
టెక్నాలజీతో సత్వర న్యాయం
⇒ న్యాయ వ్యవస్థ ఐటీని విస్తృతంగా వినియోగించాలి
⇒ పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు సహకరిస్తాం: మోదీ
అలహాబాద్: సత్వర న్యాయం అందజేసేందుకు టెక్నాలజీని సమర్థంగా వాడాలని ప్రధాని నరేంద్రమోదీ న్యాయ వ్యవస్థకు సూచించారు. కోర్టులో పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్‌కు హామీ ఇచ్చారు. ఆదివారం అలహాబాద్ హైకోర్టు 150వ వార్షికోత్సవ వేడుకల్లో మోదీ, సీజేఐ జస్టిస్ ఖేహర్ పాల్గొన్నారు. పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించేలా కొత్త ఆలోచనలతో స్టార్టప్‌లు ముందుకు రావాలనిప్రధాని పిలుపునిచ్చారు.
న్యాయ వ్యవస్థలో సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని ప్రభుత్వం కోరుకుంటోందని, దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, దీని వల్ల విలువైన కాలంతో పాటు నిధులనూ ఆదా చేయవచ్చని చెప్పారు. సాక్షులు, ఖైదీలు, అధికారుల వాంగ్మూలాలను సేకరించేందుకు వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని వాడడం ద్వారా డబ్బు, సమయాన్ని ఆదాచేయవచ్చన్నారు. ఖైదీలను నేరుగా కోర్టుల్లో ప్రవేశపెట్టడం వల్ల భద్రతా పరమైన అనేక ఇబ్బందులు ఎదురవుతాయని, వాటన్నిటికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెక్ పెట్టవచ్చని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ఖైదీలను కోర్టులకు తీసుకెళ్లే సమయంలో అనేక అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, అయితే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున ఇటువంటి ఘటనలు తగ్గుముఖం పడతాయన్నారు.
సీజేఐ జస్టిస్ ఖేహర్ ప్రసంగంతో ఆయన పడుతున్న వేదన తనకు అర్థమైందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా న్యాయవ్యవస్థ, ప్రభుత్వ అధికారులు దేశాన్ని అత్యున్నస్థాయికి తీసుకెళ్లేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు సీజేఐ ఖేహర్.. న్యాయమూర్తుల కొరత కారణంగా పెండింగ్ కేసులు పెరిగిపోతున్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీం కోర్టు వేసవి సెలవుల సందర్భంగా అసౌకర్యం తలెత్తకుండా మూడు రాజ్యాంగ ధర్మాసనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ ధర్మాసనాల్లోని న్యాయమూర్తులు వారంలో ఐదు రోజుల పాటు పనిచేయాలని.. రోజుకు కనీసం 10 కేసులను పరిష్కరించాలని ఆయన కోరారు.