బరీ(ఇటలీ): రోజురోజుకూ విశ్వవ్యాప్తంగా విస్తృతమవుతున్న కృత్రిమ మేధపై పోప్ ఫ్రాన్సిస్ ఒకింత ఆందోళన వ్యక్తంచేశారు. కృత్రిమ మేధ అభివృద్ధి, వినియోగంలో మనిషి గౌరవానికి భంగం కలుగకుండా చూసుకోవాలని జీ7 శిఖరాగ్ర సదస్సు వేదికగా పోప్ పిలుపునిచ్చారు. ఇంతటి అత్యాధునిక సాంకేతికతలు మితిమీరితే మానవ సంబంధాలు సైతం కృత్రిమంగా మారే ప్రమాదముందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
‘మానవ భవిష్యత్తుకు కృత్రిమ మేధ(ఏఐ) భరోసా, బెంగ’ అంశంపై పోప్ మాట్లాడారు. అంతర్జాతీయ సమావేశాలు, ప్రభుత్వాల విధానపర నిర్ణయాలు, కార్పొరేట్ బోర్డుల వంటి అంశాలే ఎజెండాగా సాగే జీ7 వంటి అగ్రస్థాయి కూటమి భేటీలో పోప్ మాట్లాడటం చరిత్రలో ఇదే తొలిసారికావడం విశేషం. ‘‘ ఏఐ అనేది మానవ కేంద్రీకృతంగా ఎదిగేలా రాజకీయ నేతలు ఓ కంట కనిపెట్టాలి.
మనుషులకు సంబంధించిన అంశాలపై నిర్ణయాలను మనుషులే తీసుకోవాలిగానీ మెషీన్లు కాదు. మెషీన్ల నిర్ణయాలపై ఆధారపడి, కనీసం మన జీవితాల గురించి కూడా సొంతంగా ఆలోచించలేని పరిస్థితిని మనం కోరుకోవద్దు’ అని అన్నారు. ఓపెన్‌ఏఐ వారి చాట్‌జీపీటీ చాట్‌బోట్ తరహా ఏఐ వినియోగం విస్తృతమవుతున్న తరుణంలో ఏఐకు పూర్తిగా దాసోహమవడంపై ప్రపంచదేశాలు, అంతర్జాతీయ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు.
భారత్‌లో పర్యటించండి: పోప్‌కు ఆహా్వనం
జీ7 సదస్సుకు విచ్చేసిన పోప్ ఫ్రాన్సిస్‌ను మోదీ కలిశారు. వీల్‌చైర్‌లో కూర్చున్న పోప్‌ను మోదీ ఆప్యాయంగా ఆలింగం చేసుకున్నారు. కొద్దిసేపు మాట్లాడారు. భారత్‌లో పర్యటించాలని పోప్‌ను మోదీ ఆహా్వనించారు.
Comments
Please login to add a commentAdd a comment