![Sakshi Editorial On Judicial system and Politics](/styles/webp/s3/article_images/2024/03/7/judge.jpg.webp?itok=46j-bvNd)
కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రాజ్యానికి మూలస్తంభాలు. ఇందులో న్యాయ వ్యవస్థ మిగిలిన రెండింటికంటే విశిష్టమైనది. ఎందుకంటే మొత్తం మూడు వ్యవస్థల పరిధులనూ, పరిమితులనూ నిర్ణయించగల, నిర్దేశించగల స్థానం ఆ ఒక్క వ్యవస్థకు మాత్రమే వుంది. ఇతర రెండు వ్యవస్థలతో పోలిస్తే ఇప్పటికీ న్యాయ వ్యవస్థపై ప్రజలకు కొద్దో గొప్పో విశ్వనీయత వుంది. దానికి విఘాతం కలిగించే పరిణామాలు అడపా దడపా చోటుచేసుకుంటున్న సంగతి కూడా కాదనలేనిది. 175 ఏళ్ల చరిత్ర కలిగిన కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి, ఆ పదవికి రాజీనామా ఇచ్చిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ వైనం అటువంటిదే.
తన రాజకీయ రంగ ప్రవేశంపై జస్టిస్ గంగోపాధ్యాయ ఇచ్చిన సంజాయిషీ ఆశ్చర్యం కలిగిస్తుంది. అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ తనను రోజూ దుమ్మెత్తిపోయటం, అసభ్య పదజాలంతో దూషించటం ఆయన తట్టుకోలేకపోయారట. కనుక నల్లకోటు, న్యాయదండం విడిచిపెట్టి ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకోవటమే ఆయనకు పరిష్కారంగా తోచింది! అలా అసభ్య పదజాలంతో దూషించే నేతలకు చదువు సక్రమంగా లేదన్న జస్టిస్ గంగోపాధ్యాయ విమర్శలో నిజం వుండొచ్చు. కానీ ఆయన చదువుసంధ్యలూ, విజ్ఞతా ఏమయ్యాయి? తాను వెలువరించే తీర్పులకు పూలు తప్ప రాళ్లు పడవని ఎలా అనుకున్నారు?
తృణమూల్ సర్కారుపై వచ్చిన అవినీతి ఆరోపణల విషయంలో జస్టిస్ గంగోపాధ్యాయ కఠినంగా వ్యవహరించారన్న పేరు వుంది. మొత్తం 14 ఉదంతాల్లో ఆయన సీబీఐ దర్యాప్తు జరపాలని ఆదేశించారు. అందులో ఉపాధ్యాయ నియామకాల కోసం పెద్దయెత్తున ముడుపులు చేతులు మారాయన్న స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్సెస్సీ) కేసు ప్రధానమైనది. ఆయన ఉత్తర్వుల కారణంగా 2022లో ఉన్నత విద్యాశాఖమంత్రిగా వున్న పార్థా ఛటర్జీతోపాటు దళారులు, డబ్బులిచ్చి ఉద్యో గాల్లోకొచ్చిన కొందరు టీచర్లు అరెస్టయ్యారు.
నిజానికి ఆ కేసులో జస్టిస్ గంగోపాధ్యాయ ఇచ్చిన ఆదేశాలు ఆయనకు పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. అవినీతిపై నిప్పులు కక్కే యోధుడిగా, సీఎం పదవికి అన్నివిధాలా అర్హతగల వ్యక్తిగా లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌధురి అప్పట్లో కీర్తించారు. వామపక్షాలు సైతం ఆయన తీర్పులను ప్రశంసించాయి. కానీ అవి జస్టిస్ గంగో పాధ్యాయ చెవికి సోకినట్టు లేదు. ‘న్యాయమూర్తులుగా తమ తీర్పులు నచ్చకపోతే విమర్శించవచ్చు, అప్పీల్‌కు పోవచ్చు. కానీ దూషిస్తారా?’ అని ఆయన ప్రశ్నించటం సబబే.
కానీ ఆయన చేయాల్సిందేమిటి? దూషణలకు జవాబుగా ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకోవటమా? ఇందువల్ల ఆయనకుగానీ, మొత్తంగా వ్యవస్థకుగానీ విశ్వసనీయత పెరుగుతుందా? నిరుడు జస్టిస్ గంగో పాధ్యాయ తృణమూల్‌ను విమర్శిస్తూ స్థానిక చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దాన్ని తీవ్రంగా తప్పుబట్టి మందలించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
న్యాయమూర్తి పదవిలో వుంటూ రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేయటం జస్టిస్ గంగోపాధ్యాయతోనే మొదలు కాలేదు. 1967లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ కోకా సుబ్బారావుతోపాటు జస్టిస్ రంగనాథ్ మిశ్రా, జస్టిస్ బహరూల్ ఇస్లాం, జస్టిస్ ఫాతిమా, జస్టిస్ సదాశివం, జస్టిస్ రంజన్ గొగోయ్ వరకూ ఎందరో వున్నారు. జస్టిస్ బహరూల్ ఇస్లాం 1983లో అప్పటి బిహార్ పీసీసీ(ఐ) అధ్యక్షుడు జగన్నాథ్ మిశ్రాపై వచ్చిన ఫోర్జరీ, నేరపూరిత ప్రవర్తన ఆరోపణలనుంచి ఆయన్ను విముక్తి చేసిన నెల రోజులకే అస్సాంలో ఎంపీగా పోటీచేసే అవకాశం వచ్చింది.
ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. రిటైర్మెంట్ అనంతరం లా కమిషన్, మానవహక్కుల సంఘం, కంపెనీ లా బోర్డు, వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ వంటి సంస్థలకు నేతృత్వం వహించే అవకాశం ఎటూ వుంటుంది. అది కూడా సరికాదని అభ్యంతరం చెప్పేవారున్నారు. రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించటం, అంతకు వారంరోజుల ముందు ఆ పార్టీ నేతలను సంప్రదించినట్టు చెప్పటం జస్టిస్ గంగోపాధ్యాయ విజ్ఞతపై సందేహాలు రేకెత్తిస్తుంది.
ఈ వారంరోజుల్లో కేసులేమీ చూడలేదన్నంత మాత్రాన ఈ సందేహాలు సమసిపోవు. మిమ్మల్ని ముందుగా బీజేపీ నేతలే సంప్రదించారా అన్న ప్రశ్నకు ఆయన లౌక్యంగా ‘మేమిద్దరం ఒకరినొకరం సంప్రదించుకున్నాం’ అని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ నీతివంతమైన పాలన గురించి ఎవరికీ భ్రమల్లేవు. నాలుగైదేళ్ల క్రితం ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే తమ పార్టీలో అవినీతి నేతలు మితిమీరుతున్నారనీ, వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వుంటుందనీ హెచ్చరించిన సంగతి అందరికీ గుర్తుంది. ఇలాంటి పరిస్థితి వున్నది గనుకే జస్టిస్ గంగోపాధ్యాయ వెలువరించిన తీర్పులను అనేకులు ప్రశంసించారు. తన రాజకీయ రంగ ప్రవేశ నిర్ణయంతో ఆ తీర్పులపై సందేహాలు తలెత్తటానికి ఆయనే కార కులయ్యారు.
బీజేపీ నేతలు స్వర్గీయ అరుణ్ జైట్లీ, ప్రస్తుత కేంద్రమంత్రి నితీన్ గడ్కరి వంటివారు పదవీ విరమణ తర్వాత జడ్జీలు ఏ పదవీ తీసుకోరాదని అభిప్రాయపడ్డారు. అసలు సీవీసీ పదవికున్నట్టే జడ్జీలకు సైతం రిటైరయ్యాక పదవులు చేపట్టరాదన్న ఆంక్షలుండాలని చాలామంది చెబుతారు. అలా కాకపోయినా కనీసం రెండేళ్లపాటు ఏ పదవీ తీసుకోకుండా వుండటం శ్రేయస్కరం. రాజకీయాలకు అతీతంగా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగల స్థితిలో వుందనే సంకేతం మన దేశ గౌరవాన్ని మరింత పెంచుతుందని అందరూ గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment