
రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు: సీఎం
మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి హైకోర్టు సహకారం కోరుతాం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు కాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. న్యాయ వ్యవస్థ సంస్కరణలపై ఆదివారం ఇక్కడి విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. సమావేశం వివరాలను విలేకరులకు వివరిస్తూ.. రాష్ట్రంలో హైకోర్టును విభిన్నంగా నిర్మించే యోచన చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. కోర్టులలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించే విషయాన్ని ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. ఈసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టులలోని ఒక్కో సమస్యపై విపులంగా చర్చించి విభిన్నంగా కార్యాచరణ రూపొందించారన్నారు.
ఏటా 10 శాతం ఖాళీలను భర్తీ చేసే విధంగా, కేసులు సత్వరంగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారని చంద్రబాబు తెలిపారు. పెండింగ్ కేసులన్నీ 5 ఏళ్ల లోపు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. న్యాయ వ్యవస్థ మొత్తాన్ని కంప్యూటరైజేషన్ చేయడం, వాణిజ్య కోర్టుల ఏర్పాటుపై కూడా చర్చ జరిగిందన్నారు. 79 కొత్త కోర్టులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, మహిళలపై నేరాలకు చెందిన కేసుల సత్వర పరిష్కారానికి 13 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ప్రత్యేక కోర్టులుగా మార్పు చేసామని చంద్రబాబు చెప్పారు. కోర్టుల బయట మధ్యవర్తిత్వం లేదా సఖ్యత ద్వారా ప్రత్యామ్నాయంగా వివాద పరిష్కారాల కోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు హైకోర్టు సహకారాన్ని కోరుతామని చెప్పారు.
బుద్ధ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించండి: ఏపీ భవన్ ఉద్యోగులు
ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఇంతకుముందు ఉన్న రీతిలో బుద్ధ విగ్రహాన్ని, అమరావతి స్థూపాన్ని తిరిగి ప్రతిష్టించాలని కోరుతూ ఏపీ భవన్ ఉద్యోగులు సీఎంకు విన్నవించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయాలని కోరినట్టు ఉద్యోగ సంఘాల నేత బాలకోటేశ్వరరావు తెలిపారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు గెయిల్ విరాళం
కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు గెయిల్ సంస్థ రూ. 10 కోట్ల విరాళం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన చెక్‌ను ఏపీ భవన్‌లో సీఎం చంద్రబాబుకు సంస్థ చైర్మన్ బి.సి.త్రిపాఠి అందించారు.