న్యాయవ్యవస్థలో మార్పులు రావాలి | The judiciary needs changes | Sakshi
Sakshi News home page

న్యాయవ్యవస్థలో మార్పులు రావాలి

Published Sun, Nov 22 2015 12:57 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

న్యాయవ్యవస్థలో మార్పులు రావాలి - Sakshi

న్యాయవ్యవస్థలో మార్పులు రావాలి

సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ లోకూర్
 
 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయవ్యవస్థలోనూ మార్పులు రావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ అభిప్రాయపడ్డారు. కక్షిదారులకు సకాలంలో న్యాయం అందించేందుకు వీలుగా సంస్కరణలు తీసుకురావాలన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో జరిగిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల సంఘం వార్షిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానంలోనే 65 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని , కోర్టుల నిర్వహణకు ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.

దేశ వ్యాప్తంగా 97శాతం జిల్లా కోర్టులను కంప్యూటరీకరించామని, రూ.88 కోట్లతో పక్కాభవనాల నిర్మాణాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జస్టిస్ లోకూర్ వెల్లడించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సి.లాహోటి ‘భారత న్యాయవ్యవస్థ -ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తూ న్యాయ వ్యవస్థలో నైపుణ్యం కొరవడిందని, సామాన్యులకు న్యాయం అందించలేకపోతున్నామని వ్యాఖ్యానించారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బొసాలె మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై న్యాయమూర్తులు అందించిన సల హాలను పరిగణనలోకి తీసుకుంటామని, కేసుల పరిష్కారంలో ఈ సూచనలను ఆచరిస్తామని చెప్పారు. సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, ఎస్పీ రమారాజేశ్వరి పాల్గొన్నారు.
 
 కేసుల పరిష్కారానికి సహకరించండి
 సాక్షి, హైదరాబాద్: మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి సహకరించాలని న్యాయవాదులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ విజ్ఞప్తి చేశారు. మధ్యవర్తిత్వ కేంద్రాల ఏర్పాటు వల్ల న్యాయవాదుల వృత్తికి వచ్చిన నష్టం ఏమీ లేదని న్యాయవాదులకు సూచిం చారు. వివాదాల పరిష్కారానికి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల్లో మధ్యవర్తిత్వం మంచి ఫలితాలను అందిస్తోందన్నారు. ఉమ్మడి హైకోర్టులో మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జస్టిస్ లోకూర్ శనివారం హైకోర్టులో మధ్యవర్తి కేంద్రాల ప్రాధాన్యంపై రాజా అండ్ రాణి వేణుగోపాల పిళ్లై స్మారకోపన్యాసం చేశారు.

అంతకు ముందు ఆయన హైకోర్టు సీ బ్లాక్‌లో మధ్యవర్తిత్వం, రాజీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ రమేష్ రంగనాథన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement