community development
-
G7 Summit 2024: టెక్నాలజీలో గుత్తాధిపత్యానికి తెరపడాలి
బరీ(ఇటలీ): సాంకేతికత అనేది కేవలం అతి కొద్ది సంస్థలు, దేశాల చేతుల్లో ఉండకూడదని, ఇలాంటి గుత్తాధిపత్యానికి తెరపడాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. ఇటలీలోని బోర్గో ఎగ్నాజియా రిసార్ట్‌లో జరుగుతున్న జీ7 దేశాల 50వ శిఖరాగ్ర సదస్సులో శుక్రవారం ప్రధాని మోదీ సాంకేతికత అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘ మనం వినూత్న టెక్నాలజీని సృష్టించాలేగానీ విధ్వంసకర సాంకేతికతను కాదు. సాంకేతికతో గుత్తాధిపత్యం పోవాలి. సాంకేతికతను ప్రజాస్వామ్యయుతంచేయాలి. అప్పుడే సమాజంలోని అన్ని వర్గాలకు దానిని చేరువ చేయగలం. సాంకేతికత ఫలాలు అందరికీ అందాలి. అప్పుడే సమ్మిళిత సమాజాభివృద్ధికి బాటలు వేసిన వారమవుతాం. మానవీయ విలువలున్న సాంకేతికత ద్వారా మెరుగైన భవిష్యత్తు కోసం భారత్ కలలు కంటోంది. కృత్రిమ మేథపై జాతీయ విధానాన్ని రూపొందించి అమలుచేస్తున్న అతి కొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ వ్యూహంలో భాగంగానే ఈ ఏడాది భారత్‌లో ‘ఏఐ మిషన్’కు అంకురార్పణ చేశాం. అందరికీ ఏఐ అనేది దీని మంత్రం. ‘గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఏఐ’లో వ్యవస్థాపక సభ్యునిగా, ఈ కూటమి ప్రస్తుత సారథిగా అన్ని దేశాల మధ్య సహకారాన్ని ఆశిస్తున్నా’’ అని మోదీ అన్నారు. ఏఐపై అంతర్జాతీయ నియమావళి ఉండాల్సిందే‘‘విస్తృతమవుతున్న ఏఐ రంగంపై అంతర్జాతీయంగా ఏకరూప నియమావళి ఉండాల్సిందే. గత ఏడాది ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులోనూ భారత్ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. భవిష్యత్తులోనూ పారదర్శక, స్వేచ్ఛా, సురక్షిత, సులభతర వినియోగ, భాధ్యతాయుత ఏఐ కోసం అన్ని దేశాలతో భారత్ కలిసి పనిచేస్తుంది. ఇంధనం పైనా భారత వైఖరి మారదు. ఇంధనం అందరికీ అందుబాటులో ఉండాలి. అందరూ వినియోగించుకోగలగాలి. అందరికీ ఆ స్తోమత ఉండాలి. ఇందుకు అందరి ఆమోదం కూడా ఉండాలి’’ అని అన్నారు.గ్లోబల్ సౌత్ దేశాలపై భారం‘‘అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిర, ఉద్రిక్త పరిస్థితుల దుష్ప్రభావాలు ఏ పాపం చేయని గ్లోబల్ సౌత్ దేశాలపై పడుతున్నాయి. అందుకే మా సమస్యలు, ప్రాధాన్యాలను ఇలాంటి ప్రపంచ వేదిక సాక్షిగా చాటేందుకు భారత్ తన వంతు బాధ్యతగా ముందుకొచ్చింది. అందులో భాగంగానే ఆఫ్రికాకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. గత ఏడాది జీ20 సారథిగా భారత్ ఆఫ్రికా యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం ఇప్పించినందుకు గర్వపడుతోంది. ఆఫ్రికా దేశాల ఆర్థిక, సామాజిక, భద్రత, సుస్థిరాభివృద్ధికి భారత్ తన వంతు సాయం అందిస్తోంది. ఇక మీదటా ఈ సాయం కొనసాగుతోంది’’ అని అన్నారు.‘లైఫ్’ను పట్టించుకోండి‘‘పర్యావరణహిత జీవితశైలి(ఎల్ఐ ఎఫ్ఈ– లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్)ని అలవర్చుకోండి. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత్‌లో ప్రారంభించిన ‘మట్టి మాతృమూర్తికోసం మొక్క’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటండి. అందరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా. ఈ ప్రజాఉద్యమాన్ని అంతర్జాతీయ బాధ్యతను భావించి ప్రపంచ దేశాలు మొక్కలు నాటే కార్య క్రమాన్ని విస్తృతం చేయాలి. మొక్కల పెంపకం భూమిపై పచ్చదనాన్ని పెంచుతుంది. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 2070 ఏడాదికల్లా కర్భన తటస్థత(కార్భన్ నెట్‌జీరో) సాధించేందుకు భారత్ శతథా కృషిచేస్తోంది. హరిత యుగం మళ్లీ సాకారమయ్యేలా మనందరి కలిసి కృషిచేద్దాం’’ అని మోదీ పిలుపునిచ్చారు. -
అలా చేయవచ్చా... అది అవమానం కదూ !!!
మన దేశం కష్టాల్లో ఉన్నప్పుడు సనాతన ధర్మానికి పూర్వ వైభవం తీసుకురావడంలో ఎనలేని కృషి చేసిన సమర్ధ రామదాసు గారు చెప్పిన మరో సూత్రం – జ్ఞాన సముపార్జన, ప్రచారం. ఇంట్లో మంచి మంచి చిత్తరువులు, మంచి పరుపులు, మంచి మంచాలు, కుర్చీలు, ఇతర అలంకార సామాగ్రి ఎలా ఉంచుకుంటామో... ప్రతి ఇంటా కూడా చదవదగిన పుస్తకాలు కొన్ని ఉండి తీరాలి. చదివిన పుస్తకాల మీద చర్చ కూడా జరుగుతుండాలి. ఇంటి పెద్ద ఒక మంచి పుస్తకం చదివి దానిలో తనకు నచ్చిన అంశాలు ఏ పేజీల్లో ఉన్నాయో ఆ పుస్తకం ముందుండే తెల్లకాగితంపై రాసి ఉంచాలి. పిల్లలు ఆ పుస్తకం తెరిచినప్పుడల్లా వాటిని చదివి పుస్తకంపట్ల ఆసక్తి పెంచుకుంటారు. చదివిన పుస్తకంపై కుటుంబ సభ్యులతో చర్చిస్తూండాలి. అప్పడు తీరికసమయాల్లో వాటిని చదవడానికి అందరికీ ప్రేరణ కలుగుతుంది. నిజానికి ఇంటి సంపద వృద్ధిలోకి రావాలన్నా, ఇంటి గౌరవం ఆచంద్రార్కం కొనసాగాలన్నా.. ఆ ఇంటి యజమాని ఎన్ని పుస్తకాలు చదివి, ఎన్ని పుస్తకాలగురించి అలా రాసి భద్రపరిచి ఉంచాడన్నది ముఖ్యం. అదే వారికి నిజమైన ఆస్తి. అదే తరువాత తరాలవారిలో స్ఫూర్తి రగిలిస్తుంది, వారినీ ఉత్తములుగా తీర్చిదిద్దుతుంది. పుస్తకాలు కొనడం పెద్ద కష్టమేమీ కాదు, పుస్తకాలు భద్రపరచడం భారం కూడా కాదు. ‘మా ఇంట్లో పుస్తకాలు చదివేవారు లేరండీ.. అని ఇచ్చేయడం ఆ కుటుంబానికి చాలా అవమానకరమైన విషయం. చదివే వాళ్ళు లేకపోవడమేమిటి! చదివేవాళ్ళు ఉండాలి. ప్రతివాళ్లూ పుస్తకాలు ఒక నియమంగా చదవాలి. ప్రతిరోజూ మనం ఎదుర్కొనే ఎన్నో సమస్యలనుంచి బయటపడడానికి అవి ఎంతగానో ఉపయోగ పడతాయి. అవి మనకు మనశ్శాంతినిస్తాయి. ఒక్క ఆధ్యాత్మిక పుస్తకాలే కాదు... మన జీవితాలను, మన పిల్లల జీవితాలను ఉద్ధరించడానికి ఇది పనికొస్తుంది–అని అనుకున్న ప్రతి పుస్తకం ఆ ఇంట తప్పనిసరిగా ఉండాలి. పుస్తకాలు లేని జ్ఞానాన్ని ఇస్తాయి, ఉన్న జ్ఞానాన్ని అనేక రెట్లు పెంచుతాయి. ఆ జ్ఞానాన్ని పదిమందితో పంచుకున్నప్పుడు అది మరింత పెరుగుతుందే కానీ తరిగేది కూడా కాదు. అందరూ వేదికలెక్కి ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు. కానీ కుటుంబ సభ్యులతో, ఇంటికొచ్చిన అతిథులతో, ఆత్మీయులతో జరిపే సమావేశాల్లో, విందులు, వినోదాల్లో కలిసిన సన్నిహితులతో వారు చదివిన మంచి పుస్తకాలపై చర్చ పెట్టాలి. అలాగే పిల్లలున్న ఇంటికి వెళ్ళినప్పుడు, ఇతరత్రా శుభకార్యాల్లో, దూరప్రయాణాలు వెళ్ళేవారికి మంచి మంచి పుస్తకాలు బహూకరించడం అలవాటు చేసుకోవాలి. వీలయితే ఆ పుస్తకాల ప్రాధాన్యతను, వాటిని ఎందుకు బహూకరిస్తున్నది వాటిపై రాసి సంతకం చేసి ఇస్తే... వారితో మీ బంధం మరింత గట్టిపడుతుంది. మీపట్ల వారికి, వారి కుటుంబానికి ఎనలేని గౌరవం ఏర్పడుతుంది. వారు కూడా వాటిని చదివి ఎంత ప్రభావితమవుతారో, ఎంత శాంతి పొందుతారో మాటల్లో చెప్పలేం. సమర్ధ రామదాసుగారి లాగా గురుస్థానాల్లో ఉన్న వారు ఇటువంటి విషయాలను ప్రబోధం చేయాలి, ప్రచారం చేయాలి... సమాజ అభ్యున్నతికి ఇది అవసరం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నాయకత్వ నిర్వచనం మారాలి!
భౌతిక దారుఢ్యం, ఆచరణాత్మకంగా ఉండటం వంటి వాటిని నాయకత్వ లక్షణాలుగా చూడడం వల్ల అనాదిగా పురుషులే నాయకత్వ స్థానాలలో కనిపిస్తున్నారు. కానీ మహిళలు నాయకత్వ బృందాలలో ఉన్నప్పుడు కరుణ వంటి లక్షణాలు కూడా ముఖ్యం అవుతున్నాయి. మహిళా నాయకత్వానికీ, సామాజిక సంక్షేమానికీ మధ్య ధనాత్మక సంబంధాన్ని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. 21వ శతాబ్దపు ఒక క్లిష్టమైన పోరాటం అందుబాటులో ఉన్న వనరులకూ, మానవ వైఖరులకూ మధ్య జరుగుతుంది. దీన్ని ఎదుర్కొనేందుకు బహుముఖ నాయకత్వం అవసరం. మెరుగైన సమాజం నిర్మించడం కోసం మహిళల విభిన్న అనుభవాలు, నైపుణ్యాలు ఎంతో అవసరం. ఏది నాయకి? 2030 నాటికి ప్రపంచం సాధించాల్సిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో లింగ సమానత్వాన్ని ఐదో లక్ష్యంగా నిర్ణయించి, దీన్ని సాధించడంలో మహిళల సమాన భాగ స్వామ్య అవసరాన్ని ఐకరాజ్య సమితి నొక్కి చెప్పింది. కానీ వాస్తవాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉండి, లింగ సమానత్వ లక్ష్యాన్ని ఎప్పటికి సాధించగలమనే ప్రశ్నను రేకెత్తిస్తునాయి. ప్రపంచవ్యాప్తంగా నిర్ణయాలు తీసుకొనే అనేక స్థానాలలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. 1 సెప్టెంబర్ 2021 నాటికి కేవలం 24 దేశా లలో మాత్రమే మహిళలు దేశ, ప్రభుత్వ అధిపతు లుగా ఉన్నారు. దీని ప్రకారం, అత్యున్నత అధికార స్థానాల్లో లింగ సమానత్వం మరో 130 సంవ త్సరాల వరకు కూడా సాధించలేము. ప్రపంచంలోని మూడు వంతుల పార్లమెంటరీ స్థానాలను పురుషులు కలిగి ఉండటం రాజకీయాల్లో పురుషుల ఆధిపత్యాన్ని సూచిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మంత్రులుగా 21 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. మహిళా వ్యవహారాల శాఖలకే సాధార ణంగా మహిళలు పరిమితం కావాల్సి వస్తోంది. మహిళా నాయకత్వానికీ, సామాజిక సంక్షే మానికీ మధ్య ధనాత్మక సంబంధాన్ని అనేక అధ్య యనాలు తెలియజేస్తున్నాయి. భారత్‌లో మహిళల నేతృత్వంలో ఉన్న పంచాయతీ ప్రాంతాల్లో తాగు నీటి ప్రాజెక్టుల సంఖ్య పురుషుల నేతృత్వంలోని పంచాయితీల కంటే 62 శాతం అధికంగా ఉన్నదనీ, మున్సిపల్ కౌన్సిళ్లలో మహిళల ప్రాతినిధ్యానికీ, పిల్లల సంరక్షణకీ మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్న దనీ సర్వేలు చెపుతున్నాయి. 21వ శతాబ్దపు ఒక క్లిష్టమైన పోరాటం అందుబాటులో ఉన్న వనరులకూ, మానవ వైఖరు లకూ మధ్య జరుగుతుంది. వాతావరణ మార్పు, ఆరోగ్యం, పర్యావరణ క్షీణత, సామాజిక అసమా నతలు మొదలైన సమస్యలను ఎదుర్కొనేందుకు బహుముఖ నాయకత్వం అవసరం. మెరుగైన సమాజం నిర్మించడం కోసం తీసుకొనే నిర్ణయా లలో మహిళల విభిన్న అనుభవాలు, నైపుణ్యాలు ఎంతో అవసరం. మహిళలకు సాధికారత చేకూర్చడానికి లింగ బడ్జెట్‌ను చాలా దేశాలు ఒక మార్గంగా ఎన్ను కున్నాయి. ఐఎంఎఫ్ ప్రకారం, ప్రపంచంలో 80 దేశాలు లింగ బడ్జెట్ విధానాన్ని అనుసరిస్తు న్నాయి. భారతదేశం కూడా 2006 నుండి లింగ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. మన లింగ బడ్జెట్లో సాధారణంగా రెండు రకాల పథకాలు గమనించ వచ్చు. మొదటిది, మహిళలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఖర్చు చేసే పథకాలు: ఉదాహరణకు బేటీ బచావో, బేటీ పఢావో. రెండవది పాక్షికంగా మహిళ లను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టినవి. ఇక్కడ పథక ప్రయోజనాలు కనీసం 30 శాతం మహిళలకు చేకూరుతాయి. అయితే రెండో కోవకు చెందిన పథ కాలే ఆధిపత్యంలో ఉంటున్నాయి. ఉదాహరణకు 2021 బడ్జెట్లో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బడ్జెట్ 16 శాతం పెరిగింది. కానీ ఈ మొత్తం బడ్జెట్లో 80 శాతం అంగన్ వాడీ, మిషన్ పోషణ్ 2.0 పథకాలకు కేటాయించడం జరిగింది. సమాన అవకాశాలను కల్పించగలిగే ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి నిర్ణయాత్మక స్థానాలలో మహిళల పాత్ర, ప్రాముఖ్యతలను గుర్తించడం కీలకం. మార్పు అనేది దానికదే స్వతంత్రంగా రాదు. సమాజంలో సమానత్వం సృష్టించే సద్గుణ చక్రాన్ని సాధించడానికి వ్యవస్థలు మారాలి. ఇప్పటివరకు ఈ ప్రపంచం ప్రధానంగా పురుషుల ఆలోచనలు, నాయకత్వంలో నడుస్తోంది. చారిత్రకంగా భౌతిక దారుఢ్యం, హేతుబద్ధత, ఆచరణాత్మకంగా ఉండడం వంటి వాటిని నాయకత్వ లక్షణాలుగా చూడడం వల్ల అనాదిగా పురుషులే నాయకత్వం స్థానాలలో కనిపిస్తున్నారు. నాయకత్వ నిర్వచనాన్ని మరింత బహుమితీయంగా మార్చి, నాయకత్వ లక్షణాలను విస్తృతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మారుతున్న ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి శారీరక బలాల మీద కాకుండా నైపుణ్యాలపై ఆధారపడి ఉంది. సహజంగా మహిళలు వ్యూహాత్మక దృష్టితో ఆలోచించే విధానం సమాజ నిర్మాణం కోసం ఉపయోగపడుతుంది. మహిళలు నాయకత్వ బృందాలలో ఉన్నప్పుడు కరుణ వంటి లక్షణాలు నాయకత్వంలో భాగం అవుతున్నాయి. గణపతిరాజు పావనీ దేవి వ్యాసకర్త ఆర్థిక శాస్త్ర లెక్చరర్ పితృస్వామ్యమే ముద్దాయి స్త్రీ అనగానే కేవలం సౌందర్య భావనతో ప్రాచీన కవులు ఎన్నో కావ్యాలలో రకరకాలుగా వర్ణించారు. మహిళ అనే పదం ఈ మహిలో చాలా గొప్పది. ఒక మహిళను చూసే కళ్ళలో, మనసులో మార్పు వచ్చి తీరాలి. తనకు జన్మ నిచ్చిన స్త్రీ జాతిని గౌరవించకపోగా రక రకాలుగా అవమానించడం అమానుషం. క్షమించరాని నేరం. స్త్రీల దైన్యస్థితికి అతి ముఖ్యమైన కారణం పితృస్వామ్య వ్యవస్థ. నిజానికి ఆదిమ సమాజంలో మాతృస్వామ్యం ఉండేది. స్త్రీ కేంద్రంగా సమాజం నడిచేది. కాలక్రమంలో స్త్రీలు ఉత్పత్తి పరికరాలకు దూరమ వడం, పురుషులు వాటిపై ఆధి పత్యం చలాయించడం, బానిస వ్యవస్థ, గుంపు పెళ్లి నుండి దంపతీ వివాహానికి వివాహ వ్యవస్థ పరిణామం చెందడం, వ్యక్తిగత ఆస్తి భావన పెరగడం, ఆయుధాల మీద పురు షుల ఆధిపత్యం వంటి అనేక కారణాల వల్ల స్త్రీ వెనక్కి నెట్టివేతకు గురై క్రమంగా పురుషాధిక్యత పాదుకు పోయింది. ఈ సంవత్సరం ‘ఆవిష్కరణ, సాంకేతికతల్లో లింగ సమానత్వం’ అంశాన్ని థీమ్‌గా మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఇది ఆహ్వానించదగినది. ఎందుకంటే... ‘ఐకాస’, ‘ఉమెన్స్ జెండర్స్ స్నాప్ షాట్– 2022’ నివేదిక ప్రకారం డిజిటల్ ప్రపంచంలో మహిళలు లేకపోవడం వల్ల గత పదేళ్లలో తక్కువ, మధ్య ఆదాయ దేశాల స్థూల జాతీయ ఉత్పత్తి తగ్గింది. ఈ విషయంలో ఏమీ చేయలేక పోయినట్లయితే ఈ నష్టం 2025 నాటికి ఇంకా పెరుగుతుంది. స్త్రీలు విద్యావంతులు కానంత వరకూ ఏ దేశమూ బాగుపడదు. మన అభివృద్ధి అంతా స్త్రీల అభివృద్ధిపైనే ఆధారపడి ఉన్నది. అయితే పురుషులతో సమానంగా ఉద్యోగం చేస్తున్నా... భారతీయ సమాజంలో ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకం స్త్రీ బాధ్యత కాబట్టి ఆమెపై ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అన్ని విధులనూ మహిళ అత్యంత చాకచక్యంగా నిర్వర్తిస్తోంది. స్వప్న కొండ వ్యాసకర్త తెలుగు ఉపాధ్యాయురాలు అపర కాళీమాత కూడా... స్త్రీ ప్రకృతికి ప్రతీక. అందానికే నిర్వచనం. ఇంటికి దీపం. అమృతాన్ని వర్షించే అమ్మగా, అనునయించే అక్కగా, అనురాగాన్ని పంచే చెల్లిగా, ఆత్మీయతను కురిపించే భార్యగా ఆమె ఒక కుటుంబానికి ఎంత సుపరిచితురాలో... ఒక టీచరుగా, డాక్టరుగా, పోలీస్ ఆఫీసరుగా, పైలెట్‌గా, రైతుగా, కూలీగా, ఇంటిపనులు చేసే మనిషిగా... ఇలా అన్ని హోదాలలో కూడా సమాజానికి అంతే సుపరిచితురాలు. భారతీయ సంస్కృతిలో స్త్రీలకు సముచిత స్థానాన్నే అందించారు. మనం నిత్యం ఆరాధించే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలైన అమ్మవార్లు కూడా స్త్రీలే కదా. స్త్రీని ఒక దేవతలా చూడడం, ఆమెను జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది అనాదిగా మన రక్తంలోనే జీర్ణించుకుపోయింది. అయితే నేడు ఈ జాగ్రత్తనే కొన్ని సందర్భాలలో అతియై ఆడపిల్లల స్వేచ్ఛకు ఆటంకంగా మారు తోంది. సమాజంలోని కొన్ని దుస్సంఘటనలకు వెరసి ఇంట్లోవాళ్ళు విధించే ఆంక్షలు ఆడపిల్లల అభివృద్ధికి అవరోధాలుగా పరిణమించడంతో పాటు, పిల్లలకూ తల్లిదండ్రులకూ మధ్య అగా థాలను సృష్టిస్తున్నాయి. ప్రతి పరిణామం ఇంటి నుండే మొద లవ్వాలి. ఆది గురువులై అమ్మలు మంచి చెడుల వివేచన జ్ఞానాన్ని తమ పిల్లలకు రంగరించి ఎటువంటి ఆటుపోట్లనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని అలవరచాలి. భర్త అడుగుజాడల్లో నడిచిన సీతగా, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సావిత్రిగా, యుద్ధభూమిలో తోడు నిలిచిన సత్య భామగా, బుద్ధి కుశలతతో త్రిమూర్తులనే పసిబిడ్డలను చేసి లాలించిన అనసూయగా ఉంటూనే, అవసరమైతే ఇంతులు అపర కాళీ మాతలవ్వాలి. సమాజాభివృద్ధికి హేతువయ్యే ప్రతి పాత్రను సంపూర్ణంగా పండించాలి. – డా‘‘ బి. నీలిమా కృష్ణమూర్తి సహాయ కార్మిక అధికారి -
సామాజిక వ్యాప్తి మొదలైంది: ఐఎంఏ
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 పరిస్థితి తీవ్రంగా ఉందనీ, కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెలిపింది. ‘దేశంలో ప్రతి రోజూ 30వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ముఖ్యంగా ఈ వైరస్ గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. ఇది సామాజిక వ్యాప్తికి సంకేతం’అని ఐఎంఏ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ వీకే మోంగా అన్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్‌ను అదుపు చేయడం చాలా కష్టమైన విషయమన్నారు. (సామాజిక వ్యాప్తి మొదలైంది: ఐఎంఏ) దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలు కాలేదంటూ కేంద్రం చెబుతున్న నేపథ్యంలో ఐఎంఏ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతానికి ఢిల్లీలో కట్టడి చేసినా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితి మాటేమిటి? అని ఆయన అన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర సాయం తీసుకుని పరిస్థితిని నియంత్రించాలన్నారు. ‘వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరల్ వ్యాధిని కట్టడి చేయడానికి రెండే మార్గాలున్నాయి. ఒకటి, ఈ వ్యాధి సోకిన 70 శాతం మంది రోగ నిరోధకశక్తిని పెంచుకోవడం, రెండోది, మిగతా 30 శాతం మందికి రోగ నిరోధక శక్తిని కల్పించడం’అని డాక్టర్ మోంగా తెలిపారు. (కరోనా చికిత్సల్లో రోబో) -
సమాజాభివృద్ధే జేసీఐ లక్ష్యం
తిరుపతి (అలిపిరి) : సమాజ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు జూనియర్ చాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ (జేసీఐ) జాతీయ అధ్యక్షుడు అర్పిత్ హతి పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో మంగళవారం ఆయన అధికారిక పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్పిత్హతి మాట్లాడుతూ దేశంలో మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం ఇంపాక్ట్ 2020–30 కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. దేశంలో వెయ్యికి పైగా జేసీఐ శాఖల ద్వారా విద్య, ఉపాధి, ఆరోగ్యం, పారిశుధ్యం, పకృతి పరిరక్షణ వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు శిక్షణా కార్యక్రమాలపై దృష్టి సారించామన్నారు. అనంతరం జేసీఐ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో 32 మందికి స్కాలర్షిప్లను అందజేశారు. కార్యక్రమంలో తిరుపతి శాఖ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, మణిసందీప్, మనోహర్, వెంకటరమణ, నాగేశ్వరరావు, అనుపమ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ సబ్-ప్లాన్‌పై అధ్యయనం
చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన బీసీ వెల్ఫేర్ కమిటీ హైదరాబాద్: రాష్ట్రంలో వెనుకబడిన కులాల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపడుతున్న పథకాల అమలును అసెంబ్లీ బీసీ వెల్ఫేర్ కమిటీ సమీక్షించింది. ఈమేరకు కమిటీ చైర్మన్ , ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ అధ్యక్షతన బుధవారం అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశం జరిగింది. పొరుగు రాష్ట్రమైన ఏపీలో బీసీల కోసం తీసుకు వచ్చిన బీసీ సబ్-ప్లాన్‌పై అధ్యయనం చేసేందుకు ఈ కమిటీ చిత్తూరు జిల్లాకు వెళ్లాలని నిర్ణయించింది. బుధవారం రాత్రి బయలుదేరిన ఈ కమిటీ శుక్రవారం ఆ జిల్లాలో పర్యటించనుంది. కాగా పీయూసీ హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డును పరిశీలించింది. క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా పీయూసీ చైర్మన్ దివాకర్‌రావు సారథ్యంలో ఈ కమిటీ బుధవారం రింగురోడ్డు పనుల్లో జరిగిన అవకతవకలను పరిశీలించింది. నిర్మాణ పనుల్లో రూ.9కోట్లు దుర్వినియోగం జరిగినట్లు కాగ్ గుర్తించిం దని, ఈ మేరకు విజిలెన్సు విచారణ జరిపించి దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అలాగే అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ హన్మంత్ షిండే నేతృత్వంలో క్షేత్ర స్థాయి పర్యటన జరిపింది. మరో వైపు అసెంబ్లీ మహిళా శిశు సంక్షేమ కమిటీ చైర్పర్సన్ రేఖా నాయక్ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమైంది. మహిళలు, శిశువుల కోసం అమలు చేస్తున్న పథకాల అమలు తీరును సమీక్షించింది. -
విద్య సమాజాభివృద్ధికి మూలం
తిరుపతి సిటీ: సమాజాభివృద్ధికి విద్య మూలమని తమిళనాడు గవర్నర్ రోశయ్య అన్నారు. తిరుపతిలో కేంద్రీయ విద్యాలయం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం గోల్డెన్ జుబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా తమిళనాడు గవర్నర్ రోశయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అలవర్చుకున్నప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోగలరన్నారు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన జరగాలని, అప్పుడే విద్యార్థులకు జ్ఞానాభివృద్ధి పెంపొంది, సమాజాభివృద్ధికి పాటుపడగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్నతికి సోపానం కేంద్రీయ విద్యాలయమని, అపారవిజ్ఞానంతో తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేందుకు కేంద్రీయ విద్యాలయం చక్కటి సోపానమన్నారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ రావు మాట్లాడుతూ తన ఇద్దరు పిల్లలు ఇక్కడే చదివి, వైద్యులుగా స్థిరపడ్డారన్నారు. కేంద్రీయ విద్యాలయం నుంచి ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, పలు రంగాల్లో ఉన్నతస్థాయిలో స్థిరపడ్డారని చెప్పారు. కేంద్రీయ విద్యాలయం అభివృద్ధికి పూర్తి సహాయసహకారాలు అందిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ తాను కూడా ఈ స్కూల్ పూర్వవిద్యార్థినని గుర్తు చేసుకున్నారు. స్కూల్ అభివృద్ధికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు తనవంతు కృషి చేస్తానన్నారు. పూర్వపు విద్యార్థులందరూ కలవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. పూర్వ విద్యార్థులందరూ కలసి స్కూల్ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేసి, రాబోయే రోజుల్లో అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని పలువురు పూర్వ విద్యార్థులు అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సతీష్‌కుమార్, డెప్యూటీ కమిషనర్ మణివన్నన్, పూర్వ విద్యార్థుల సంఘం నేత వెంకటరమణ, స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, పూర్వవిద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
తేలనున్న ‘ఇంటి’గుట్టు
జేఎన్‌ఎన్‌ఆర్‌యూఎం ఇళ్ల కేటాయింపుపై కమిటీ రెవెన్యూ..యూసీడీ సంయుక్త సర్వే సంక్రాంతిలోగా అందజేయనున్న నివేదిక బినామీలలో మొదలైన కలవరం విశాఖపట్నం సిటీ : అవకతవకలమయమైన జేఎన్‌ఎన్‌ఆర్‌యూఎం ఇళ్ల కేటాయింపుపై అధికారులు దృష్టి సారించారు. మహా విశాఖలో జేఎన్ఎన్యూఆర్ఎం కింద నిర్మితమైన గృహాల వ్యవహారం నిగ్గుతేల్చాలని తాజాగా సంకల్పించారు. అనర్హులే ఎక్కువగా ఉన్నారనే ఫిర్యాదులు అందడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే కోర్టుల నుంచి మొట్టికాయలు వేయించుకున్న మహా నగర పాలక సంస్థ నివేదికల్లో వాస్తవాలను బయటపెట్టేందుకు రెవెన్యూ యంత్రాంగం సైతం కదిలింది. దీనిలో భాగంగా అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అధికారులు, రెవెన్యూ బృందాలు సంయుక్తంగా సర్వే చేసి అర్హుల నిగ్గు తేల్చేందుకు నడుం బిగించాయి. అసంపూర్తిగా ఎన్ని ఇళ్లు వున్నాయి... కేటాయింపు జరిగిన గృహాల్లో ఎవరెవరు ఉంటున్నారు...ఉంటున్న వారు అర్హులా..కాదా...రిజర్వుడు కేటగిరీల కింద ఎంత మంది ఉంటున్నారు... ఆక్రమించిన వారికి ఎవరెవరు సిఫార్సు చేశారు... బినామీల పేర్లతో ఎవరెవరు ఎన్ని ఇళ్లు ఆక్రమించారు తదితర అంశాలపై రెవెన్యూ వారు నిగ్గు తేల్చనున్నారు. ఇందుకు 33 బృందాలను ఏర్పాటు చేశారు. బృందంలో ముగ్గురు నలుగురు చొప్పున అధికారులుంటారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ బృందాలు సర్వే చేపట్టనున్నాయి. సంక్రాంతి లోగా వీరిచ్చే నివేదిక ఆధారంగానే అర్హులను గుర్తించి, వారికి అన్ని సదుపాయాలు కల్పించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేయనుంది. 14,203 ఇళ్లు నిర్మాణం విశాఖ అర్బన్‌లో జేఎన్ఎన్యూఆర్ఎం హౌసింగ్ ప్రాజెక్టును 2006లో ప్రారంభించినా 2008 వరకూ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మాత్రమే పర్యవేక్షించేది. ఆ తర్వాత నుంచీ జీవీఎంసీకి ప్రభుత్వం అప్పగించింది. అప్పటి నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టి 15,320 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే స్థల వివాదాలు, కోర్టు వ్యాజ్యాలు వల్ల 14,203 ఇళ్లను మాత్రమే 38 లే అవుట్లలో నిర్మించారు. ఇందులో 12,947 ఇళ్లకు కేటాయింపు చేశారు. ఇంకా 1,256 ఇళ్లు మాత్రమే అధికారికంగా ఖాళీ వున్నట్టు లెక్కలేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితికొచ్చేసరికి 5 వేలకు పైగా ఇళ్లు ఖాళీగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ బినామీలే. రాజకీయ నేతల అనుయాయులు తాళాలు వేసి తమ వారి కోసం సిద్ధంగా ఉంచుకున్నారు. గతంలోనే అప్పటి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులే ఎక్కువ ఇళ్లను స్వాహా చేసినట్టు అధికారులు లెక్కలేస్తున్నారు. అప్పటి ఎమ్మెల్యే, మంత్రుల అనుచరులు కాజేయడంతో ఇప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలకు జీవీఎంసీ అధికారులపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. గతంలో స్వాహా చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారంటే తమ పరిస్థితి ఏంటని మల్లగుల్లాలు పడుతున్నారు. మొత్తానికి ఆ ఇళ్లల్లో ఎవరెవరు ఉంటున్నారనేదానిపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అన్నీ సమస్యలే..! జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి రూ. 300 కోట్లు రావాల్సి వుంది. ఆ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో వుండిపోయాయి. అక్కడి నుంచి ఆ మొత్తం తెచ్చుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఇదంతా ఇప్పట్లో అయ్యే పని కాదని తేలడంతో ఇంజనీరింగ్ అధికారులు పనులకు ఫుల్స్టాప్ పెట్టారు. ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, నీటి సదుపాయాల్లేవు. అందుకే ఇళ్ల కేటాయింపులు జరిగినా మెజార్టీ ఇళ్లు తాళాలు వేసే ఉన్నాయి. అర్హుల గుర్తింపు ఇలా..! జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు కేటాయించేందుకు అర్హులను ఇలా గుర్తించాలంటూ ప్రభుత్వం మార్గ దర్శకాలు జారీ చేసింది. మొత్తం ఇళ్లల్లో ఎస్సీలకు 16శాతం, ఎస్టీలకు 6 శాతం, మైనార్టీలకు 5 శాతం ఇళ్లను కేటాయించాలని సూచించింది. మిగిలిన ఇళ్లల్లో రహదారుల విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి, గెడ్డలు, కెనాల్స్‌పై ఉంటున్న వారికి, కొండ ప్రాంతాల్లో వారికి, రైల్వే,డిఫెన్స్, పోర్టు స్థలాల్లో అనధికారికంగా ఉంటున్న వారికి ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఇళ్లు కాలిపోయిన వారికి, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లోని బాధితులు, వికలాంగులు, హెచ్ఐవీ బాధితులకు, అనాథలకు నిబంధనల మేరకు ఇళ్లు కేటాయింపులు చేయాలని సూచించారు. జరుగుతుందిలా..! రాజకీయ నేతలు సిఫార్సు చేసిన వారికి, మంత్రులు, ఎమ్మెల్యేల అనుయాయులకు కేటాయింపులు చేస్తున్నారు. జీవీఎంసీలోని మాజీ కార్పొరేటర్లకు, రాజకీయ పార్టీల్లోని ముఖ్య నేతల అనుయాయులకు, వాళ్ల ఇళ్లల్లో పనిచేసే వారికి మాత్రమే ఇస్తున్నారు. అధికారిక పార్టీల వార్డు అధ్యక్షులు రూపొం దించే నివేదికలకే పచ్చజెండా చూపుతున్నారు. జన్మభూమి కమిటీలు జోక్యం పెరిగిపోవడంతో వార్డు నేతల చుట్టూ ఇళ్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. ఓడీఏ బెటర్..! విశాఖలో ఓడీఏ పేరుతో పలు మురికివాడలను నిర్మించి అభివృద్ధి చేసిన ఘనత ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్‌దే. ఎలాంటి అభివృద్ధి లేని సమయంలో ఆరిలోవలో 10 సెక్టార్లను అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఆరిలోవలో ఎలాం టి సదుపాయాలున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు నిర్మిస్తున్న జేఎన్ఎన్యుఆర్ఎం ఇళ్లల్లో అలాంటి సదుపాయాలున్నాయో లేదో అధికారులకే తెలియాలి. సదుపాయాలు లేని ఇళ్లు ఇవే..! చాలా ఇళ్లల్లో కనీస సదుపాయాలు కల్పించేందుకు నగర పాలక సంస్థ మీనమేషాలు లెక్కిస్తోంది. ఇళ్లు కట్టేశామంటూ గొప్పలు చెప్పే ఇంజినీరింగ్ శాఖ అక్కడ కనీస సదుపాయాలున్నాయో లేదో చూడడం లేదు. వేలాది గృహ సముదాయాలను రూ. కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నా కనీస అవసరాలు తీర్చే నీటి, విద్యుత్ సదుపాయాలు కల్పించడంలో విఫలమైంది. ఈ ఇళ్ల వద్ద కమ్యూనిటీ కేంద్రాలు, దుకాణ సముదాయాలు, పాఠశాల, అంగన్వాడీ భవనం, డిస్పెన్సరీ, పై అంతస్తులోని వారికి నీరు వెళ్లేందుకు అవసరమైన మోటార్లు, ట్యాంకులు ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. స్థానికంగానే ఉపాధికి అవసరమైన పరిశ్రమలు ఏర్పాటు చేస్తే తప్పా అక్కడ ప్రజలు నివాసముండలేరని అధికారులే చెబుతున్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లు పరదేశిపాలెం-1లో 927 బక్కన్నపాలెం-2లో 512 కొమ్మాది-2లో 890 సింహాచలం దరి అప్పన్న పాలెంలో 480 పెందుర్తి దరి 1472 తాగునీటికి ఇబ్బందులు మాది నిరుపేద కుటుం బం. ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తాదంటే దరఖాస్తు చేసుకున్నాం. ఇక్కడ ఓ ఇంటిని కేటాయించారు. కనీసం తాగేందుకు నీరు కూడా అందించడంలేదు. పిల్లాపాపలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. - టి.లక్ష్మి వెళ్లాలంటే నరకమే ఇళ్లు కేటాయించిన అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కనీసం రోడ్లు కూడా సక్రమంగా నిర్మించలేదు. ఇక్కడికి రావాలంటే నరకం చూడాల్సిందే. - ఎం. నాగేశ్వరరావు విద్యుత్ సదుపాయం లేదు మా నివాసాలకు విద్యుత్ సదుపాయం లేదు. రాత్రి సమయాల్లో చాలా భయంగా ఉంటుంది. కాలువలు, నీటి సదుపాయం లేదు. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. - టి. సత్యవతి -
ప్రగతిపై లాయర్లు దృష్టి సారించాలి
విశాఖపట్నం: న్యాయవాదులు తమ వ్యక్తిగత అభ్యున్నతితో పాటు సమాజ ప్రగతిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ చెప్పారు. విశాఖలోని ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో ఏయూ న్యాయ కళాశాల, విశాఖ న్యాయవాదుల సంఘం సంయుక్తంగా ‘ఎమర్జింగ్ ఇష్యూస్ రిలేటింగ్ టు ట్రయల్స్ ఇన్ సివిల్ అండ్ క్రిమినల్ మేటర్స్’ అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాది సమాజంలో ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తున్నాడన్నారు. నేటి ఆధునిక సమాజంలో వారి బాధ్యత, పరిధి విస్తృతమన్నారు. దేశంలో అవిద్య, పేదరికం,అసమానతలు వంటి అనేక సమస్యలు ప్రగతికి అవరోధాలుగా నిలుస్తున్నాయన్నారు. సమాజానికి ఒక మార్గదర్శకుడు కావలసిన అవసరం ఉందన్నారు. సామాజిక ప్రగతిపై న్యాయవాదులు దృష్టిపెట్టాలని సూచించారు. యువ న్యాయవాదులను ఈ దిశగా నడిపించడానికి కృషి చేయాలని లేని పక్షంలో సమాజం ఇబ్బందుల్లో పడుతుందని చెప్పారు. చట్టం స్వేచ్చను పరిరక్షించినపుడే ప్రజాస్వామం నిలబడుతుందన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య మాట్లాడుతూ చట్టాలు పుస్తకాలకు మాత్రమే పరిమితమై న్యాయం లభించని పక్షంలో వ్యవస్థ పతనమవుతుందని చెప్పారు. వ్యాజ్యాలను జటిలం చేయాలనే ఆలోచనను న్యాయవాదులు విడనాడాలని సూచించారు. ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు, ఏయూ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డి.సూర్యప్రకాషరావు, విశాఖ న్యాయవాదుల సంఘం అద్యక్షుడు ఎన్.వి.బదరీనాథ్ ప్రసంగించారు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచించిన ఆరుసారాకథలు పుస్తకాన్ని జస్టిస్ ఎన్.వి రమణ ఆవిష్కరించి ఆర్.వి.శాస్త్రి కుటుంబ సభ్యులకు తొలి ప్రతిని అందజేశారు. జిల్లా జడ్జి వి.జయసూర్య, న్యాయవాదుల సంఘం కార్యదర్శి ఎన్.సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు. -
దొంగ లెక్కలతో బొక్కేశారు
=ఉపకార వేతనాలు స్వాహా =పని చేయకపోయినా కూలి చెల్లింపు =మరణించిన వారి పేరిట పింఛన్లు =యలమంచిలి మండలంలో అక్రమాలు =గ్రామసభల్లో నిలదీసిన ప్రజలు ఉపకార వేతనాలు ఇవ్వకుండా... ఇచ్చేసినట్టు రాసుకున్నారు. ఉపాధి పనులకు రానివారికీ కూలి చెల్లించారు. చనిపోయిన వారి పేర్లతో పింఛన్లు తీసేసుకున్నారు. గోతుల్ని చెత్తాచెదారంతో పూడ్చేసి డబ్బు కాజేశారు. ఏ గ్రామంలో విన్నా ఇవే అక్రమాలు. ఏ గ్రామసభకెళ్లినా వెల్లడవుతున్న నిజాలు. కమ్యూనిటీ అసిస్టెంట్లు, వాలంటీర్ల అవినీతికి నిదర్శనాలు. యలమంచిలి మండలంలో ఉపాధి పనులు, ఉపకార వేతనాల పంపిణీలో అక్రమాలపై గురువారం జరిగిన గ్రామసభల్లో గ్రామస్తులు తీవ్రంగా మం డిపడ్డారు. యలమంచిలి రూరల్, న్యూస్‌లైన్ : కొక్కిరాపల్లి, సోమలింగపాలెం, ఏటికొప్పాక, లైనుకొత్తూరు తదితర గ్రామాల్లో గురువారం గ్రామ సభలు నిర్వహించారు. కొక్కిరాపల్లి గ్రామంలో 15 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లించినట్లు గ్రామసభల్లో వెల్లడించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కమ్యూనిటీ అసిస్టెంట్ (సీఏ) సరస్వతి, కమ్యూనిటీ వాలంటీర్ (సీవీ) గోపి బుజ్జిపై విరుచుకుపడ్డారు. గ్రామానికి చెందిన విద్యార్థులు కె.భాస్కరరావు, టి.దుర్గాభవానీలకు రూ.1200 చొప్పున ఉపకార వేతనం ఇవ్వకుండానే ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. కె.బేబీసాయికి ఇంటర్ మొదటి సంవత్సరంలో రూ.1200కు రూ.1000 ఇచ్చారని, రెండో సంవత్సరంలో ఉపకార వేతనం ఇవ్వకుండా దొంగ సంతకం చేసి డబ్బు కాజేశారు. మరో విద్యార్థిని గండిబోయిన జ్యోతికి 10వ తరగతిలో రూ.1200 ఇచ్చి రూ.600 తిరిగి తీసుకున్నారని, ఇంటర్మీడియట్ మొదటి, రెండేళ్లలో ఉపకార వేతనం ఇవ్వకుండానే ఇచ్చినట్లు నమోదు చేశారు. గ్రామానికి చెందిన 15 మంది విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీలో అవకతవకలు జరిగాయి. కమ్యూనిటీ అసిస్టెంట్ సరస్వతి 2012 సెప్టెంబర్ 5వ తేదీ వేసిన చెక్కును గురువారం ఇంటర్ విద్యార్థి సీహెచ్.రాముకు ఇచ్చారని, ఆ విషయం బయటపడుతుందన్న భయంతో గ్రామసభకు రావద్దని హెచ్చరించారన్నారు. చనిపోయిన వ్యక్తుల పేరిట పింఛన్లు పంపిణీ చేశారని ఆరోపించారు. లైనుకొత్తూరు గ్రామంలో 20 మంది పనికి రాకపోయిన ఉపాధి కూలీ చెల్లించారని ఉపాధి కూలీలు ఫిర్యాదు చేశారు. లైనుకొత్తూరు వద్ద గొయ్యిని పూడ్చేందుకు రూ.1.56 లక్షలు నిధులు కాజేసి వ్యర్ధ పదార్థాలతో కప్పారన్నారు. మర్రిబంద గ్రామంలో సామాజిక భవనం పక్కనే ఉన్న గొయ్యిని కప్పేందుకు కేవలం రూ.6 వేలు వెచ్చించి, రూ.96 వేలు కాజేశారు. పులపర్తి గ్రామంలో ఉపాధి పనుల్లో ట్రాక్టర్ వినియోగించకుండానే నిధులు కాజేస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. ట్రాక్టర్‌కు రూ.242 చెల్లించాల్సి ఉండగా రూ.130 ఇచ్చారని పలువురు ట్రాక్టర్ యజమానులు ఫిర్యాదు చేశారు. గ్రామసభలు జరిగిన ఏటికొప్పాక, సోమలింగపాలెం తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.