
న్యాయవ్యవస్థపై రాష్ట్రపతి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశ న్యాయవ్యవస్థపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ క్రియాశీలత కారణంగా రాజ్యాంగం కల్పించిన అధికార వికేంద్రీకరణ నీరుగారిపోకూడదని పేర్కొన్నారు. మన ప్రజాస్వామ్యానికి చెందిన ప్రతి అంగం తనకు నిర్దేశించిన పరిధిలోనే పనిచేయాలి కానీ, ఇతర వ్యవస్థలకు కేటాయించిన వాటిలోకి చొరబడకూడదని చెప్పారు. జాతీయ న్యాయనియమకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పును ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సామాజికంగా, ఆర్థికంగా అట్టడుగున ఉన్న పౌరులకు సైతం న్యాయం అందాలని, ఇందుకు న్యాయవ్యవస్థ అందరికీ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు స్వర్ణోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ప్రసంగించారు. సహనం, జ్ఞానసముర్జన వంటి వాటి కారణంగానే భారత్ ఎంతోగానే సమృద్ధి సాధించిందని, మన బహుళత్వ లక్షణం ఎన్నో కాలపరీక్షలకు తట్టుకొని నిలబడిందని ఆయన చెప్పారు.