నిత్య జీవనంలో న్యాయపరమైన సమస్య ఏదైనా వస్తే తమ దగ్గరి వాళ్లకి చెప్పుకొని, ఉపశమనం పొందుతుంటారు. అన్యాయం చేసినవారిని తిట్టుకుంటూ విలువైన సమయాన్ని, డబ్బును పోగొట్టుకుంటుంటారు. కానీ, న్యాయవ్యవస్థను సంప్రదించాలంటే మాత్రం భయపడతారు. లాయర్లకు బోలెడంత డబ్బు ఫీజుగా ఇచ్చుకోలేమనో, కోర్టు చుట్టూ తిరగలేమనో అనుకుంటారు. నేడు అంటే నవంబర్ 9న నేషనల్ లీగల్ సర్వీస్ డే. ఈ సందర్భంగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో ఉచితంగా న్యాయం పొందగలిగే విధానాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం అవసరం.
పూర్ణకు పెళ్లయ్యి ఏడాదిన్నర అవుతోంది. ఆర్నెల్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. తండ్రి కట్నంగా ఇస్తానన్న డబ్బు తీసుకునే ఇంటికి రావాలని అత్తింట్లో షరతు పెట్టారు, కూలి పనులు చేసే తండ్రి అంత డబ్బు ఇచ్చుకోలేడు. తనకు న్యాయం జరిగేదెలాగో పూర్ణకు తెలియడం లేదు.
నీతు ఇంజనీరింగ్ చదువుతోంది. నెల రోజులుగా తెలియని వారు తన గురించి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ మానసికంగా వేధిస్తున్నారు. ఇంట్లో పెద్దలకు చెబితే తననే తప్పు పడతారేమో, పోలీసులను సంప్రదిస్తే ఇంటి పరువు పోతుందేమో అని భయం. ఎవరి నుంచి ఎలాంటి సాయం తీసుకోవాలో అర్థం కావడం లేదు.
‘ప్రతి మనిషికి న్యాయపరమైన అవసరం ప్రతి దశలోనూ ఉంటుంది. అందుకు ముందుగా పోలీసులు సంప్రదించలేకపోవచ్చు. కానీ, న్యాయపరమైన సలహా తీసుకుంటే మాత్రం సరైన పరిష్కారం లభిస్తుంది’ అంటారు అడ్వకేట్ రాజేశ్వరి. ‘పెద్ద పెద్ద నేరాలు జరిగితే తప్ప అలాంటి చోటుకి మనకేం పని అన్నట్టుగా చాలా మంది ఆలోచిస్తారు. అంతేకాదు, న్యాయం పొందాలంటే చేతిలో దండిగా డబ్బు ఉండాలని కూడా భావిస్తారు. అయితే అవన్నీ పొరపాటు భావనలేనని, ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్‌కి వెళ్లినట్టే ఏదైనా న్యాయపరమైన అవసరం ఏర్పడితే లీగల్ సర్వీస్ సెల్‌ని సంప్రదించవచ్చు’ అనేది న్యాయ నిపుణుల మాట.
ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టడానికి అన్ని అర్హతలు ఉండి, బ్యాంకు లోన్‌కు నిరాకరించినా అందుకు తగిన న్యాయ సలహా తీసుకోవడం అవసరం. వినియోగదారుడు ఏదైనా వస్తువును కొని మోసపోయినా అందుకు సంబంధించిన న్యాయం పొందడానికి అవగాహన తప్పనిసరి. గ్రామాల్లో పది మంది మహిళా సంఘ సభ్యులు కలిసి ఏదైనా కార్యక్రమం చేపట్టాలన్నా న్యాయపరమైన అవసరం ఉంటుంది. మన నిత్యజీవితంలో ప్రతి చిన్న విషయానికి ‘న్యాయం’అవసరం గుర్తించాలి. అంతేకాదు ప్రతీ చిన్న విషయానికి డబ్బు చెల్లిస్తేనే న్యాయం పొందుతామనే ఆలోచనను దూరం పెట్టాలి.
సరైన పరిష్కారానికి..
సమస్య వచ్చినప్పుడు స్థానికంగా మండల లేదా జిల్లా లేదా రాష్ట్ర స్థాయిల్లో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదించి, సలహా తీసుకోవచ్చు. లీగల్ సర్వీస్ అథారిటీ ప్యానెల్‌లో సివిల్, క్రిమినల్.. ఇలా ఒక్కో విభాగానికి ఒక్కో లాయర్ ఉంటారు. రాష్ట్రస్థాయి లీగల్ ప్యానెల్‌లో హైకోర్టు జడ్జి కూడా ఉంటారు. వీరిలో ఎవరిని సంప్రదించినా పరిష్కారం ఎక్కడ లభిస్తుందో అందుకు సంబంధించిన సమాచారం తప్పక తెలుస్తుంది. ఏ కేసులు ఎంత వరకు పరిష్కారం అవుతున్నాయనే విషయంలోనూ ఈ సెల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. వీటితోపాటు మధ్యవర్తిగా సమస్యలను పరిష్కరించే లోక్ అదాలత్ అనే మీడియేషన్ టెక్నిక్ కూడా అందుబాటులో ఉంది.
మహిళలు.. పిల్లలు
అత్యాచారం, కిడ్నాప్, వరకట్న వేధింపులు, మానసిక–శారీరక హింస, లైంగిక వేధింపులు మొదలైన వాటి నుంచి మహిళలు న్యాయ పొందడానికి లీగల్ సర్వీస్ సెల్‌ను ఆశ్రయించవచ్చు. అంతేకాదు సైబర్ బుల్లీయింగ్, మహిళా సాధికారతకు అవరోధం కలిగించే అంశాలేవైనా న్యాయపరమైన సలహా తీసుకోవచ్చు.
కాలేజీలు.. పాఠశాలలు
ఇటీవల యువతలో బాగా వినిపిస్తున్న మాట మాదకద్రవ్యాల వినియోగం. కాలేజీల్లో లీగల్ అడ్వైజ్ సెషన్స్ ఏర్పాటు చేయడానికి యాజమాన్యాలు ముందుకు రావాలి. లీగల్ సర్వీస్ అథారిటీ కూడా లీగల్ అవేర్‌నెస్ కార్యక్రమాలను చేపడుతుంది. వీటికి హాజరై అందుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
పారా లీగల్ వాలెంటీర్లు
వీళ్లు పూర్తిస్థాయి లాయర్లు కాదు. న్యాయ సమాచారం తెలుసుకుని, జనాలకు స్వచ్ఛందంగా అందిస్తుంటారు. జనాల మధ్యన తిరుగుతూ, ఎవరికైనా న్యాయపరమైన సాయం చేసేవారుంటారు. ఎవరైనా ఆసక్తి గలవారు ‘న్యాయం’ కు సంబంధించిన సమాచారం తెలుసుకొని, ప్రజలకు స్వచ్ఛందంగా అవగాహన కలిగించవచ్చు. ఇది కూడా సామాజిక సేవలో భాగమే అవుతుంది.
– నిర్మలారెడ్డి
ఉచితంగా న్యాయ సేవ
పేద పౌరుల కేటగిరీ కిందకు వచ్చే ప్రతి ఒక్కరూ ఉచిత న్యాయ సేవలను అందుకోవడానికి అర్హులు. 9–9–1995 నుంచి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 అమల్లోకి వచ్చింది. ఇందులో అర్హులైన వ్యక్తులు తమ తరపున కేసులను దాఖలు చేయడానికి లేదా ఏదైనా కోర్టులో తమకు వ్యతిరేకంగా దాఖలైన కేసులలో తమను తాము రక్షించుకోవడానికి న్యాయ సేవలను ఉచితంగా పొందవచ్చు. ఉచిత న్యాయ సహాయం గురించి, దీనితోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీలు అందించే అనేక సేవలను ప్రజలకు తెలియజేయడానికి ప్రతియేటా ప్రచారాలు నిర్వహిస్తారు. చట్టపరమైన సహాయం కోరుకునే వ్యక్తి న్యాయ సేవల కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లోనూ సంప్రదించవచ్చు.
అవగాహన తప్పనిసరి
ఈ నవంబర్ నెల అంతా స్కూల్స్, కాలేజీల్లో న్యాయ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. చదువుకునే విద్యార్థులకు న్యాయవ్యవస్థకు సంబంధించిన ప్రాథమికాంశాల పట్ల అవగాహన ఉండాలనేది మా థీమ్. అమ్మాయిలకైతే శారీరక, మానసిక, లైంగిక హింసలు, గృహహింస, ఆస్తి హక్కుల గురించిన పూర్తి సమాచారం తెలిసుండాలి. వీటికి సంబంధించిన విషయాల మీద లీగల్ సర్వీస్ అథారిటీ కూడా మండల, గ్రామ, జిల్లా స్థాయిల్లోనూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుంటుంది.
– రాజేశ్వరి, అడ్వకేట్
Comments
Please login to add a commentAdd a comment