విద్య సమాజాభివృద్ధికి మూలం
తిరుపతి సిటీ: సమాజాభివృద్ధికి విద్య మూలమని తమిళనాడు గవర్నర్ రోశయ్య అన్నారు. తిరుపతిలో కేంద్రీయ విద్యాలయం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం గోల్డెన్ జుబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా తమిళనాడు గవర్నర్ రోశయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అలవర్చుకున్నప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోగలరన్నారు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన జరగాలని, అప్పుడే విద్యార్థులకు జ్ఞానాభివృద్ధి పెంపొంది, సమాజాభివృద్ధికి పాటుపడగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్నతికి సోపానం కేంద్రీయ విద్యాలయమని, అపారవిజ్ఞానంతో తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేందుకు కేంద్రీయ విద్యాలయం చక్కటి సోపానమన్నారు.
తిరుపతి ఎంపీ వరప్రసాద్ రావు మాట్లాడుతూ తన ఇద్దరు పిల్లలు ఇక్కడే చదివి, వైద్యులుగా స్థిరపడ్డారన్నారు. కేంద్రీయ విద్యాలయం నుంచి ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, పలు రంగాల్లో ఉన్నతస్థాయిలో స్థిరపడ్డారని చెప్పారు. కేంద్రీయ విద్యాలయం అభివృద్ధికి పూర్తి సహాయసహకారాలు అందిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ తాను కూడా ఈ స్కూల్ పూర్వవిద్యార్థినని గుర్తు చేసుకున్నారు. స్కూల్ అభివృద్ధికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు తనవంతు కృషి చేస్తానన్నారు.
పూర్వపు విద్యార్థులందరూ కలవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. పూర్వ విద్యార్థులందరూ కలసి స్కూల్ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేసి, రాబోయే రోజుల్లో అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని పలువురు పూర్వ విద్యార్థులు అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సతీష్‌కుమార్, డెప్యూటీ కమిషనర్ మణివన్నన్, పూర్వ విద్యార్థుల సంఘం నేత వెంకటరమణ, స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, పూర్వవిద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.