రెస్‌కు కంచుకోటలో చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి!  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement