న్యూఢిల్లీ: ఉన్నత న్యాయ వ్యవస్థలో మహిళలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉండటంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సమాజంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్న ఇతర ప్రభుత్వ సంస్థలతో పోటీపడుతూ న్యాయ వ్యవస్థ పనిచేయాలని సూచించారు. జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయ కమిషన్, నీతి ఆయోగ్ సంయుక్తంగా శనివారం నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కోవింద్ ప్రసంగించారు.
‘ఉన్నత న్యాయ వ్యవస్థలో బలహీన వర్గాలైన మహిళలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలకు అంత తక్కువగా ప్రాతినిధ్యం ఉండటం ఆమోదయోగ్యం కాదు. ఇతర సంస్థల మాదిరిగానే న్యాయ వ్యవస్థ కూడా సమాజంలోని వైవిధ్యం ప్రతిబింబించేలా అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించాలి’ అని కోవింద్ అన్నారు. ప్రతి నలుగురు జడ్జీల్లో ఒక్కరే మహిళ ఉన్నారన్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని సూచించారు.
కోర్టులకు దూరంగానే పేదలు..
జిల్లా, సెషన్స్ కోర్టుల జడ్జీల నైపుణ్యాలు పెంచే గురుతర బాధ్యత ఉన్నత న్యాయ వ్యవస్థపైనే ఉందని కోవింద్ నొక్కిచెప్పారు. అలా అయితేనే చాలా మంది జిల్లా కోర్టుల జడ్జీలు హైకోర్టులు, సుప్రీంకోర్టులకు పదోన్నతులు పొందుతారని పేర్కొన్నారు. దీని వల్ల దిగువ కోర్టులపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని, ఫలితంగా హైకోర్టులపై భారం తగ్గుతుందని అన్నారు.
న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నా, ఖర్చు, విచారణల ఆలస్యానికి భయపడి పేదలు కోర్టుల్లో న్యాయ పోరాటం చేయడానికి వెనుకాడుతున్నారని కోవింద్ పేర్కొన్నారు. ధనికులు లొసుగులను అడ్డుపెట్టుకుని కేసులను సాగదీస్తున్నారని, కాలం చెల్లిన, పనికిరాని చట్టాలను రద్దుచేసి పాలనను సులభతరం చేయాలని చెప్పారు.
సీజేఐ వర్సెస్ కేంద్ర మంత్రి
న్యాయ వ్యవస్థ క్రియాశీలతపై కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాల మధ్య స్వల్ప మాటల యుద్ధం చోటుచేసుకుంది. పౌరుల ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించడం న్యాయవ్యవస్థ పవిత్ర కర్తవ్యమని జస్టిస్ దీపక్ మిశ్రా పేర్కొనగా, ప్రభుత్వ విధానపర నిర్ణయాలకు దూరంగా ఉన్నంత వరకూ న్యాయవ్యవస్థ స్వతంత్రతకు గౌరవం ఉంటుందని చౌదరి అన్నారు. అలా కాకుండా న్యాయ క్రియాశీలత, సమీక్షల పేరుతో జోక్యం చేసుకుంటే మాత్రం పరిణామాలు ఆందోళనకరంగా ఉంటాయని అన్నారు.
ప్రజాస్వామ్యానికి న్యాయ స్వతంత్రత మూల స్తంభం వంటిదని, న్యాయ వ్యవస్థలోని జవాబుదారీతనం ఆ స్తంభానికి పునాది అని చెప్పారు. జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ.. పౌరుల ప్రాథమిక హక్కుల్ని ప్రభుత్వ విభాగాలు ఉల్లంఘించకూడదని, హక్కులకు భంగం కలిగిన మరుక్షణం, వాటిని అతిక్రమించే ప్రమాదకర సంకేతాలు ఉన్నప్పుడు న్యాయవ్యవస్థ పౌరుల పక్షాన నిలుస్తుందని అన్నారు. విధానపర నిర్ణయాలు చేయాలనే కోరిక న్యాయవ్యవస్థకు లేద ఆయన సమాధానమిచ్చారు. పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ, విస్తరణకు కోర్టులు చూపుతున్న చొరవను సీజేఐ సమర్థించారు. కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తదితరులు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment