సమ్మిళిత సమాజానికి టెక్నాలజీ బాటలు వేయాలి
జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ఉద్బోధ
బరీ(ఇటలీ): సాంకేతికత అనేది కేవలం అతి కొద్ది సంస్థలు, దేశాల చేతుల్లో ఉండకూడదని, ఇలాంటి గుత్తాధిపత్యానికి తెరపడాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. ఇటలీలోని బోర్గో ఎగ్నాజియా రిసార్ట్‌లో జరుగుతున్న జీ7 దేశాల 50వ శిఖరాగ్ర సదస్సులో శుక్రవారం ప్రధాని మోదీ సాంకేతికత అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘ మనం వినూత్న టెక్నాలజీని సృష్టించాలేగానీ విధ్వంసకర సాంకేతికతను కాదు. సాంకేతికతో గుత్తాధిపత్యం పోవాలి. సాంకేతికతను ప్రజాస్వామ్యయుతంచేయాలి. అప్పుడే సమాజంలోని అన్ని వర్గాలకు దానిని చేరువ చేయగలం.
సాంకేతికత ఫలాలు అందరికీ అందాలి. అప్పుడే సమ్మిళిత సమాజాభివృద్ధికి బాటలు వేసిన వారమవుతాం. మానవీయ విలువలున్న సాంకేతికత ద్వారా మెరుగైన భవిష్యత్తు కోసం భారత్ కలలు కంటోంది. కృత్రిమ మేథపై జాతీయ విధానాన్ని రూపొందించి అమలుచేస్తున్న అతి కొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ వ్యూహంలో భాగంగానే ఈ ఏడాది భారత్‌లో ‘ఏఐ మిషన్’కు అంకురార్పణ చేశాం. అందరికీ ఏఐ అనేది దీని మంత్రం. ‘గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ ఫర్ ఏఐ’లో వ్యవస్థాపక సభ్యునిగా, ఈ కూటమి ప్రస్తుత సారథిగా అన్ని దేశాల మధ్య సహకారాన్ని ఆశిస్తున్నా’’ అని మోదీ అన్నారు.
ఏఐపై అంతర్జాతీయ నియమావళి ఉండాల్సిందే
‘‘విస్తృతమవుతున్న ఏఐ రంగంపై అంతర్జాతీయంగా ఏకరూప నియమావళి ఉండాల్సిందే. గత ఏడాది ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులోనూ భారత్ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. భవిష్యత్తులోనూ పారదర్శక, స్వేచ్ఛా, సురక్షిత, సులభతర వినియోగ, భాధ్యతాయుత ఏఐ కోసం అన్ని దేశాలతో భారత్ కలిసి పనిచేస్తుంది. ఇంధనం పైనా భారత వైఖరి మారదు. ఇంధనం అందరికీ అందుబాటులో ఉండాలి. అందరూ వినియోగించుకోగలగాలి. అందరికీ ఆ స్తోమత ఉండాలి. ఇందుకు అందరి ఆమోదం కూడా ఉండాలి’’ అని అన్నారు.
గ్లోబల్ సౌత్ దేశాలపై భారం
‘‘అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిర, ఉద్రిక్త పరిస్థితుల దుష్ప్రభావాలు ఏ పాపం చేయని గ్లోబల్ సౌత్ దేశాలపై పడుతున్నాయి.
అందుకే మా సమస్యలు, ప్రాధాన్యాలను ఇలాంటి ప్రపంచ వేదిక సాక్షిగా చాటేందుకు భారత్ తన వంతు బాధ్యతగా ముందుకొచ్చింది. అందులో భాగంగానే
ఆఫ్రికాకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. గత ఏడాది జీ20 సారథిగా భారత్ ఆఫ్రికా యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం ఇప్పించినందుకు గర్వపడుతోంది. ఆఫ్రికా దేశాల ఆర్థిక, సామాజిక, భద్రత, సుస్థిరాభివృద్ధికి భారత్ తన వంతు సాయం అందిస్తోంది. ఇక మీదటా ఈ సాయం కొనసాగుతోంది’’ అని అన్నారు.
‘లైఫ్’ను పట్టించుకోండి
‘‘పర్యావరణహిత జీవితశైలి(ఎల్‌ఐ ఎఫ్‌ఈ– లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్)ని అలవర్చుకోండి. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత్‌లో ప్రారంభించిన ‘మట్టి మాతృమూర్తికోసం మొక్క’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటండి. అందరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా. ఈ ప్రజాఉద్యమాన్ని అంతర్జాతీయ బాధ్యతను భావించి ప్రపంచ దేశాలు మొక్కలు నాటే కార్య క్రమాన్ని విస్తృతం చేయాలి. మొక్కల పెంపకం భూమిపై పచ్చదనాన్ని పెంచుతుంది. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 2070 ఏడాదికల్లా కర్భన తటస్థత(కార్భన్ నెట్‌జీరో) సాధించేందుకు భారత్ శతథా కృషిచేస్తోంది. హరిత యుగం మళ్లీ సాకారమయ్యేలా మనందరి కలిసి కృషిచేద్దాం’’ అని మోదీ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment