
రెండేళ్ల క్రితం భయం లేకుండా న్యూయార్క్ స్టాక్ స్టాక్ ఎక్స్చేంజ్ లోకి తొలి మహిళా ఈక్విటీ ట్రేడర్‌గా అడుగుపెట్టిన లారెన్స్ సైమన్స్ (24) సాహస ఉద్యోగ జీవితంపై హాలీవుడ్ చిత్రం తయారవుతోంది. లారెన్స్ సైమన్స్ పాత్రను యువ నటి కియర్సీ క్లెమన్స్ గర్వాతిగర్వంగా పోషించబోతున్నారు.
ఇరవై రెండేళ్ల వయసులో వాల్‌స్ట్రీట్‌లోని ‘న్యూయార్క్ స్టాక్ స్టాక్ ఎక్స్చేంజ్’ గాజు గోడల్ని భళ్లున బద్దలు కొట్టుకుని లోనికి వచ్చిన లారెన్స్ సైమన్స్‌ని ‘ఎవరు బేబీ నువ్వు, ఎవరు కావాలి?’ అని అడిగాయి అక్కడ పండిన తలలు కొన్ని.. రెండేళ్ల క్రితం. ‘నాకు ఎవరో కావడం కాదు, నేనే మీకు కావాలి’ అన్నట్లు నవ్వింది సైమన్స్! ‘ఏం ధైర్యం ఈ పిల్లకు’ అని వాల్‌స్ట్రీట్ నివ్వెరపోయింది. ఫ్రెష్‌గా అప్పుడే డిగ్రీ పూర్తి చేసి, ‘ఈక్విటీల ట్రేడింగ్’ చెయ్యడానికి వచ్చానంటే.. అలవాటు లేని అరణ్యం లోకి వచ్చిన కుందేలు పిల్లను చూసినట్లే కదా ఉండేది. పైగా ఫుల్ టైమ్ జాబ్ చెయ్యడానికి వచ్చానంటోంది. అంతేనా! ‘రోజన్‌బ్లాట్ సెక్యూరిటీస్’ తరఫున వచ్చానంది.
రోజన్‌బ్లాట్ సీఈవో రిచర్డ్ రోజన్‌బ్లాట్. మొదట ఆయనా ఇలాగే ఆశ్చర్యపోయారు. ‘‘జెనెటిక్స్‌లో ఇంజనీరింగ్ చేశానంటున్నావ్. వాల్‌స్ట్రీట్‌కి ఎందుకొచ్చావ్?’’ అని అడిగారు. ‘‘ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించింది. న్యూయార్క్ ఫ్లయిట్ ఎక్కేశా. మీరు కనిపించారు’’ అంది. ‘‘మైక్రోసెకన్స్‌లో ఇక్కడ డెసిషన్స్ తీసుకోవాలి తెలుసా. ఎందుకొచ్చిన స్ట్రెస్. జార్జియా తిరిగి వెళ్లి నువ్వు చదివిన కెన్నసా యూనివర్సిటీ ల్యాబ్‌లోని మైక్రోస్కోపుల్లో పరిశోధనలు చేసుకో. ఈ పరుగులొద్దు’’ అని పితృవాత్సల్యంతో ఆయన సలహా ఇచ్చారు. ఆయనదీ పెద్ద వయసేం కాదు. యాభై. సైమన్స్‌తో పోలిస్తే పెద్దవాడే. ‘‘లేదు సర్. వెళ్లను’’ అంది. ‘‘సరే, నీ ఇష్టం.
అయితే నీకు ఇష్టమైంది కదా అని ‘ఈక్విటీ ట్రేడర్’ ఉద్యోగం ఊరికే వచ్చేయదు. ఇంటెర్న్‌గా ఉండాలి. అందుకోసం ‘సిరీస్ 19’ ఎగ్జామ్ రాయాలి. ఫ్లోర్ బ్రోకర్ బ్యాడ్జి రావడానికి అది మినిమం క్వాలిఫికేషన్’’ అని చెప్పారు రిచర్డ్స్. ‘‘రాస్తాను సర్’’ అంది. ‘‘రాస్తే కాదు. పాస్ అవ్వాలి. రాసిన వాళ్లలో 20 శాతం మంది కూడా పాస్ కారు’’అన్నారు ఆయన. సైమన్స్ నవ్వింది. సిరీస్ నైన్‌టీన్ ఎగ్జామ్ పాస్ అయ్యాక కూడా అలాగే నవ్వింది. ‘‘చూశారా పాస్ అయ్యాను’ అని ఆ నవ్వుకు అర్థం కాదు. ‘‘కష్టపడి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యాను సర్’’ అని చెప్పడం. వెంటనే జాబ్.
జాబ్‌లో చేరింది. మైక్రో సెకన్స్‌లో డిసిషన్స్ తీసుకుంటోంది! సీనియర్స్‌ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. వారి ప్రశంసలతో పాటు తనకో ముద్దుపేరును కూడా కొట్టేసింది. ‘లోన్ ఉమన్ ఆన్ వాల్ స్ట్రీట్’ అని! ఈక్విటీ ట్రేడర్‌గా ఇంతవరకు అక్కడ ఒక్క అమ్మాయి కూడా లేదు మరి. బాగుంది. ఇప్పుడెందుకు సైమన్స్ సీన్‌లోకి వచ్చింది. హాలీవుడ్ యువనటి కియర్సీ క్లెమన్స్ హీరోయిన్‌గా సైమన్స్ నిర్భయోగ్రఫీ ఓ సినిమా రాబోతోంది! సైమన్స్ ఇప్పుడక్కడ చెయ్యట్లేదు. ‘లోన్ ఉమన్ ఆన్ వాల్ స్ట్రీట్’ టైటిల్ ఇంకా అక్కడే ఉంది.. ఆమె పేరు మీద.
Comments
Please login to add a commentAdd a comment