
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోనే అత్యంత దానగుణం కలిగిన వ్యక్తిగా పేరొందిన బిల్ గేట్స్(Bill Gates) భారతీయ యువతకు అమూల్యమైన సలహా అందించారు. ‘ప్రయాణాలు చేయండి.. మీకు ఉన్నటువంటి అవకాశాలను పొందలేనివారిని చూసి, పరిస్థితులను అర్థం చేసుకోండి’ అని బిల్‌గేట్స్ అన్నారు. ఈ మాటను అనుసరించే యువతీయువకులు వారి దృక్పథాన్ని విస్తృతం చేసుకుంటుంటారని, ప్రపంచంలోని విభిన్న జీవన పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారనే భావనతో బిల్‌గేట్స్ ఈ సూచన చేశారు.
భారతదేశంలోని యువతను ఉద్దేశిస్తూ బిల్‌గేట్స్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పినదాని ప్రకారం ప్రయాణం చేయడం ద్వారా యువత వివిధ సంస్కృతులను, ఆర్థిక పరిస్థితులు(Financial conditions), సామాజిక వాస్తవాలను దగ్గరగా చూడగలుగుతుంది. ఇది వారిలో సానుభూతి, అవగాహన, బాధ్యతను పెంపొందిస్తుందని బిల్‌గేట్స్ భావించారు. ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశమైన భారతదేశంలో యువతకు అవకాశాలు అసమానతలతో కూడి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అందుకే దానిని అర్థం చేసుకుంటే వారు జీవితంలో, సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి దోహదపడతారని ఆయన అభిప్రాయపడ్డారు.
గేట్స్ ఈ సందర్భంగా భారతదేశం(India)లో జరుగుతున్న వేగవంతమైన ఆర్థిక పురోగతి, సాంకేతిక అభివృద్ధిని ప్రశంసించారు. అయితే ఈ పురోగతి సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అందుబాటులో లేదని, యువత దానిని గుర్తించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రయాణాలు సాగించడం ద్వారా యువత తమకంటే తక్కువ అవకాశాలు కలిగిన వారి జీవితాలను చూసి, వారికి సహాయం చేయడానికి లేదా సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రేరణ పొందుతుందని బిల్‌గేట్స్ పేర్కొన్నారు.
గేట్స్ తరచూ విద్య, ఆరోగ్యంతో పాటు సమాజంలోని అసమానతలను తగ్గించడంపై దృష్టి సారిస్తుంటారు. భారతదేశంలోని యువత, దేశ భవిష్యత్తుకు కీలకమని, వారు సమాజంలోని సమస్యలను అర్థం చేసుకుని, వాటి పరిష్కారాల కోసం కృషి చేయాలని గేట్స్ సూచించారు. బిల్ గేట్స్ ఇచ్చిన ఈ సలహా భారతీయ యువత విజయం సాధించేందుకు, వారు సమాజంలోని ఇతరుల జీవన స్థితిగతులను అర్థం చేసుకునేందుకు దోహదపడుతుందనడంలో సందేహం లేదు.
ఇది కూడా చదవండి: తరచూ బీహార్‌కు రాహుల్.. మహాకూటమి ప్లాన్ ఏమైనా..