ప్రగతిపై లాయర్లు దృష్టి సారించాలి
విశాఖపట్నం: న్యాయవాదులు తమ వ్యక్తిగత అభ్యున్నతితో పాటు సమాజ ప్రగతిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ చెప్పారు. విశాఖలోని ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో ఏయూ న్యాయ కళాశాల, విశాఖ న్యాయవాదుల సంఘం సంయుక్తంగా ‘ఎమర్జింగ్ ఇష్యూస్ రిలేటింగ్ టు ట్రయల్స్ ఇన్ సివిల్ అండ్ క్రిమినల్ మేటర్స్’ అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాది సమాజంలో ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తున్నాడన్నారు. నేటి ఆధునిక సమాజంలో వారి బాధ్యత, పరిధి విస్తృతమన్నారు. దేశంలో అవిద్య, పేదరికం,అసమానతలు వంటి అనేక సమస్యలు ప్రగతికి అవరోధాలుగా నిలుస్తున్నాయన్నారు.
సమాజానికి ఒక మార్గదర్శకుడు కావలసిన అవసరం ఉందన్నారు. సామాజిక ప్రగతిపై న్యాయవాదులు దృష్టిపెట్టాలని సూచించారు. యువ న్యాయవాదులను ఈ దిశగా నడిపించడానికి కృషి చేయాలని లేని పక్షంలో సమాజం ఇబ్బందుల్లో పడుతుందని చెప్పారు. చట్టం స్వేచ్చను పరిరక్షించినపుడే ప్రజాస్వామం నిలబడుతుందన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య మాట్లాడుతూ చట్టాలు పుస్తకాలకు మాత్రమే పరిమితమై న్యాయం లభించని పక్షంలో వ్యవస్థ పతనమవుతుందని చెప్పారు. వ్యాజ్యాలను జటిలం చేయాలనే ఆలోచనను న్యాయవాదులు విడనాడాలని సూచించారు. ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు, ఏయూ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డి.సూర్యప్రకాషరావు, విశాఖ న్యాయవాదుల సంఘం అద్యక్షుడు ఎన్.వి.బదరీనాథ్ ప్రసంగించారు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచించిన ఆరుసారాకథలు పుస్తకాన్ని జస్టిస్ ఎన్.వి రమణ ఆవిష్కరించి ఆర్.వి.శాస్త్రి కుటుంబ సభ్యులకు తొలి ప్రతిని అందజేశారు. జిల్లా జడ్జి వి.జయసూర్య, న్యాయవాదుల సంఘం కార్యదర్శి ఎన్.సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.