చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన బీసీ వెల్ఫేర్ కమిటీ
హైదరాబాద్: రాష్ట్రంలో వెనుకబడిన కులాల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపడుతున్న పథకాల అమలును అసెంబ్లీ బీసీ వెల్ఫేర్ కమిటీ సమీక్షించింది. ఈమేరకు కమిటీ చైర్మన్ , ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ అధ్యక్షతన బుధవారం అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశం జరిగింది. పొరుగు రాష్ట్రమైన ఏపీలో బీసీల కోసం తీసుకు వచ్చిన బీసీ సబ్-ప్లాన్‌పై అధ్యయనం చేసేందుకు ఈ కమిటీ చిత్తూరు జిల్లాకు వెళ్లాలని నిర్ణయించింది. బుధవారం రాత్రి బయలుదేరిన ఈ కమిటీ శుక్రవారం ఆ జిల్లాలో పర్యటించనుంది. కాగా పీయూసీ హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డును పరిశీలించింది. క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా పీయూసీ చైర్మన్ దివాకర్‌రావు సారథ్యంలో ఈ కమిటీ బుధవారం రింగురోడ్డు పనుల్లో జరిగిన అవకతవకలను పరిశీలించింది.
నిర్మాణ పనుల్లో రూ.9కోట్లు దుర్వినియోగం జరిగినట్లు కాగ్ గుర్తించిం దని, ఈ మేరకు విజిలెన్సు విచారణ జరిపించి దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అలాగే అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ హన్మంత్ షిండే నేతృత్వంలో క్షేత్ర స్థాయి పర్యటన జరిపింది. మరో వైపు అసెంబ్లీ మహిళా శిశు సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ రేఖా నాయక్ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమైంది. మహిళలు, శిశువుల కోసం అమలు చేస్తున్న పథకాల అమలు తీరును సమీక్షించింది.