Legal service
-
హైదరాబాద్‌లో గెహిస్ లీగల్ సర్వీసెస్ ప్రారంభం
అమెరికాతో పాటు అంతర్జాతీయంగా ఇమ్మిగ్రేషన్ సర్వీస్ అందిస్తోన్న గెహిస్ ఇమ్మిగ్రేషన్ మరియు ఇంటర్నేషనల్ లీగల్ సర్వీసెస్.. నూతన బ్రాంచ్ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. సంస్థ ప్రిన్సిపల్, ఫౌండర్ నరేష్ ఎం గెహి, తెలంగాణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్,మోడల్ అండ్ సోషలైట్ సుధా జైన్ , తదితరులు ముఖ్యతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి.. గెహిస్ లీగల్ సర్వీసెస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలోని నాలెడ్జ్ పార్క్‌లో ఏర్పాటు చేసినట్లు ఎన్.ఎం గెహి తెలిపారు. అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లే వారికి ఎదురయ్యే ఇమిగ్రేషన్ సమస్యలతో పాటు అక్కడ నివసిస్తూ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డ వారికి తమ సంస్థ సేవలు అందిస్తుందని వివరించారు.భారత్, అమెరికా మధ్య అంతరాన్ని తగ్గించే ఈ ప్రయాణం గేహిస్ ఇమ్మిగ్రేషన్‌కు ముఖ్యమైన మైలురాయి అన్నారు. ఆవిష్కరణలు, అవకాశాలు అమెరికాకు అందించడంలో భారతదేశం ఎపుడు అగ్రగామిగా ఉంటుందన్నారు. ఇమ్మిగ్రేషన్, అంతర్జాతీయ న్యాయ సేవల కోసం డిమాండ్ పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో అవసరమైనా వారికి అందుబాటులో ఉండటానికి మరిన్ని ప్రదేశాలలో సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా నరేష్ ఎం గెహి పేర్కొన్నారు.గెహిస్ లీగల్ సర్వీసెస్ ముంబాయి తర్వాత రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం గర్వకారణమని అద్దంకి దయాకర్ అన్నారు. తెలుగువారు అత్యధికంగా అమెరికాలో నివసిస్తున్నారని, అలాంటివారికి అక్కడ తలెత్తే సమస్యలకు సరైన సలహాలు అందిస్తూ పరిష్కారాల కోసం పనిచేస్తున్న గెహిస్ సంస్థ సేవలను వినియోగించుకోవాలని కోరారు.(చదవండి: రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా వాచ్‌మ్యాన్) -
అన్నదాతకు అందుబాటులో ‘న్యాయం’
సాక్షి, హైదరాబాద్ /జనగామ: కార్మికులు, మహిళలు, బాలలు, ఖైదీలు.. ఇలా సమాజంలోని పలు వర్గాలకు న్యాయ సహాయం చేసే కేంద్రాలు దేశంలో చాలా ఏర్పాటయ్యాయి. కానీ తొలిసారిగా రైతులకు న్యాయ సహాయం అందించేందుకు కూడా ఓ కేంద్రం ఏర్పాటు కానుంది. బమ్మెర పోతన హలం పట్టిన నేల దేశ చరిత్రలో ఈ నూతన అధ్యాయానికి వేదికవుతోంది. పోతానామాత్యుడి స్వగ్రామమైన తెలంగాణలోని జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ‘అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్’మొదలవుతోంది. నల్సార్ విశ్వవిద్యాలయం, తెలంగాణ లీగల్ సర్విసెస్ అథారిటీ, లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఈ క్లినిక్ ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్ ఈ రైతు న్యాయ సేవా కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.నవీన్‌రావు, నల్సార్ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకృష్ణదేవరావులు పాల్గొననున్నారు. ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోన్న ఈ కేంద్రం ద్వారా రైతులకు మెరుగైన సేవలందించగలిగితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆలోచన మేరకు దేశ వ్యాప్తంగా ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు ఏర్పాటవుతాయని న్యాయ, భూచట్టాల నిపుణులు చెపుతున్నారు. అన్ని అంశాల్లో రైతుకు సహకారం దుక్కి దున్నేనాటి నుంచి తన పంటను మార్కెట్లో అమ్ముకునే వరకు రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించే విషయంలో అవసరమైన న్యాయ సాయం అందించడమే ధ్యేయంగా బమ్మెర గ్రామంలో ఈ ‘అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్’ఏర్పాటవుతోంది. భూ సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వల్ల నష్టం వాటిల్లిన సమయంలో, మార్కెట్లో మోసాలు చోటు చేసుకుంటే, పంటల బీమా అమలు కానప్పుడు.. ఇలా ప్రతి సందర్భంలోనూ రైతులకు అవసరమైన న్యాయ సాయాన్ని ఈ కేంద్రం ద్వారా అందించనున్నారు. న్యాయ సేవలను అందించడంతో పాటు రైతు, భూ చట్టాలపై అవగాహన కల్పి చడం, రైతులను చైతన్యపర్చడం లాంటి కార్యక్రమాలను కూడా ఈ కేంద్రాల ద్వారా నిర్వహించనున్నారు. గ్రామంలోని రైతులకు వ్యవసాయ సలహాలు, న్యాయ సాయం ఉచితంగా అందించనున్నారు. ఇందుకోసం పారా లీగల్ కార్యకర్త అందుబాటులో ఉంటారు. రైతుల సమస్యలను నమోదు చేసుకునే ఈ కార్యకర్త సదరు వివరాలను నల్సార్, లీగల్ సర్విసెస్ అథారిటీ, లీఫ్స్ సంస్థలకు పంపనున్నారు. నల్సార్ విద్యార్థులు వాటిని పరిశీలించి సహాయాన్ని అందిస్తారు. రాష్ట్రంలోని 25 న్యాయ కళాశాలలకు చెందిన విద్యార్థులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసే ప్రయత్నం జరుగుతోంది. దీంతో పాటు రైతులకు చట్టాలపై అవగాహన కల్పి చేందుకు గాను క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. గత 17–18 ఏళ్లుగా భూ సమస్యలపై పనిచేస్తోన్న లీఫ్స్ సంస్థ మరికొంత వ్యవసాయ చట్టాల అమలుపై గ్రామీణ స్థాయిలో పనిచేయనుంది. రైతులకు న్యాయ సేవల దిశగా మొదటి ప్రయత్నం రైతులకు చట్టాలతో అవసరం పెరిగింది. కానీ వారి అవసరాలు తీర్చే స్థాయిలో సౌకర్యాలు పెరగలేదు. న్యాయ సేవలూ అందుబాటులో లేవు. అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ మొదటి ప్రయత్నం. ఇది విజయవంతం అయితే బమ్మెరే కాదు దేశమంతటా ఇలాంటి సేవలు అందించే బ్లూప్రింట్ తయారవుతుంది. – లీఫ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు, భూచట్టాల నిపుణుడు సునీల్‌కుమార్ -
సముచిత న్యాయానికి...
నిత్య జీవనంలో న్యాయపరమైన సమస్య ఏదైనా వస్తే తమ దగ్గరి వాళ్లకి చెప్పుకొని, ఉపశమనం పొందుతుంటారు. అన్యాయం చేసినవారిని తిట్టుకుంటూ విలువైన సమయాన్ని, డబ్బును పోగొట్టుకుంటుంటారు. కానీ, న్యాయవ్యవస్థను సంప్రదించాలంటే మాత్రం భయపడతారు. లాయర్లకు బోలెడంత డబ్బు ఫీజుగా ఇచ్చుకోలేమనో, కోర్టు చుట్టూ తిరగలేమనో అనుకుంటారు. నేడు అంటే నవంబర్ 9న నేషనల్ లీగల్ సర్వీస్ డే. ఈ సందర్భంగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో ఉచితంగా న్యాయం పొందగలిగే విధానాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం అవసరం. పూర్ణకు పెళ్లయ్యి ఏడాదిన్నర అవుతోంది. ఆర్నెల్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. తండ్రి కట్నంగా ఇస్తానన్న డబ్బు తీసుకునే ఇంటికి రావాలని అత్తింట్లో షరతు పెట్టారు, కూలి పనులు చేసే తండ్రి అంత డబ్బు ఇచ్చుకోలేడు. తనకు న్యాయం జరిగేదెలాగో పూర్ణకు తెలియడం లేదు. నీతు ఇంజనీరింగ్ చదువుతోంది. నెల రోజులుగా తెలియని వారు తన గురించి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ మానసికంగా వేధిస్తున్నారు. ఇంట్లో పెద్దలకు చెబితే తననే తప్పు పడతారేమో, పోలీసులను సంప్రదిస్తే ఇంటి పరువు పోతుందేమో అని భయం. ఎవరి నుంచి ఎలాంటి సాయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ‘ప్రతి మనిషికి న్యాయపరమైన అవసరం ప్రతి దశలోనూ ఉంటుంది. అందుకు ముందుగా పోలీసులు సంప్రదించలేకపోవచ్చు. కానీ, న్యాయపరమైన సలహా తీసుకుంటే మాత్రం సరైన పరిష్కారం లభిస్తుంది’ అంటారు అడ్వకేట్ రాజేశ్వరి. ‘పెద్ద పెద్ద నేరాలు జరిగితే తప్ప అలాంటి చోటుకి మనకేం పని అన్నట్టుగా చాలా మంది ఆలోచిస్తారు. అంతేకాదు, న్యాయం పొందాలంటే చేతిలో దండిగా డబ్బు ఉండాలని కూడా భావిస్తారు. అయితే అవన్నీ పొరపాటు భావనలేనని, ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్‌కి వెళ్లినట్టే ఏదైనా న్యాయపరమైన అవసరం ఏర్పడితే లీగల్ సర్వీస్ సెల్‌ని సంప్రదించవచ్చు’ అనేది న్యాయ నిపుణుల మాట. ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టడానికి అన్ని అర్హతలు ఉండి, బ్యాంకు లోన్‌కు నిరాకరించినా అందుకు తగిన న్యాయ సలహా తీసుకోవడం అవసరం. వినియోగదారుడు ఏదైనా వస్తువును కొని మోసపోయినా అందుకు సంబంధించిన న్యాయం పొందడానికి అవగాహన తప్పనిసరి. గ్రామాల్లో పది మంది మహిళా సంఘ సభ్యులు కలిసి ఏదైనా కార్యక్రమం చేపట్టాలన్నా న్యాయపరమైన అవసరం ఉంటుంది. మన నిత్యజీవితంలో ప్రతి చిన్న విషయానికి ‘న్యాయం’అవసరం గుర్తించాలి. అంతేకాదు ప్రతీ చిన్న విషయానికి డబ్బు చెల్లిస్తేనే న్యాయం పొందుతామనే ఆలోచనను దూరం పెట్టాలి. సరైన పరిష్కారానికి.. సమస్య వచ్చినప్పుడు స్థానికంగా మండల లేదా జిల్లా లేదా రాష్ట్ర స్థాయిల్లో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదించి, సలహా తీసుకోవచ్చు. లీగల్ సర్వీస్ అథారిటీ ప్యానెల్లో సివిల్, క్రిమినల్.. ఇలా ఒక్కో విభాగానికి ఒక్కో లాయర్ ఉంటారు. రాష్ట్రస్థాయి లీగల్ ప్యానెల్లో హైకోర్టు జడ్జి కూడా ఉంటారు. వీరిలో ఎవరిని సంప్రదించినా పరిష్కారం ఎక్కడ లభిస్తుందో అందుకు సంబంధించిన సమాచారం తప్పక తెలుస్తుంది. ఏ కేసులు ఎంత వరకు పరిష్కారం అవుతున్నాయనే విషయంలోనూ ఈ సెల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. వీటితోపాటు మధ్యవర్తిగా సమస్యలను పరిష్కరించే లోక్ అదాలత్ అనే మీడియేషన్ టెక్నిక్ కూడా అందుబాటులో ఉంది. మహిళలు.. పిల్లలు అత్యాచారం, కిడ్నాప్, వరకట్న వేధింపులు, మానసిక–శారీరక హింస, లైంగిక వేధింపులు మొదలైన వాటి నుంచి మహిళలు న్యాయ పొందడానికి లీగల్ సర్వీస్ సెల్‌ను ఆశ్రయించవచ్చు. అంతేకాదు సైబర్ బుల్లీయింగ్, మహిళా సాధికారతకు అవరోధం కలిగించే అంశాలేవైనా న్యాయపరమైన సలహా తీసుకోవచ్చు. కాలేజీలు.. పాఠశాలలు ఇటీవల యువతలో బాగా వినిపిస్తున్న మాట మాదకద్రవ్యాల వినియోగం. కాలేజీల్లో లీగల్ అడ్వైజ్ సెషన్స్ ఏర్పాటు చేయడానికి యాజమాన్యాలు ముందుకు రావాలి. లీగల్ సర్వీస్ అథారిటీ కూడా లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలను చేపడుతుంది. వీటికి హాజరై అందుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. పారా లీగల్ వాలెంటీర్లు వీళ్లు పూర్తిస్థాయి లాయర్లు కాదు. న్యాయ సమాచారం తెలుసుకుని, జనాలకు స్వచ్ఛందంగా అందిస్తుంటారు. జనాల మధ్యన తిరుగుతూ, ఎవరికైనా న్యాయపరమైన సాయం చేసేవారుంటారు. ఎవరైనా ఆసక్తి గలవారు ‘న్యాయం’ కు సంబంధించిన సమాచారం తెలుసుకొని, ప్రజలకు స్వచ్ఛందంగా అవగాహన కలిగించవచ్చు. ఇది కూడా సామాజిక సేవలో భాగమే అవుతుంది. – నిర్మలారెడ్డి ఉచితంగా న్యాయ సేవ పేద పౌరుల కేటగిరీ కిందకు వచ్చే ప్రతి ఒక్కరూ ఉచిత న్యాయ సేవలను అందుకోవడానికి అర్హులు. 9–9–1995 నుంచి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 అమల్లోకి వచ్చింది. ఇందులో అర్హులైన వ్యక్తులు తమ తరపున కేసులను దాఖలు చేయడానికి లేదా ఏదైనా కోర్టులో తమకు వ్యతిరేకంగా దాఖలైన కేసులలో తమను తాము రక్షించుకోవడానికి న్యాయ సేవలను ఉచితంగా పొందవచ్చు. ఉచిత న్యాయ సహాయం గురించి, దీనితోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీలు అందించే అనేక సేవలను ప్రజలకు తెలియజేయడానికి ప్రతియేటా ప్రచారాలు నిర్వహిస్తారు. చట్టపరమైన సహాయం కోరుకునే వ్యక్తి న్యాయ సేవల కోసం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లోనూ సంప్రదించవచ్చు. అవగాహన తప్పనిసరి ఈ నవంబర్ నెల అంతా స్కూల్స్, కాలేజీల్లో న్యాయ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. చదువుకునే విద్యార్థులకు న్యాయవ్యవస్థకు సంబంధించిన ప్రాథమికాంశాల పట్ల అవగాహన ఉండాలనేది మా థీమ్. అమ్మాయిలకైతే శారీరక, మానసిక, లైంగిక హింసలు, గృహహింస, ఆస్తి హక్కుల గురించిన పూర్తి సమాచారం తెలిసుండాలి. వీటికి సంబంధించిన విషయాల మీద లీగల్ సర్వీస్ అథారిటీ కూడా మండల, గ్రామ, జిల్లా స్థాయిల్లోనూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుంటుంది. – రాజేశ్వరి, అడ్వకేట్ -
Tempus Law Associates: న్యాయ మార్గదర్శనం
అది 1988. బెంగళూరులో ఉన్న ‘నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ’లో అప్పుడే ప్రవేశ పెట్టిన ఐదేళ్ల న్యాయశాస్త్రం కోర్సులో చేరింది ఓ అనంతపూరమ్మాయి. 1993 తొలి బ్యాచ్ బయటకు వస్తున్న వేడుకలవి. ఐదు బంగారు పతకాలతో కాలేజ్ టాపర్‌గా నిలిచింది అదే అమ్మాయి. ఆమె సెవెన్త్, టెన్త్, ఇంటర్లో స్టేట్ ర్యాంకర్. ఎల్ఎల్బీలో ఐదు బంగారు పతకాలతో టాపర్. ఏడుకి ఆరు పాయింట్ ఎనిమిది సీజీపీఏతో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ టాపర్స్ బోర్డులో ఇప్పటికీ ఆమె రికార్డు అలాగే ఉంది. చదువుకు అంతం లేదని నిరూపిస్తూ నిరంతరం చదువుతూనే ఉన్న సుందరి పిశుపాటి న్యాయశాస్త్రం మనిషిని నిత్యవిద్యార్థిగా మారుస్తుందంటారు. మహిళలకు అవకాశాలు మెరుగయ్యాయి. అన్ని రంగాలూ మహిళల కోసం ఎదురు చూస్తున్నాయి. సమాజ ధోరణి కూడా మారుతోంది. ఒకప్పుడు మహిళ గృహిణి పరిధి దాటి తనకంటూ ఒక గుర్తింపును కోరుకుందీ అంటే... అది టీచర్, డాక్టర్ వరకే పరిమితం. ఆ తర్వాత లాయర్ గౌన్‌కు కూడా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ రంగం ఆ రంగం అనే పరిధులు లేవు. ఇంతవరకు చూడని రంగంలో మహిళను చూసినా కూడా ఒకింత ఆశ్చర్యానికి మరింత ఆనందానికి లోనవుతోంది తప్ప... సమాజం ఒకప్పటిలాగా తేలికగా చూడడం లేదు. సమాజం ఆలోచన విస్తృతమైంది. ఈ మార్పు కూడా మహిళ సాధించిన ప్రగతి అనే చెప్పాలి. ఎందుకంటే గడచిన తరాల తల్లులు తమకు అడ్డుగోడలుగా ఉన్న ఆంక్షల పరిధులను తన పిల్లల మెదళ్లలో ఇంకనివ్వకుండా జాగ్రత్తపడడమే. ఇవన్నీ మగవాళ్ల రంగాలు అనే దురభిప్రాయాన్ని చెరిపివేస్తూ సాగుతున్న మహిళ విజయ ప్రస్థానంలో సుందరి పిశుపాటి లా ఫర్మ్ స్థాపించి తక్కెడను సమం చేశారు. ఈ రంగంలో మహిళలను న్యాయవాదులుగా లేదా జడ్జిలుగా మాత్రమే చూస్తుంటాం. సుందరి స్థాపించిన టెంపస్ లా అసోసియేట్స్ ఇప్పుడు పాతికమంది లాయర్లు మరో ఐదుగురు న్యాయేతర సిబ్బందితో నడుస్తోంది. సమాజంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ముందడుగు వేయవలసిందిగా స్టార్టప్ ఆలోచనలు ఉన్న మహిళలకు ఆహ్వానం పలుకుతున్నారు సుందరి. అవకాశం తలుపుతట్టింది ‘‘నేను పుట్టింది అనంతపురం జిల్లా గుత్తిలో. పెరిగింది చిత్తూరు, చెన్నైలలో. మా తాత లాయర్. మా నాన్న హిందుస్థాన్ యాంటీబయాటిక్స్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్. నాకు న్యాయవాద వృత్తి కచ్చితంగా సూటవుతుందనుకున్నారాయన. అలాగే ప్రోత్సహించారు. నేను లా పట్టాతో హైదరాబాద్‌కి వచ్చి హైకోర్టులో ఓ సీనియర్ లాయర్ దగ్గర అప్రెంటీస్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టాను. మూడేళ్ల తర్వాత నాకు యూఎస్‌లో మాస్టర్స్ చేసే అవకాశం వచ్చింది. అప్పటికి మా అబ్బాయి ఏడు నెలల బిడ్డ. నిజానికి నా కెరీర్లో అసలైన మలుపు అదే. ఆ క్షణంలో ఇంట్లో వాళ్లు ‘చంటిబిడ్డను వదిలి ఎలా వెళ్తావు’ అంటే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. ‘బాబుని చూసుకుంటాం’ అని అమ్మానాన్న సపోర్టుగా నిలిచారు. ‘అవకాశం ఒక్కసారే వస్తుంది. అప్పుడే అందిపుచ్చుకోవాలి. వదులుకోవద్దు’ అని మామగారు ధైర్యం చెప్పారు. అత్తగారు, మా వారు కూడా అదే మాటన్నారు. అలా కొలంబియా యూనివర్సిటీ నుంచి 1998లో ఎల్ఎల్ఎమ్ పూర్తి చేయడం, కఠినమైన న్యూయార్క్ బార్ ఎగ్జామ్ పూర్తి చేయడంతోపాటు అక్కడే ప్రాక్టీస్ కూడా చేశాను. సిడ్లీ – ఆస్టిన్ బ్రౌన్ అండ్ ఉడ్ లా ఫర్మ్ యూఎస్‌లోని అతి పెద్ద లా ఫర్మ్‌లలో ఒకటి. రెండు వేల ఐదు వందల మంది లాయర్లు ఉంటారు. అందులో ప్రాక్టీస్ చేయడం నాకు బాగా ఉపయోగపడింది. సొంత ఫర్మ్ ఇండియాకి 2003లో వచ్చాను. ఆ తర్వాత ఐదేళ్లకు నేను కో మేనేజింగ్ పార్టనర్‌గా, నా భర్త రవిప్రసాద్ పార్టనర్‌గా టెంపస్ లా అసోసియేట్స్ మల్టీ స్పెషాలిటీ లా ఫర్మ్ స్థాపించాం. బెంగళూరు, కాలిఫోర్నియాలో బ్రాంచ్‌లు కూడా స్వయంగా చూసుకుంటున్నాం. టెంపస్ అంటే ‘అంది వచ్చిన అవకాశం, మంచి అదృష్టం’ అని అర్థం. నా జర్నీ చాలా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోందని చెప్పడానికి ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ కంపెనీలు... ఇలా మా క్లయింట్ల జాబితా చాలా విస్తృతమైనది. కార్పొరేట్, రియల్ ఎస్టేట్, లిటిగేషన్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, కమర్షియల్ లాస్... ఏరియాలో ఎక్కువగా పని చేస్తున్నాను. అందుకే నేను కొత్త తరం మహిళలకు న్యాయసేవ మీద దృష్టి కేంద్రీకరించాను. ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపిస్తున్న వాళ్లకు మా అవసరం ఉండదు. కానీ ఈ తరం మహిళల్లో సొంతంగా పరిశ్రమ స్థాపించి నిర్వహించాలనే ఆకాంక్ష ఉన్న వాళ్లు ఎక్కువవుతున్నారు. ఇది మంచి పరిణామం కూడా. అయితే వాళ్లకు తమ ప్రాజెక్టు ఎలా స్థాపించాలో, ప్రభుత్వ పరమైన చట్టాలు ఎలా ఉన్నాయో, విదేశీ చట్టాల పరిధిలో ఇబ్బందులు ఎదురు కాకుండా కంపెనీ స్థాపించేటప్పుడే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం ఒక మహిళగా నా బాధ్యత అనుకున్నాను. ఎక్కడ నా సేవ అవసరమవుతుందో అక్కడ మహిళలకు మార్గదర్శనం చేయడానికి ముందుంటున్నాను. ట్యాక్స్ మినహాయింపులు, సీడ్ క్యాపిటల్ అరేంజ్మెంట్, జాయింట్ వెంచర్ నిర్వహణ, ప్రైవేట్ లిమిటెడ్ స్థాపన, ఐపీవో వంటివన్నీ వివరిస్తాం. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం. ఇలా నేను కోవె, ఫిక్కీ ఎఫ్ఎల్వో ద్వారా మహిళలకు న్యాయ సేవలందిస్తున్నాను. అలాగే టీ హబ్ ద్వారా కూడా నా వంతు సర్వీస్ ఇస్తున్నాను. మహిళల విషయానికి వచ్చేటప్పటికి ప్రభుత్వాలు చాలా ధారాళంగా పథకాలు రూపొందిస్తున్నాయి. కానీ బ్యాంకులు నాన్ కొలాటరల్ లోన్ ఇవ్వడంలో అంతగా చొరవ చూపించడం లేదు. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి మేము వెంచర్ క్యాపిటలిస్టులతో అనుసంధానం చేస్తున్నాం. మహిళలను ప్రోత్సహించడానికి మహిళలే స్థాపించి మహిళలే నిర్వహిస్తున్న స్టార్టప్‌లే లక్ష్యంగా ‘షీ క్యాపిటల్’ ఫండ్ ద్వారా ఒక వేదిక మీదకు వచ్చిన క్యాపిటలిస్టుల సహకారం తీసుకుంటున్నాం. మహిళలకు మెంటార్షిప్ చేయడంలో సంతృప్తి ఉంది. ఎందుకంటే... న్యాయవాద వృత్తి ట్వంటీఫోర్ బై సెవెన్ డ్యూటీ, ఎప్పుడూ సబ్జెక్టుకు దగ్గరగా ఉండాలి, క్లయింట్‌కు రెస్పాండ్ అవుతూ ఉండాలి. ఇంతటి ఒత్తిడి ఉండే వృత్తిలో సాటి మహిళల కోసం చేస్తున్న ఈ సర్వీస్ సంతోషాన్నిస్తుంది’’ అన్నారు సుందరి పిశుపాటి. విజయానికి తొలిమెట్టు ప్రొఫెషన్లో నిలదొక్కుకోవడంలో మహిళ అయిన కారణంగా ప్రత్యేకంగా ఎదురైన ఇబ్బందులేమీ లేవు. కానీ లాయర్‌గానే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. గుడ్ క్వాలిటీ వర్క్, గుడ్ క్వాలిటీ క్లయింట్లను నిలుపుకోగలిగితే అదే విజయానికి తొలిమెట్టు... మలిమెట్టు కూడా. కుటుంబాన్ని, ప్రొఫెషన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ప్రతి వర్కింగ్ ఉమన్కీ తప్పదు. నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ లాయర్లే. ఇంత స్థాయిలో ఒత్తిడి అవసరమా అని మా పిల్లల విషయంలో అనిపించింది. కానీ వాళ్లు మమ్మల్ని చూసి మా దారిలోనే నడుస్తున్నారు. మాది లాయర్ల ఫ్యామిలీ అయిపోయింది. మా సొంత ఫర్మ్ ఉన్నప్పటికీ మా అబ్బాయిని సొంతంగా అప్రంటీస్‌గా బయట ప్రాక్టీస్ చేయమని చెప్పాం. పని ఒంటబట్టాలంటే పనిని పనిలాగానే నేర్చుకోవాలి. – సుందరి ఆర్ పిశుపాటి, టెంపస్ లా అసోసియేట్స్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి ఫొటో: నోముల రాజేశ్ రెడ్డి -
న్యాయవాది కేసు ఓడిపోతే సేవాలోపం అనలేం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ సేవల్లో లోపం ఉందని ఆరోపిస్తూ ఎవరైనా పరిహారం నిమిత్తం వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించొచ్చని, అయితే అది అన్ని వేళలా సమంజసం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఉత్తర్వులు సవాల్ చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ నెల 8న విచారించింది. ఓ కేసు విషయంలో ముగ్గురు న్యాయవాదుల వల్ల నష్టపోయానంటూ వినియోగదారుల ఫోరాన్ని ఓ వ్యక్తి సంప్రదించారు. జాతీయ వినియోగదారుల ఫోరం కూడా సదరు వ్యక్తి అభ్యర్థన తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘‘జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాలు పిటిషనర్ అభ్యర్థన తిరస్కరించడం సబబే. ప్రతి కేసులోనూ ఎవరో ఒకరు ఓడిపోవడం జరుగుతుంది. అంతమాత్రాన వినియోగదారుల ఫోరానికి వెళ్లి న్యాయవాది నుంచి పరిహారం ఇప్పించాలనడం సమంజసం కాదు. జరిమానా విధించకుండా పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. న్యాయవాది నిర్లక్ష్యం ఉందని బలమైన ఆధారాలుంటే తప్ప సేవాలోపంగా పేర్కొనలేమని స్పష్టం చేసింది. -
మానవీయ విలువలతోనే హక్కుల పరిరక్షణ
ఎస్కేయూ (అనంతపురం) : ‘మానవత్వంలోనే దైవ త్వం ఉంది. మానవీయ విలువలను కలిగి ఉంటూ మానవ హక్కులను కాపాడుకోవాలి’అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. ‘మానవీయ విలువలు– చట్టబద్ధమైన ప్రపంచం’అనే అంశంపై అనంతపురం జిల్లా పుట్టపర్తిలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ న్యాయ సేవా సదస్సు శనివారం ప్రారంభమైంది. సదస్సుకు జస్టిస్ దీపక్ మిశ్రా ముఖ్య అతిథిగా, అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, 750 మంది న్యాయ నిపుణులు, 300 మంది న్యాయ విద్యార్థులు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ... ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా హక్కులను అనుభవించాలన్నారు. అహాన్ని తొలగించుకుంటేనే శాంతి లభిస్తుందని చెప్పారు. ఆధ్యాత్మికత హేతుబద్ధంగాను, హేతుబద్ధమైన ఆధ్యాత్మికంగానూ ఉండాలన్నారు. మన రాజ్యాంగంలో చట్టపరమైన నిబంధనలే కాకుండా మానవత్వ విలువలు, ఆధ్యాత్మిక నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ధర్మమే సమాజాన్ని రక్షిస్తుందని.. సన్మార్గంలో నడిపిస్తుందన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణ, శ్రీసత్యసాయి సేవా సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు జతీందర్ చీమా, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ ఎస్ఎస్ నాగానంద్, ఆలిండియా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ అధ్యక్షుడు నిమీశ్ పాండే, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు బయట సెటిల్మెంట్లకు ఓకే
ప్రభుత్వ ప్రతిపాదనకు న్యాయ సంస్కరణల కమిటీ మద్దతు న్యూఢిల్లీ: కోర్టు బయట సెటిల్మెంట్లకు చట్టబద్దత కల్పించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు న్యాయ సంస్కరణల కమిటీ మద్దతు తెలిపింది. న్యాయ సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి ‘న్యాయ సేవ, సంస్కరణల జాతీయ సలహా మండలి’ ముందు న్యాయ శాఖ ఈ ప్రతిపాదన ఉంచింది. కొన్ని రకాల కేసులను కోర్టు బయట పరిష్కరించడం ద్వారా న్యాయస్థానాలకు కొంత భారం తగ్గుతుందని శాఖ భావిస్తోంది.ఈ క్రమంలోనే మధ్యవర్తిత్వానికి శాసన సహకారంతో చట్టబద్దత కల్పించాలనే ఆలోచనను తెరపైకి తెచ్చింది. మధ్యవర్తిత్వానికి చట్టబద్దత లేనందున చాలామంది కేసుల పరిష్కారానికి ఆసక్తి చూపట్లేదని భావిస్తోంది. న్యాయ మంత్రి అధ్యక్షతన ఉన్న ఈ కౌన్సిల్లో సుప్రీంకోర్టు, బార్‌కౌన్సిల్, హోం, న్యాయ శాఖ సహాయ మంత్రులు, అటార్నీ జనరల్ సభ్యులుగా ఉన్నారు.