Tempus Law Associates: న్యాయ మార్గదర్శనం | Tempus Law Associates: Tempus is a multi-service law firm | Sakshi
Sakshi News home page

Tempus Law Associates: న్యాయ మార్గదర్శనం

Published Fri, Apr 15 2022 12:48 AM | Last Updated on Fri, Apr 15 2022 12:48 AM

Tempus Law Associates: Tempus is a multi-service law firm - Sakshi

సుందరి ఆర్‌ పిశుపాటి

అది 1988. బెంగళూరులో ఉన్న ‘నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ’లో అప్పుడే ప్రవేశ పెట్టిన ఐదేళ్ల న్యాయశాస్త్రం కోర్సులో చేరింది ఓ అనంతపూరమ్మాయి. 1993 తొలి బ్యాచ్‌ బయటకు వస్తున్న వేడుకలవి. ఐదు బంగారు పతకాలతో కాలేజ్‌ టాపర్‌గా నిలిచింది అదే అమ్మాయి. ఆమె సెవెన్త్, టెన్త్, ఇంటర్‌లో స్టేట్‌ ర్యాంకర్‌. ఎల్‌ఎల్‌బీలో ఐదు బంగారు పతకాలతో టాపర్‌. ఏడుకి ఆరు పాయింట్‌ ఎనిమిది సీజీపీఏతో బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ టాపర్స్‌ బోర్డులో ఇప్పటికీ ఆమె రికార్డు అలాగే ఉంది. చదువుకు అంతం లేదని నిరూపిస్తూ నిరంతరం చదువుతూనే ఉన్న సుందరి పిశుపాటి న్యాయశాస్త్రం మనిషిని నిత్యవిద్యార్థిగా మారుస్తుందంటారు.  

మహిళలకు అవకాశాలు మెరుగయ్యాయి. అన్ని రంగాలూ మహిళల కోసం ఎదురు చూస్తున్నాయి. సమాజ ధోరణి కూడా మారుతోంది. ఒకప్పుడు మహిళ గృహిణి పరిధి దాటి తనకంటూ ఒక గుర్తింపును కోరుకుందీ అంటే... అది టీచర్, డాక్టర్‌ వరకే పరిమితం. ఆ తర్వాత లాయర్‌ గౌన్‌కు కూడా క్రేజ్‌ వచ్చింది. ఇప్పుడు ఈ రంగం ఆ రంగం అనే పరిధులు లేవు. ఇంతవరకు చూడని రంగంలో మహిళను చూసినా కూడా ఒకింత ఆశ్చర్యానికి మరింత ఆనందానికి లోనవుతోంది తప్ప... సమాజం ఒకప్పటిలాగా తేలికగా చూడడం లేదు. సమాజం ఆలోచన విస్తృతమైంది.

ఈ మార్పు కూడా మహిళ సాధించిన ప్రగతి అనే చెప్పాలి. ఎందుకంటే గడచిన తరాల తల్లులు తమకు అడ్డుగోడలుగా ఉన్న ఆంక్షల పరిధులను తన పిల్లల మెదళ్లలో ఇంకనివ్వకుండా జాగ్రత్తపడడమే. ఇవన్నీ మగవాళ్ల రంగాలు అనే దురభిప్రాయాన్ని చెరిపివేస్తూ సాగుతున్న మహిళ విజయ ప్రస్థానంలో సుందరి పిశుపాటి లా ఫర్మ్‌ స్థాపించి తక్కెడను సమం చేశారు. ఈ రంగంలో మహిళలను న్యాయవాదులుగా లేదా జడ్జిలుగా మాత్రమే చూస్తుంటాం. సుందరి స్థాపించిన టెంపస్‌ లా అసోసియేట్స్‌ ఇప్పుడు పాతికమంది లాయర్లు మరో ఐదుగురు న్యాయేతర సిబ్బందితో నడుస్తోంది. సమాజంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ముందడుగు వేయవలసిందిగా స్టార్టప్‌ ఆలోచనలు ఉన్న మహిళలకు ఆహ్వానం పలుకుతున్నారు సుందరి.
 
అవకాశం తలుపుతట్టింది
‘‘నేను పుట్టింది అనంతపురం జిల్లా గుత్తిలో. పెరిగింది చిత్తూరు, చెన్నైలలో. మా తాత లాయర్‌. మా నాన్న హిందుస్థాన్‌ యాంటీబయాటిక్స్‌లో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌. నాకు న్యాయవాద వృత్తి కచ్చితంగా సూటవుతుందనుకున్నారాయన. అలాగే ప్రోత్సహించారు. నేను లా పట్టాతో హైదరాబాద్‌కి వచ్చి హైకోర్టులో ఓ సీనియర్‌ లాయర్‌ దగ్గర అప్రెంటీస్‌గా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాను. మూడేళ్ల తర్వాత నాకు యూఎస్‌లో మాస్టర్స్‌ చేసే అవకాశం వచ్చింది. అప్పటికి మా అబ్బాయి ఏడు నెలల బిడ్డ. నిజానికి నా కెరీర్‌లో అసలైన మలుపు అదే. ఆ క్షణంలో ఇంట్లో వాళ్లు ‘చంటిబిడ్డను వదిలి ఎలా వెళ్తావు’ అంటే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు.

‘బాబుని చూసుకుంటాం’ అని అమ్మానాన్న సపోర్టుగా నిలిచారు. ‘అవకాశం ఒక్కసారే వస్తుంది. అప్పుడే అందిపుచ్చుకోవాలి. వదులుకోవద్దు’ అని మామగారు ధైర్యం చెప్పారు. అత్తగారు, మా వారు కూడా అదే మాటన్నారు. అలా కొలంబియా యూనివర్సిటీ నుంచి 1998లో ఎల్‌ఎల్‌ఎమ్‌ పూర్తి చేయడం, కఠినమైన న్యూయార్క్‌ బార్‌ ఎగ్జామ్‌ పూర్తి చేయడంతోపాటు అక్కడే ప్రాక్టీస్‌ కూడా చేశాను. సిడ్లీ – ఆస్టిన్‌ బ్రౌన్‌ అండ్‌ ఉడ్‌ లా ఫర్మ్‌ యూఎస్‌లోని అతి పెద్ద లా ఫర్మ్‌లలో ఒకటి. రెండు వేల ఐదు వందల మంది లాయర్లు ఉంటారు. అందులో ప్రాక్టీస్‌ చేయడం నాకు బాగా ఉపయోగపడింది.
 
సొంత ఫర్మ్‌

ఇండియాకి 2003లో వచ్చాను. ఆ తర్వాత ఐదేళ్లకు నేను కో మేనేజింగ్‌ పార్టనర్‌గా, నా భర్త రవిప్రసాద్‌ పార్టనర్‌గా టెంపస్‌ లా అసోసియేట్స్‌ మల్టీ స్పెషాలిటీ లా ఫర్మ్‌ స్థాపించాం. బెంగళూరు, కాలిఫోర్నియాలో బ్రాంచ్‌లు కూడా స్వయంగా చూసుకుంటున్నాం. టెంపస్‌ అంటే ‘అంది వచ్చిన అవకాశం, మంచి అదృష్టం’ అని అర్థం. నా జర్నీ చాలా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోందని చెప్పడానికి ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇంటర్నేషనల్‌ ఫండ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు... ఇలా మా క్లయింట్ల జాబితా చాలా విస్తృతమైనది.

కార్పొరేట్, రియల్‌ ఎస్టేట్, లిటిగేషన్, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ, కమర్షియల్‌ లాస్‌... ఏరియాలో ఎక్కువగా పని చేస్తున్నాను. అందుకే నేను కొత్త తరం మహిళలకు న్యాయసేవ మీద దృష్టి కేంద్రీకరించాను. ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపిస్తున్న వాళ్లకు మా అవసరం ఉండదు. కానీ ఈ తరం మహిళల్లో సొంతంగా పరిశ్రమ స్థాపించి నిర్వహించాలనే ఆకాంక్ష ఉన్న వాళ్లు ఎక్కువవుతున్నారు. ఇది మంచి పరిణామం కూడా. అయితే వాళ్లకు తమ ప్రాజెక్టు ఎలా స్థాపించాలో, ప్రభుత్వ పరమైన చట్టాలు ఎలా ఉన్నాయో, విదేశీ చట్టాల పరిధిలో ఇబ్బందులు ఎదురు కాకుండా కంపెనీ స్థాపించేటప్పుడే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం ఒక మహిళగా నా బాధ్యత అనుకున్నాను.

ఎక్కడ నా సేవ అవసరమవుతుందో అక్కడ మహిళలకు మార్గదర్శనం చేయడానికి ముందుంటున్నాను. ట్యాక్స్‌ మినహాయింపులు, సీడ్‌ క్యాపిటల్‌ అరేంజ్‌మెంట్, జాయింట్‌ వెంచర్‌ నిర్వహణ, ప్రైవేట్‌ లిమిటెడ్‌ స్థాపన, ఐపీవో వంటివన్నీ వివరిస్తాం. ఈ సర్వీస్‌ పూర్తిగా ఉచితం. ఇలా నేను కోవె, ఫిక్కీ ఎఫ్‌ఎల్‌వో ద్వారా మహిళలకు న్యాయ సేవలందిస్తున్నాను. అలాగే టీ హబ్‌ ద్వారా కూడా నా వంతు సర్వీస్‌ ఇస్తున్నాను. మహిళల విషయానికి వచ్చేటప్పటికి ప్రభుత్వాలు చాలా ధారాళంగా పథకాలు రూపొందిస్తున్నాయి.

కానీ బ్యాంకులు నాన్‌ కొలాటరల్‌ లోన్‌ ఇవ్వడంలో అంతగా చొరవ చూపించడం లేదు. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి మేము వెంచర్‌ క్యాపిటలిస్టులతో అనుసంధానం చేస్తున్నాం. మహిళలను ప్రోత్సహించడానికి మహిళలే స్థాపించి మహిళలే నిర్వహిస్తున్న స్టార్టప్‌లే లక్ష్యంగా ‘షీ క్యాపిటల్‌’ ఫండ్‌ ద్వారా ఒక వేదిక మీదకు వచ్చిన క్యాపిటలిస్టుల సహకారం తీసుకుంటున్నాం. మహిళలకు మెంటార్‌షిప్‌ చేయడంలో సంతృప్తి ఉంది. ఎందుకంటే... న్యాయవాద వృత్తి ట్వంటీఫోర్‌ బై సెవెన్‌ డ్యూటీ, ఎప్పుడూ సబ్జెక్టుకు దగ్గరగా ఉండాలి, క్లయింట్‌కు రెస్పాండ్‌ అవుతూ ఉండాలి. ఇంతటి ఒత్తిడి ఉండే వృత్తిలో సాటి మహిళల కోసం చేస్తున్న ఈ సర్వీస్‌ సంతోషాన్నిస్తుంది’’ అన్నారు సుందరి పిశుపాటి.

విజయానికి తొలిమెట్టు
ప్రొఫెషన్‌లో నిలదొక్కుకోవడంలో మహిళ అయిన కారణంగా ప్రత్యేకంగా ఎదురైన ఇబ్బందులేమీ లేవు. కానీ లాయర్‌గానే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. గుడ్‌ క్వాలిటీ వర్క్, గుడ్‌ క్వాలిటీ క్లయింట్‌లను నిలుపుకోగలిగితే అదే విజయానికి తొలిమెట్టు... మలిమెట్టు కూడా. కుటుంబాన్ని, ప్రొఫెషన్‌ని బ్యాలెన్స్‌ చేసుకోవడం అనేది ప్రతి వర్కింగ్‌ ఉమన్‌కీ తప్పదు. నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ లాయర్లే. ఇంత స్థాయిలో ఒత్తిడి అవసరమా అని మా పిల్లల విషయంలో అనిపించింది. కానీ వాళ్లు మమ్మల్ని చూసి మా దారిలోనే నడుస్తున్నారు. మాది లాయర్ల ఫ్యామిలీ అయిపోయింది. మా సొంత ఫర్మ్‌ ఉన్నప్పటికీ మా అబ్బాయిని సొంతంగా అప్రంటీస్‌గా బయట ప్రాక్టీస్‌ చేయమని చెప్పాం. పని ఒంటబట్టాలంటే పనిని పనిలాగానే నేర్చుకోవాలి.
– సుందరి ఆర్‌ పిశుపాటి, టెంపస్‌ లా అసోసియేట్స్, హైదరాబాద్‌

– వాకా మంజులారెడ్డి
ఫొటో: నోముల రాజేశ్‌ రెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement