న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 పరిస్థితి తీవ్రంగా ఉందనీ, కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెలిపింది. ‘దేశంలో ప్రతి రోజూ 30వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ముఖ్యంగా ఈ వైరస్ గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. ఇది సామాజిక వ్యాప్తికి సంకేతం’అని ఐఎంఏ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ డాక్టర్ వీకే మోంగా అన్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్‌ను అదుపు చేయడం చాలా కష్టమైన విషయమన్నారు. (సామాజిక వ్యాప్తి మొదలైంది: ఐఎంఏ)
దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలు కాలేదంటూ కేంద్రం చెబుతున్న నేపథ్యంలో ఐఎంఏ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతానికి ఢిల్లీలో కట్టడి చేసినా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితి మాటేమిటి? అని ఆయన అన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర సాయం తీసుకుని పరిస్థితిని నియంత్రించాలన్నారు. ‘వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరల్ వ్యాధిని కట్టడి చేయడానికి రెండే మార్గాలున్నాయి. ఒకటి, ఈ వ్యాధి సోకిన 70 శాతం మంది రోగ నిరోధకశక్తిని పెంచుకోవడం, రెండోది, మిగతా 30 శాతం మందికి రోగ నిరోధక శక్తిని కల్పించడం’అని డాక్టర్ మోంగా తెలిపారు. (కరోనా చికిత్సల్లో రోబో)
Comments
Please login to add a commentAdd a comment