నాయకత్వ నిర్వచనం మారాలి! | Sakshi Guest Column On International Womens Day | Sakshi
Sakshi News home page

నాయకత్వ నిర్వచనం మారాలి!

Published Wed, Mar 8 2023 12:51 AM | Last Updated on Wed, Mar 8 2023 12:51 AM

Sakshi Guest Column On International Womens Day

భౌతిక దారుఢ్యం, ఆచరణాత్మకంగా ఉండటం వంటి వాటిని నాయకత్వ లక్షణాలుగా చూడడం వల్ల అనాదిగా పురుషులే నాయకత్వ స్థానాలలో కనిపిస్తున్నారు. కానీ మహిళలు నాయకత్వ బృందాలలో ఉన్నప్పుడు కరుణ వంటి లక్షణాలు కూడా ముఖ్యం అవుతున్నాయి. మహిళా నాయకత్వానికీ, సామాజిక సంక్షేమానికీ మధ్య ధనాత్మక సంబంధాన్ని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. 21వ శతాబ్దపు ఒక క్లిష్టమైన పోరాటం అందుబాటులో ఉన్న వనరులకూ, మానవ వైఖరులకూ మధ్య జరుగుతుంది. దీన్ని ఎదుర్కొనేందుకు బహుముఖ నాయకత్వం అవసరం. మెరుగైన సమాజం నిర్మించడం కోసం మహిళల విభిన్న అనుభవాలు, నైపుణ్యాలు ఎంతో అవసరం.

ఏది నాయకి?
2030 నాటికి ప్రపంచం సాధించాల్సిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో లింగ సమానత్వాన్ని ఐదో లక్ష్యంగా నిర్ణయించి, దీన్ని సాధించడంలో మహిళల సమాన భాగ స్వామ్య అవసరాన్ని ఐకరాజ్య సమితి నొక్కి చెప్పింది. కానీ వాస్తవాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉండి, లింగ సమానత్వ లక్ష్యాన్ని  ఎప్పటికి సాధించగలమనే ప్రశ్నను రేకెత్తిస్తునాయి. 

ప్రపంచవ్యాప్తంగా నిర్ణయాలు తీసుకొనే అనేక స్థానాలలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. 1 సెప్టెంబర్‌ 2021 నాటికి కేవలం 24 దేశా లలో మాత్రమే మహిళలు దేశ, ప్రభుత్వ అధిపతు లుగా ఉన్నారు. దీని ప్రకారం, అత్యున్నత అధికార స్థానాల్లో లింగ సమానత్వం మరో 130 సంవ త్సరాల వరకు కూడా సాధించలేము.

ప్రపంచంలోని మూడు వంతుల పార్లమెంటరీ స్థానాలను పురుషులు కలిగి ఉండటం రాజకీయాల్లో పురుషుల ఆధిపత్యాన్ని సూచిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మంత్రులుగా 21 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. మహిళా వ్యవహారాల శాఖలకే సాధార ణంగా మహిళలు పరిమితం కావాల్సి వస్తోంది.

మహిళా నాయకత్వానికీ, సామాజిక సంక్షే మానికీ మధ్య ధనాత్మక సంబంధాన్ని అనేక అధ్య యనాలు తెలియజేస్తున్నాయి. భారత్‌లో మహిళల నేతృత్వంలో ఉన్న పంచాయతీ ప్రాంతాల్లో తాగు నీటి ప్రాజెక్టుల సంఖ్య పురుషుల నేతృత్వంలోని పంచాయితీల కంటే 62 శాతం అధికంగా ఉన్నదనీ, మున్సిపల్‌ కౌన్సిళ్లలో మహిళల ప్రాతినిధ్యానికీ, పిల్లల సంరక్షణకీ మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్న దనీ సర్వేలు చెపుతున్నాయి. 

21వ శతాబ్దపు ఒక క్లిష్టమైన పోరాటం 
అందుబాటులో ఉన్న వనరులకూ, మానవ వైఖరు లకూ మధ్య జరుగుతుంది. వాతావరణ మార్పు, ఆరోగ్యం,  పర్యావరణ క్షీణత, సామాజిక అసమా నతలు మొదలైన సమస్యలను ఎదుర్కొనేందుకు బహుముఖ నాయకత్వం అవసరం. మెరుగైన సమాజం నిర్మించడం కోసం తీసుకొనే నిర్ణయా లలో మహిళల విభిన్న అనుభవాలు, నైపుణ్యాలు ఎంతో అవసరం.

మహిళలకు సాధికారత చేకూర్చడానికి లింగ బడ్జెట్‌ను చాలా దేశాలు ఒక మార్గంగా ఎన్ను కున్నాయి. ఐఎంఎఫ్‌ ప్రకారం, ప్రపంచంలో 80 దేశాలు లింగ బడ్జెట్‌ విధానాన్ని అనుసరిస్తు న్నాయి. భారతదేశం కూడా 2006 నుండి లింగ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. మన లింగ బడ్జెట్‌లో సాధారణంగా రెండు రకాల పథకాలు గమనించ వచ్చు. మొదటిది, మహిళలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఖర్చు చేసే పథకాలు: ఉదాహరణకు బేటీ బచావో, బేటీ పఢావో. రెండవది పాక్షికంగా మహిళ లను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టినవి.

ఇక్కడ పథక ప్రయోజనాలు కనీసం 30 శాతం మహిళలకు చేకూరుతాయి. అయితే రెండో కోవకు చెందిన పథ కాలే ఆధిపత్యంలో ఉంటున్నాయి. ఉదాహరణకు 2021 బడ్జెట్‌లో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బడ్జెట్‌ 16 శాతం పెరిగింది. కానీ ఈ మొత్తం బడ్జెట్‌లో 80 శాతం అంగన్ వాడీ, మిషన్‌ పోషణ్‌ 2.0 పథకాలకు కేటాయించడం జరిగింది. 

సమాన అవకాశాలను కల్పించగలిగే ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి  నిర్ణయాత్మక స్థానాలలో మహిళల పాత్ర, ప్రాముఖ్యతలను గుర్తించడం కీలకం. మార్పు అనేది దానికదే స్వతంత్రంగా రాదు. సమాజంలో సమానత్వం సృష్టించే సద్గుణ చక్రాన్ని సాధించడానికి వ్యవస్థలు మారాలి. 

ఇప్పటివరకు ఈ ప్రపంచం ప్రధానంగా పురుషుల ఆలోచనలు, నాయకత్వంలో నడుస్తోంది. చారిత్రకంగా భౌతిక దారుఢ్యం, హేతుబద్ధత,  ఆచరణాత్మకంగా ఉండడం వంటి వాటిని నాయకత్వ లక్షణాలుగా చూడడం వల్ల అనాదిగా పురుషులే నాయకత్వం స్థానాలలో కనిపిస్తున్నారు. నాయకత్వ నిర్వచనాన్ని మరింత బహుమితీయంగా మార్చి, నాయకత్వ లక్షణాలను విస్తృతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

మారుతున్న ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి శారీరక బలాల మీద కాకుండా నైపుణ్యాలపై ఆధారపడి ఉంది. సహజంగా మహిళలు వ్యూహాత్మక దృష్టితో ఆలోచించే విధానం సమాజ నిర్మాణం కోసం ఉపయోగపడుతుంది. మహిళలు నాయకత్వ బృందాలలో ఉన్నప్పుడు కరుణ వంటి లక్షణాలు నాయకత్వంలో భాగం అవుతున్నాయి.

గణపతిరాజు పావనీ దేవి 
వ్యాసకర్త ఆర్థిక శాస్త్ర లెక్చరర్‌

పితృస్వామ్యమే ముద్దాయి
స్త్రీ అనగానే కేవలం సౌందర్య భావనతో ప్రాచీన కవులు ఎన్నో కావ్యాలలో రకరకాలుగా వర్ణించారు. మహిళ అనే పదం ఈ మహిలో చాలా గొప్పది. ఒక మహిళను చూసే కళ్ళలో, మనసులో మార్పు వచ్చి తీరాలి. తనకు జన్మ నిచ్చిన స్త్రీ జాతిని గౌరవించకపోగా రక రకాలుగా అవమానించడం అమానుషం. క్షమించరాని నేరం. స్త్రీల దైన్యస్థితికి అతి ముఖ్యమైన కారణం పితృస్వామ్య వ్యవస్థ.

నిజానికి ఆదిమ సమాజంలో మాతృస్వామ్యం ఉండేది. స్త్రీ కేంద్రంగా సమాజం నడిచేది. కాలక్రమంలో స్త్రీలు ఉత్పత్తి పరికరాలకు దూరమ వడం, పురుషులు వాటిపై ఆధి పత్యం చలాయించడం, బానిస వ్యవస్థ, గుంపు పెళ్లి నుండి దంపతీ వివాహానికి వివాహ వ్యవస్థ పరిణామం చెందడం, వ్యక్తిగత ఆస్తి భావన పెరగడం, ఆయుధాల మీద పురు షుల ఆధిపత్యం వంటి అనేక కారణాల వల్ల స్త్రీ వెనక్కి నెట్టివేతకు గురై క్రమంగా పురుషాధిక్యత పాదుకు పోయింది.  

ఈ సంవత్సరం ‘ఆవిష్కరణ, సాంకేతికతల్లో లింగ సమానత్వం’ అంశాన్ని థీమ్‌గా మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఇది ఆహ్వానించదగినది. ఎందుకంటే... ‘ఐకాస’, ‘ఉమెన్స్‌ జెండర్స్‌ స్నాప్‌ షాట్‌– 2022’ నివేదిక ప్రకారం డిజిటల్‌ ప్రపంచంలో మహిళలు లేకపోవడం వల్ల గత పదేళ్లలో తక్కువ, మధ్య ఆదాయ దేశాల స్థూల జాతీయ ఉత్పత్తి తగ్గింది. ఈ విషయంలో ఏమీ చేయలేక పోయినట్లయితే ఈ నష్టం 2025 నాటికి ఇంకా పెరుగుతుంది.

స్త్రీలు విద్యావంతులు కానంత వరకూ ఏ దేశమూ బాగుపడదు. మన అభివృద్ధి అంతా స్త్రీల అభివృద్ధిపైనే ఆధారపడి ఉన్నది. అయితే పురుషులతో సమానంగా ఉద్యోగం చేస్తున్నా... భారతీయ సమాజంలో ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకం స్త్రీ బాధ్యత కాబట్టి ఆమెపై ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అన్ని విధులనూ మహిళ అత్యంత చాకచక్యంగా నిర్వర్తిస్తోంది.

స్వప్న కొండ 
వ్యాసకర్త తెలుగు ఉపాధ్యాయురాలు

అపర కాళీమాత కూడా...
స్త్రీ ప్రకృతికి ప్రతీక. అందానికే నిర్వచనం. ఇంటికి దీపం. అమృతాన్ని వర్షించే అమ్మగా, అనునయించే అక్కగా, అనురాగాన్ని పంచే చెల్లిగా, ఆత్మీయతను కురిపించే భార్యగా ఆమె ఒక కుటుంబానికి ఎంత సుపరిచితురాలో... ఒక టీచరుగా, డాక్టరుగా, పోలీస్‌ ఆఫీసరుగా, పైలెట్‌గా, రైతుగా, కూలీగా, ఇంటిపనులు చేసే మనిషిగా... ఇలా అన్ని హోదాలలో కూడా సమాజానికి అంతే సుపరిచితురాలు. భారతీయ సంస్కృతిలో స్త్రీలకు సముచిత స్థానాన్నే అందించారు.

మనం నిత్యం ఆరాధించే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలైన అమ్మవార్లు కూడా స్త్రీలే కదా. స్త్రీని ఒక దేవతలా చూడడం, ఆమెను జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది అనాదిగా మన రక్తంలోనే జీర్ణించుకుపోయింది. అయితే నేడు ఈ జాగ్రత్తనే కొన్ని సందర్భాలలో అతియై ఆడపిల్లల స్వేచ్ఛకు ఆటంకంగా మారు తోంది. సమాజంలోని కొన్ని దుస్సంఘటనలకు వెరసి ఇంట్లోవాళ్ళు విధించే ఆంక్షలు ఆడపిల్లల అభివృద్ధికి అవరోధాలుగా పరిణమించడంతో పాటు, పిల్లలకూ తల్లిదండ్రులకూ మధ్య అగా థాలను సృష్టిస్తున్నాయి. 

ప్రతి పరిణామం ఇంటి నుండే మొద లవ్వాలి. ఆది గురువులై అమ్మలు మంచి చెడుల వివేచన జ్ఞానాన్ని తమ పిల్లలకు రంగరించి ఎటువంటి ఆటుపోట్లనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని అలవరచాలి. భర్త అడుగుజాడల్లో నడిచిన సీతగా, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సావిత్రిగా, యుద్ధభూమిలో తోడు నిలిచిన సత్య భామగా, బుద్ధి కుశలతతో త్రిమూర్తులనే పసిబిడ్డలను చేసి లాలించిన అనసూయగా ఉంటూనే, అవసరమైతే ఇంతులు అపర కాళీ మాతలవ్వాలి. సమాజాభివృద్ధికి హేతువయ్యే ప్రతి పాత్రను సంపూర్ణంగా పండించాలి. 
– డా‘‘ బి. నీలిమా కృష్ణమూర్తి
సహాయ కార్మిక అధికారి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement