పని మొదలెట్టిన పరమ్‌ రుద్ర! | PM Modi launches 3 PARAM Rudra supercomputers | Sakshi
Sakshi News home page

పని మొదలెట్టిన పరమ్‌ రుద్ర!

Sep 30 2024 5:37 AM | Updated on Sep 30 2024 5:37 AM

PM Modi launches 3 PARAM Rudra supercomputers

దుమ్ము రేపుతున్న సూపర్‌ కంప్యూటర్లు 

సాంకేతిక రంగంలో భారత వాటా బిట్లు, బైట్లలోకాదు టెరా బైట్లు, పెటా బైట్లలో ఉండాలంటూ ప్రధాని మోదీ ఆవిష్కరించిన పరమ్‌ రుద్ర సూపర్‌ కంప్యూటర్లు మెరుపు వేగంతో పనిచేస్తున్నాయి. అత్యంత వేగంతో డేటాను ప్రాసెస్‌చేస్తూ అత్యంత క్లిష్టమైన లెక్కలను అలవోకగా చేసేస్తూ మన సత్తా చాటుతున్నాయి. వాతావరణ పరిశోధనల కోసం 850 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన హై–పెర్ఫామెన్స్‌ కంప్యూటింగ్‌ (హెచ్‌పీసీ) వ్యవస్థలయిన అర్క, అరుణికలను కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఈ సూపర్‌ కంప్యూటర్ల కథాకమామిషు ఏమిటో చూద్దామా...! 

పరమశివుని పేరుతో పరమ్‌ రుద్ర 
పూర్తి దేశీయంగా తయారైన ఈ సూపర్‌ కంప్యూటర్లకు పరమ్‌రుద్ర అని పేరుపెట్టారు. లయకారుడైన పరమశివుని రౌద్రావతారానికి గుర్తుగా కేంద్రం వీటికి ఇలా నామకరణం చేసింది. జాతీయ సూపర్‌ కంప్యూటింగ్‌ విధానంలో భాగంగా రూ.130 కోట్ల ఖర్చుతో వీటిని తయారుచేసి పుణె, ఢిల్లీ, కోల్‌కతాల్లో ఏర్పాటుచేశారు. హెచ్‌పీసీ వ్యవస్థలు సంక్షిష్టమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో శాస్త్రవేత్తలకు ఇవి ఎంతగానో సాయపడతాయి. వందల కంప్యూటర్లు విడిగా ఎంతో శ్రమతో సుదీర్ఘకాలంపాటు చేసే పనిని ఇవి శరవేగంగా చక్కబెట్టేస్తాయి.  

నవ్యావిష్కరణకు రాచబాటలు 
యువ శాస్తవేత్తలు అందుబాటులో ఉన్న డేటాను విశ్లేíÙంచి, తమ పరిశోధనలకు అన్వయించి కొత్త ఆవిష్కరణలు చేసేందుకు పరమ్‌రుద్ర దోహదపడుతుంది. వ్యవసాయం, విపత్తు నిర్వహణ రంగాల అభివృద్ధిలో సూపర్‌కంప్యూటర్ల పాత్ర కీలకమైంది. సువిశాల విశ్వంలో కొత్త ప్రదేశాలపై దృష్టిపెట్టడం మొదలు వాతావరణ సూచనలను అత్యంత ఖచి్చతత్వంతో ఇవ్వడందాకా బహుముఖ ప్రయోజనాలు వీటి వల్ల సాధ్యం. వర్షాలు, వరదలు, వడగల్లు, కరువు కాటకాల రాకను ముందస్తుగా అంచనావేయొచ్చు. 

అర్క, అరుణిక పనేంటి? 
వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించేందుకు, వాతావరణ శాస్త్రంలో పరిశోధనల కోసం రూపొందించిన హెచ్‌పీసీలే వాటికి ఆర్క, అరుణిక. పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రోపికల్‌ మెటరాలజీ, నోయిడాలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌ వెదర్‌ ఫోర్‌క్యాస్టింగుల్లో వీటిని ఏర్పాటు చేశారు. ప్రతీ ఆరు కి.మీ. పరిధిలో వాతావరణంలో మార్పులు, వర్షాలు, ఉరుములు, పిడుగులు పడే అవకాశాలు, ఆకస్మిక వరదలనూ వీటి సాయంతో అత్యంత కచి్చతత్వంతో ముందుగానే తెలుసుకోవచ్చు. కేవలం కిలోమీటర్, అంతకన్నా తక్కువ ప్రాంతాలపైనా శోధన చేసి ఆ డేటాను అర్క, అరుణికల ద్వారా పక్కాగా విశ్లేషించవచ్చు. 

ఏఏ పనుల్లో వాడతారు? 
→ వాతావరణ మార్పులు, పరమాణు జీవశాస్త్రం, జన్యుమార్పిడి విధానాలు, కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్, ఇంజనీరింగ్, మెటీరియల్‌ సైన్స్, రక్షణ, గగనతల, తదితర అధునాతన శాస్త్రసాంకేతిక రంగాల్లో ఈ సూపర్‌ కంప్యూటర్లను వాడతారు. 
→ పుణెలో ఏర్పాటుచేసిన పరమ్‌రుద్ర కంప్యూటర్‌ను జెయింట్‌ మీటర్‌ రేడియో టెలిస్కోప్‌ కోసం వినియోగంలోకి తెచ్చారు. 
→ వేల సీపీయూలు, 90 అత్యంత శక్తివంత ఎన్‌విడియా ఏ100 జీపీయూలు, 35 టెరాబైట్ల మెమరీ, 2 పెటాబైట్ల స్టోరేజీ దీని సొంతం. 
→ సువిశాల విశ్వంలో అత్యంత శక్తివంత అయస్కాంత క్షేత్రం నుంచి దూసుకొచ్చే రేడియో విస్ఫోటం (ఫస్ట్‌ రేడియో బరస్ట్‌) మూలాలను కనుగొనేందుకు టెలిస్కోప్‌ సేకరించిన డేటాను ఈ కంప్యూటర్‌తో విశ్లేíÙస్తారు. తద్వారా విశ్వంపై అవగాహన మరింతగా పెరిగే ఆస్కారముంది. 
→ ఢిల్లీలోని ఇంటర్‌ యూనివర్సిటీ యాక్సిలిరేటర్‌ సెంటర్‌లో మరో పరమ్‌ రుద్రను ఏర్పాటుచేశారు. 
→ మెటీరియల్‌ సైన్స్, అణు భౌతిక శా్రస్టాలపై పరిశోధనలో ఇది సాయపడనుంది. – కోల్‌కతాలోని ఎస్‌ఎన్‌ బోస్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బేసిక్‌ సైన్సెస్‌ కేంద్రంలోనూ పరమ్‌రుద్రను ఏర్పాటుచేశారు. 
→ దీన్ని భౌతికశాస్త్రం, ఖగోళశాస్త్రం, భూవిజ్ఞానశాస్త్రంలో పరిశోధనలకు వాడనున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement